రూ.8.66 లక్షల విలువైన ఎరువుల విక్రయాల నిలిపివేత
కళ్యాణదుర్గం రూరల్: స్థానిక సాయి ఫర్టిలైజర్స్, రాయల్ ట్రేడర్స్, జయ మహాలక్ష్మి ఫర్టిలైజర్స్ దుకాణాల్లో మంగళవారం ఉదయం వ్యవసాయాధికారులు తనిఖీలు చేపట్టారు. రికార్డులకు, నిల్వలకు పొంతన లేని రూ.8,66,242 విలువైన ఎరువులు, విత్తనాల విక్రయాలను నిలుపుదల చేస్తూ నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో వ్యవసాయ స్క్వాడ్ అధికారి రవి, ఏడీఏ యల్లప్ప, ఏఓ శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయం లాభదాయకం : డీపీఎం
గుమ్మఘట్ట: ప్రకృతి వ్యవసాయం లాభదాయకంగా ఉంటుందని రైతులకు డీపీఎం లక్ష్మానాయక్ సూచించారు. గుమ్మఘట్ట మండలం 75వీరాపురం సమీపంలోని నారాయణనాయక్ పొలంలో ప్రకృతి వ్యవసాయం కింద సాగు చేసిన కంది, ఆముదం, సజ్జ, గోరుచిక్కుడు, అనుముల పంటలను మంగళవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. పీఎండీఎస్ విత్తనాలతో జీవవైవిద్యాన్ని అనుసరిస్తూ పంటల సాగు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చునని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు.
డిటోనేటర్ల అపహరణ
పెద్దవడుగూరు: మండలంలోని కోనాపురం సమీపంలో ఉన్న కార్తికేయ ఎంటర్‌ప్రైజేస్ గోదాములో నిల్వ చేసిన డిటోనేటర్లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గోదాముకు కన్నం వేసి లోపలకు ప్రవేశించిన దుండగులు.. ఆర్డినరీ డిటోనేటర్లు, 2,500 కిలోల పవర్ జెల్, 4,500 డీకార్డులను అపహరించుకెళ్లారు. వీటి విలువ రూ.8లక్షలు ఉంటుందని కార్తికేయ ఎంటర్‌ప్రైజేస్ మేనేజర్ శ్యాంకిరణ్ తెలిపారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పెద్దవడుగూరు పీఎస్ ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.
డిటోనేటర్ల స్వాధీనం
యాడికి: మండలంలోని చందన గ్రామ సమీపంలో కల్లం దొడ్డిలో దాచిన డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, పెద్దవడుగూరు సీఐ రామసుబ్బయ్య, ఎస్‌ఐ ఆంజనేయులు మంగళవారం రాత్రి చందన గ్రామంలో తనిఖీలు చేపట్టి భారీగా దాచి ఉంచిన డినోటేర్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పెద్దవడుగూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు.
పెరుగుతున్న అరటి ధరలు
● జిల్లా ఉద్యాన అధికారి ఉమాదేవి
పుట్లూరు: అరటి రైతులు ఎవరూ నిరుత్సాహానికి గురికాకూడదని, కొన్ని రోజులుగా అరటి ధరలు పెరుగుతూ వస్తున్నాయని జిల్లా ఉద్యాన అధికారి ఉమాదేవి అన్నారు. మంగళవారం పుట్లూరు మండలం సూరేపల్లి, కడవకల్లు గ్రామాల్లో ఆమె పర్యటించి, అరటి తోటలను పరిశీలించారు. సకాలంలో కోతలు చేపట్టాలన్నారు. ఫ్రూట్ కేర్ యాక్టివిటీ సక్రమంగా చేపట్టడం ద్వారా మంచి నాణ్యతతో పాటు అధిక దిగుబడి వస్తుందన్నారు. కార్యక్రమంలో ఉద్యాన సహాయ సంచాలకులు దేవానంద్, ఉద్యాన అధికారి నెట్టికంటయ్య, ఉద్యాన విస్తరణ అధికారి రామాంజనేయులు, ఉద్యాన సహాయకురాలు రస్మిత, రైతులు పాల్గొన్నారు.
రూ.8.66 లక్షల విలువైన ఎరువుల విక్రయాల నిలిపివేత


