
ఓఎంసీలో చోరీలపై వీడిన మిస్టరీ
రాయదుర్గం టౌన్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)లో సీబీఐ అధికారులు సీజ్ చేసిన భారీ వాహనాల చోరీ కేసులో మిస్టరీ వీడింది. వాహనాలను ముక్కలుగా చేసి తరలిస్తున్న ముఠా సభ్యులను గురువారం డి.హీరేహాళ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం రాయదుర్గం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ వెల్లడించారు. ఓఎంసీలో గురువారం ఉదయం అపరిచిత యువకుల సంచారాన్ని పసిగట్టిన స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన డి.హీరేహాళ్ ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి.. సిబ్బందితో కలసి అక్కడకు చేరుకున్నారు. ఐరన్ ఓర్‌ను వెలికి తీసేందుకు ఉపయోగించే భారీ యంత్రాలను ముక్కలుగా చేస్తున్న ఏడుగురు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఎల్‌పీజీ సిలిండర్, 2 ఆక్సిజన్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్లు, లగేజీ ఆటోను స్వాధీనం చేసుకుని పీఎస్‌కు తరలించారు. విచారణ అనంతరం పట్టుబడిన వారిలో బళ్లారి జిల్లా సండూరు తాలూకా కురేకుప్ప గ్రామానికి చెందిన వీరిలో మారుతి, వీరేష్, గాదె లింగప్ప, గణేష్ , హరిజన బసవరాజు, ఉమాపతి, దొడ్డబసప్ప ఉన్నారు. కాగా, వాహనాల విడి భాగాలను, తుక్కు కింద మార్చిన ఇనుమును కొనుగోలు చేసిన ఉచ్చప్ప, వీరేష్, ప్రకాష్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇప్పటికే మూడు వాహనాలు
తుక్కుకు విక్రయం
కురేకుప్పకు చెందిన మారుతి ఓఎంసీలో సీబీఐ అధికారులు సీజ్ వాహనాలను తుక్కు కింద విక్రయించే పథకం రచించాడు. ఈ క్రమంలో గత నెల 27, 29 తేదీల్లో ఓఎంసీ గనుల్లో దూరి అక్కడ ఉన్న జేసీబీ, హిటాచీ, మొబైల్ క్రషర్‌లను గ్యాస్ కట్టర్లతో కోసి, లగేజీ ఆటోలలో తరలించి కర్ణాటకలోని ధర్మసాగరానికి చెందిన వీరేష్, ఉచ్చప్ప, ప్రకాష్‌కు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. తొలిసారి ఎవరూ గుర్తించక పోవడంతో మరోసారి ఓఎంసీలో వాహనాలను తుక్కుగా మార్చి సొమ్ము చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలో బుధవారం మరోసారి ఓఎంసీ మైనింగ్‌లోకి అక్రమంగా ప్రవేశించి మొబైల్ క్రషర్‌ను కట్ చేసి గురువారం టాటా లగేజీ ఆటోలో తరలించడానికి ప్రయత్నిస్తుండగా పోలీసు సిబ్బంది రామాంజనేయులు, మల్లికార్జున, కృష్ణారెడ్డి, రంగారెడ్డి, నాగరాజు అక్కడు చేరుకుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
సీజ్ చేసిన మైనింగ్ వాహనాలను కట్ చేసి తరలిస్తున్న ముఠా సభ్యుల అరెస్ట్