
డీఎల్ లేని ఉద్యోగుల జీతాలు నిలిపి వేయండి
తాడిపత్రి రూరల్: డ్రైవింగ్ లైసెన్స్‌లేని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తక్షణమే నిలిపి వేయాలని మున్సిపల్ అధికారులను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి ఆదేశించారు. తాడిపత్రిలోని తన స్వగృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడిపత్రి కేంద్రంగా పనిచేస్తున్న పోలీసులకే డ్రైవింగ్ లైసెన్స్, వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటీవల స్కూటీ నడుపుతున్న మహిళా కానిస్టేబుల్‌ను ఆపి లైసెన్స్ గురించి అడిగితే.... లేదని సమాధానమిచ్చారని గుర్తు చేశారు. ఇలాంటి వారు ముందుగా డీఎల్ తీసుకోవాలని సూచించారు. తాడిపత్రిలోని వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో 70 శాతం మందికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని, ఇలాంటి వారిని గుర్తించి వారి జీతాలు నిలిపివేయాలని ఆదేశించినట్లు గుర్తు చేశారు. ఆర్టీఏ, పోలీసు శాఖ సమన్వయంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఉచితంగానో లేదా నామమాత్రపు రుసుంతోనో ఎల్‌ఎల్‌ఆర్‌లు, డీఎల్‌లు జారీకి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంగా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని సచివాలయాల ద్వారా వాహనదారులకు ఎల్‌ఎల్‌ఆర్‌లు మంజూరు చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
పోలీసులకే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఎలా?
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ