
‘కూటమి’ దగా చేసింది
● ధాన్యం కొనుగోలు చేసి డబ్బులివ్వలేదు
● 400 మంది రైతులకు రూ.6.96 కోట్ల బకాయిలు
● మూడు నెలలవుతున్నా పట్టించుకోలేదు
● కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వం తమను దగా చేసిందంటూ రైతులు వాపోయారు. ధాన్యం కొనుగోలు చేసి మూడు నెలలవుతున్నా నేటికీ డబ్బు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంఽధించి డబ్బు తక్షణమే చెల్లించాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో బొమ్మనహాళ్, కణేకల్లు రైతులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున, రైతులు మాట్లాడారు. వరి మద్ధతు ధర క్వింటా రూ.2,320 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసి, ఏడు రోజుల్లోపు బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ చేస్తుందని అధికారులు తెలిపారన్నారు. దీంతో బొమ్మనహాళ్ మండల పరిధిలో 120 మంది రైతులు, కణేకల్లు మండలంలో 280 మంది రైతులు మద్ధతు ధరతో పంటను ప్రభుత్వానికి విక్రయించారన్నారు. దాదాపు 400 మంది రైతులకు రూ.6,96,02,656 చెల్లించకుండా మూడు నెలలుగా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. కార్యాలయాలు, సొసైటీల చుట్టు తిరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సేద్యం పనులు చేపట్టాల్సిన ప్రస్తుత తరుణంలో విత్తనాలు, ఎరువుల కొనుగోలు, ఇతర పనులకు పెట్టుబడులు లేక ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం డబ్బు చెల్లించకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం డీఆర్‌ఓ ఎ.మలోలను ఆయన చాంబర్‌లో నాయకులు, రైతులు కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ, రైతు సంఘం నాయకులు నారాయణస్వామి, నాగార్జున, తిప్పేస్వామి, తేజ, రైతులు పాల్గొన్నారు.