
ప్రమాదంలో యువకుడి మృతి
కళ్యాణదుర్గం రూరల్: లారీ ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామ సర్పంచ్ దుర్గమ్మ భర్త హనుమంత రాయుడు వైఎస్సార్‌సీపీలో కీలక కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడు. వీరికి రెండేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. కళ్యాణదుర్గంలో మంగళవారం జరిగిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు సిద్ధమైన హనుమంత రాయుడు తన ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. కళ్యాణదుర్గం సమీపంలోకి చేరుకోగానే మల్లాపురం రోడ్డు వద్ద వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొంది. హనుమంతరాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాదంలో హనుమంతరాయుడు మృతి చెందిన విషయం తెలియగానే నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు, రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, తదితరులతో కలసి ఘటనా స్థలానికి చేరుకుని హనుమంతరాయుడి మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మృతుడు సర్పంచ్ భర్త

ప్రమాదంలో యువకుడి మృతి