వద్దొద్దు.. ఇప్పుడే వద్దు! | - | Sakshi
Sakshi News home page

వద్దొద్దు.. ఇప్పుడే వద్దు!

Jul 2 2025 5:31 AM | Updated on Jul 2 2025 5:31 AM

వద్దొద్దు.. ఇప్పుడే వద్దు!

వద్దొద్దు.. ఇప్పుడే వద్దు!

‘దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదు’ అన్న చందంగా మారింది జిల్లా హెచ్చెల్సీ అధికారుల తీరు. ప్రకృతి కరుణించడంతో నిండుకుండలా మారిన తుంగభద్ర డ్యాం నుంచి జిల్లాకు నీటి విడుదలకు టీబీ బోర్డు సిద్ధమైనా.. హెచ్చెల్సీ అధికారులు మాత్రం ఇప్పుడే వద్దంటూ తిరకాసు పెట్టారు.

ఈ నెల 10న హెచ్చెల్సీకి నీటి విడుదలకు టీబీ బోర్డు సుముఖత

వద్దంటూ హెచ్చెల్సీ అధికారుల తిరకాసు

అధికారుల నిర్ణయంతో

ఆయకట్టు రైతులకు తీరని నష్టం

అనంతపురం సెంట్రల్‌: హెచ్చెల్సీ అధికారుల తాజా నిర్ణయం ఆయకట్టు రైతులకు తీరని నష్టం కలిగించేలా మారింది. జిల్లాలో ముందస్తుగా వర్షాలు కురిసినా ప్రస్తుతం వరుణుడు ముఖం చాటేశాడు. కానీ ఎగువన కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర జలాశయానికి కొద్దిరోజులుగా భారీ స్థాయిలో వరద చేరుకుంటోంది. త్వరలో పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 10 నుంచి హెచ్చెల్సీకి నీటిని విడుదల చేస్తామని బోర్డు అధికారులు ప్రకటించారు. ఈ ప్రకటనతో జిల్లా హెచ్చెల్సీ అధికారులు హర్షం వ్యక్తం చేయాల్సింది పోయి... ఇప్పుడే అవసరం లేదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ నీటి విడుదల ఇప్పుడే వదంటూ బోర్డుపై ఒత్తిళ్లు తీసుకెళ్లారు.

నత్తనడకన పనులు చేపట్టి..

ఉమ్మడి జిల్లాకు వరదాయినిగా తుంగభద్ర జలాశయం నిలిచింది. కొన్నేళ్లుగా చెప్పుకునే స్థాయిలో వర్షాలు వస్తుండడంతో దాదాపు లక్ష ఎకరాలకు పైగా సాగునీరు, ఉమ్మడి జిల్లాకు తాగునీరు అందిస్తున్నారు. ఇంతటి మహోన్నతమైన ప్రాజెక్ట్‌పై అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. హెచ్చెల్సీ ప్రధాన కాలువపై కల్వర్టులు కూలిపోవడంతో పలు చోట్ల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటరీల మరమ్మతు పనులు కూడా చేపట్టాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి గత జనవరిలో దాదాపు రూ. 30 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి. వెనువెంటనే పనులు చేపట్టాల్సింది పోయి ఏప్రిల్‌ వరకూ పట్టించుకోలేదు. ప్రస్తుతం కూడా నత్తనడకన పనులు సాగుతున్నాయి. ఈ క్రమంలోహెచ్చెల్సీకి నీరు విడుదలైతే కాలువకు గండ్లు పడే ప్రమాదముంది. కల్వర్టులు, ఇతర పనులు జరుగుతున్నాయంటూ మరో పదిరోజులు గడువు కావాలని హెచ్చెల్సీ అధికారులు విజ్ఞప్తులపై విజ్ఞప్తులు చేస్తున్నారు. ఫలితంగా ఈ ఏడాది హెచ్చెల్సీ రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో

భారీ నష్టం

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని తీసుకునే అవకాశముంది. అయితే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తుంగభద్ర జలాశయం నుంచి జిల్లాకు కేటాయించిన నీటి కోటాలో ఈ ఏడాది భారీ కోత పడింది. గతేడాది భారీ వర్షాలకు ఒక గేటు కొట్టుకుపోవడంతో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ ఉంచేందుకు వీలు కాదని ఇంజనీరింగ్‌ నిపుణులు స్పష్టం చేశారు. వాస్తవానికి కొత్త గేటు అమర్చడానికి ఐదారు నెలలకు పైగా సమయం ఉన్నా.. కర్ణాటక ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చినా గేటు ఏర్పాటు అంశంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. దీంతో టెండర్లు పిలవడంలో జాప్యం చోటు చేసుకుని తాత్కలికంగా అమర్చిన గేటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో టీబీ డ్యాంలో 80 టీఎంసీలకు మించి నీటి నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. అంతకు మించి నీరు చేరుకుంటే దిగువకు వదిలేయాల్సిందే.

ఆయకట్టుకు తీరని నష్టం

దామాషా ప్రకారం 140 టీఎంసీల నీటి లభ్యత ఉంటే హెచ్చెల్సీకి 32 టీఎంసీల నికర కేటాయింపులు ఉంటాయి. ఈసారి తుంగభద్ర జలాశయం భద్రత దృష్ట్యా 80 టీఎంసీలకు మించి నిల్వ ఉంచరాదని నిర్ణయించారు. దీంతో హెచ్చెల్సీకి కేవలం 18.396 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించారు. ఇందులో 10 టీఎంసీలు తాగునీటి అవసరాలకు పోను, మిగిలిన 8.396 టీఎంసీల్లో ప్రవాహ నష్టాలు ఉంటాయి. ఇక మిగిలిన నీటిని ఆయకట్టుకు అందించాలి. ఫలితంగా హెచ్చెల్సీ పరిధిలో లక్ష ఎకరాలకు పైగా పంటల సాగు ప్రశ్నార్థకమైంది. ఇది హెచ్చెల్సీ ఆయకట్టు రైతులకు తీరని నష్టాన్ని చేకూరుస్తోంది. తుంగభద్ర నుంచి నీరు విడుదలయ్యే సమయం దగ్గరలోనే ఉందని తెలిసినా పనులు వేగవంతం చేయించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. కూటమి ప్రజాప్రతినిధులు కూడా తమకు ఆదాయం సమకూరే పనులపై మాత్రమే శ్రద్ద చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిండుకుండను తలపిస్తున్న తుంగభద్ర డ్యాం

టీబీ డ్యాంకు తగ్గిన వరద

బొమ్మనహాళ్‌: తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఆదివారం 65 వేల క్యూసెక్కులు, సోమవారం 40 వేల క్యూసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో మంగళవారం సాయంత్రానికి 33,916 క్యూసెక్కులకు పడిపోయింది. జలాశయం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో శివమొగ్గలోని అప్పర్‌ తుంగా ప్రాజెక్ట్‌ (గాజునూరు జలాశయం) నుంచి దిగువకు నీటి విడుదలను నిలిపివేయడంతో టీబీ డ్యాంకు వచ్చే వరద సగానికి తగ్గింది. 80 టీఎంసీలకు చేరితే డ్యాం క్రస్ట్‌ గేట్లు ఎత్తి నదికి వదులుతారు. ఈ లెక్కన గేట్లు ఎత్తడానికి మరో రెండు, మూడు రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈనెల 10న తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు నీటిని విడుదల చేయనుండడంతో రైతులు వరిసాగుకు సిద్ధమయ్యారు. ప్రసుత్తం జలాశయంలో నీటి నిల్వ 1,633 అడుగులకు గాను 1,624.38 అడుగులకు చేరుకుంది. అవుట్‌ఫ్లో 2,389 క్యూసెక్కులుగా ఉంది.

ఇంకా నిర్ణయం తీసుకోలేదు

హెచ్చెల్సీకి నీటిని తీసుకోవడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రైతులకు అవసరముందో.. లేదో.. అనే అంశంపై నీటి సంఘాల నాయకులతో చర్చిస్తాం. అవసరముందని చెబితే తప్పకుండా తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి నీటిని తీసుకుంటాం. ఆలస్యమైనా పర్వాలేదని అంటే పనులను వేగవంతంగా పూర్తి చేసి, నీటిని తీసుకుంటాం.

– విశ్వనాథరెడ్డి, ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ,హెచ్చెల్సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement