తాగుడుకు డబ్బివ్వలేదని వ్యక్తి బలవన్మరణం
రాప్తాడు రూరల్: తాగుడుకు డబ్బివ్వకపోవడంతో క్షణికావేశంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కనగానపల్లి మండలం యలకుంట్ల గ్రామానికి చెందిన కామేశ్వరగౌడ్ (46), నాగలక్ష్మి దంపతులు దాదాపు పాతికేళ్ల క్రితం అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లికాలనీ పంచాయతీ నందమూరినగర్‌కు వలస వచ్చారు. ఆటో డ్రైవర్‌గా కామేశ్వరగౌడ్, ప్రభుత్వాస్పత్రిలో శానిటేషన్ వర్కర్‌గా నాగలక్ష్మి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఇటీవల మద్యానికి బానిసైన కామేశ్వరగౌడ్ తరచూ తాగుడుకు డబ్బుల కావాలని, భార్య, కుమారులను వేదించేవాడు. సోమవారం రాత్రి కూడా మద్యం కొనుగోలుకు డబ్బివ్వాలని భార్యతో గొడవ పడ్డాడు. ఆమె తన వద్ద లేవనడంతో ఆటో తీసుకుని వెళ్లిపోయాడు. ఇంటెల్ పాత కళాశాల భవనం వద్దకు చేరుకుని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ రాంబాబు అక్కడకు చేరుకుని మృతుడిని కామేశ్వరగౌడ్‌గా అనుమానిస్తూ సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని నిర్ధారించారు. బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
విద్యా వలంటీర్ పోస్టుల కోసం
దరఖాస్తుల స్వీకరణ
అనంతపురం సిటీ: ఐదు నెలల కాలానికి సంబంధించి విద్యా వలంటీర్ల పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 5వ తేదీలోపు జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు. అనంతపురం జిల్లాకు 80, శ్రీసత్యసాయి జిల్లాకు 68 విద్యావలంటీర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఖాళీలు, ఇతర వివరాలకు www.deoananathapuramu.bolgspot. com వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించారు.
ఎద్దుల బండి నుంచి జారి పడి వ్యక్తి మృతి
బ్రహ్మసముద్రం: ప్రమాదవశాత్తు ఎద్దుల బండి నుంచి జారి పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో నివాసముంటున్న పవన్ (35)కు భార్య రత్నమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి పలువురు గ్రామస్తులు ఎద్దుల బళ్లు కట్టుకుని సూగేపల్లిలో జరుగుతున్న జాతరకు బయలుదేరారు. అప్పటికే ఫుల్లుగా మద్యం సేవించిన పవన్... తాను కూడా జాతరకు వస్తానంటూ పట్టుబట్టి ఎద్దుల బండిలో ఎక్కాడు. గ్రామం నుంచి ఒక కిలోమీటరు దూరం ప్రయాణించిన తర్వాత అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని కళ్యాణదుర్గంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
‘స్వమిత్వ’ సర్వే పక్కాగా జరగాలి
● జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడు
అనంతపురం ఎడ్యుకేషన్: గ్రామీణ ప్రాంతాలలో ఆస్తులపై యజమానులకు చట్టపరమైన గుర్తింపు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వమిత్వ యోజన పథకం సర్వేలో జిల్లా వెనుకబడి ఉందని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు తెలిపారు. స్వమిత్వ యోజన పథకం సర్వే ప్రక్రియపై మంగళవారం సర్వే అధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ అధికారులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, సర్వేయర్లతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. జిల్లాలో మొత్తం 276 రెవెన్యూ గ్రామాల పరిధిలో 324 గ్రామాలు ‘స్వమిత్వ’ కింద ఎంపిక చేశారన్నారు. సర్వే పక్కాగా జరగాలన్నారు. గ్రామకంఠాలను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమం పూర్తయితే యాజమాన్య హక్కు పత్రం ఇవ్వడానికి వీలుంటుందన్నారు.
డీపీఓను కలిసిన జీఎస్‌డబ్ల్యూఎస్ మండల ఇన్‌చార్జ్‌లు
డిప్యూటీ ఎంపీడీఓలుగా పదోన్నతులు పొంది గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల (జీఎస్‌డబ్ల్యూఎస్) మండల ఇన్‌చార్జ్‌లుగా నియమితులైన వారు మంగళవారం డీపీఓను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ పని విషయంలో ఎవరూ రాజీ పడొద్దన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు.
తాగుడుకు డబ్బివ్వలేదని వ్యక్తి బలవన్మరణం


