బీకేఎస్‌లో ఇరువర్గాల ఘర్షణ
బుక్కరాయసముద్రం: తహసీల్దార్ కార్యాలయం సమీపంలో మంగళవారం ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఇటీవల అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు అంబేడ్కర్ సర్కిల్ పేరిట బోర్డు నాటిన సంగతి తెలిసిందే. అయితే ఈ బోర్డును రెండు రోజుల క్రితం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. అదే స్థలంలో అంబేడ్కర్ సర్కిల్ అంటూ మరో బోర్డు నాటడానికి దళిత సంఘాల నేతలు సిద్ధమయ్యారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొందరు ఇది కొండమీద రాయుని స్వామి ద్వారం అని, ఇక్కడ బోర్డు ఏర్పాటు చేయొద్దని అడ్డుచెప్పారు. దీంతో మంగళవారం రాత్రి ఇరువర్గాల మధ్య గొడవ చోటు చేసుకుని ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాల వారికి నచ్చజెప్పారు. దీంతో బోర్డు ఏర్పాటు విషయం తాత్కాలికంగా వాయిదా పడింది.


