నేడు శ్రీవారి కల్యాణోత్సవం
ఉరవకొండ రూరల్: పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు బుధవారం హనుమద్ వాహనంపై విహరించారు. ఉదయం స్వామి వారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం భూదేవి, శ్రీదేవి సమేతంగా హనుమద్ వాహనంపై కొలువు దీర్చి ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సాకే రమేష్‌బాబు, అర్చకులు ద్వారకానాథచార్యులు, బాలాజీస్వామి, ఉత్సవ ఉభయదాతలు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గుర్రం సుధాకర్, గుర్రం రవీంద్రనాథ్ పాల్గొన్నారు.
● బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అత్యంత కీలకమైన స్వామివారి కల్యాణోత్సవం ఉంటుంది. అలాగే, గరుడ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
పిడుగుపాటుతో గొర్రెల కాపరి మృతి
కళ్యాణదుర్గం రూరల్: పిడుగుపాటుతో గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన మండలంలోని మానిరేవు పంచాయతీ ఓబుళాపురంలో జరిగింది. వివరాలు.. ఓబుళాపురం గ్రామానికి చెందిన రామలింగ (40)కు భార్య అశ్విని, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. గొర్రెల కాపరి అయిన రామలింగ రోజులాగే బుధవారం తన గొర్రెలను మేపు కోసం గ్రామ సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే వర్షం కురవడంతో ఓ చెట్టు చాటుకి వెళ్లాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో రామలింగ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక రైతులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రామలింగ మృతి చెందడంతో భార్యాపిల్లలు బోరున విలపించారు.
పాలిసెట్‌లో 93 శాతం ఉత్తీర్ణత
అనంతపురం: డిప్లొమో కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించిన ఏపీ పాలిసెట్ –2025లో జిల్లా విద్యార్థులు 93.11 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 7,908 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 7,363 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 4,824 మంది హాజరు కాగా, 4,443 (91.89 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. బాలికలు 3,084 మంది హాజరు కాగా, 2,930 (95.01 శాతం) పాస్ అయ్యారు.
హారికకు మొదటి ర్యాంకు
పాలిసెట్‌లో జిల్లాకు చెందిన నిమ్మనపల్లి హారిక మోహన్ రాష్ట్ర స్థాయిలో 54వ ర్యాంకు, జిల్లాలో మొదటి ర్యాంకు సాధించింది. మొత్తం 119 మార్కులతో సత్తా చాటింది. మేథమేటిక్స్‌లో 49 మార్కులు, ఫిజిక్స్‌లో 40, కెమిస్ట్రీలో 30 మార్కులు సాధించింది.
● పగిడి మహమ్మద్ అస్లాం జిల్లా స్థాయి రెండో ర్యాంకు(రాష్ట్ర స్థాయిలో 107)సాధించాడు. మొత్తం 118 మార్కులతో ప్రతిభ కనబరిచాడు. ఈ విద్యార్థికి మేథమేటిక్స్‌లో 49 మార్కులు, ఫిజిక్స్‌లో 39, కెమిస్ట్రీలో 30 మార్కులు వచ్చాయి.
మహిళపై హోంగార్డు దాడి
పుట్లూరు:మండలంలోని కడవకల్లు గ్రామంలో హోంగార్డు దాడి చేయడంతో ఓ మహిళ గాయపడింది. బాధితురాలు తెలిపిన మేరకు.. కడవకల్లు గ్రామంలో తనుజ ఇంటి పక్కనే హోంగార్డు రాజశేఖర్ నివాసముంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం తన ఇంటి వద్ద తనుజ దుస్తులు ఉతుకుతున్న సమయంలో రాజశేఖర్ ద్విచక్ర వాహనంపై వెళుతూ తన కాలు తగిలించాడు. దీంతో ఆమె చూసుకుని వెళ్లాలంటూ హోంగార్డుకు సూచించింది. ఆ సమయంలో హోంగార్డు రెచ్చిపోయి ‘నాకే చెబుతావా?’ అంటూ ఆమె గొంతు పట్టుకుని నోటిని అదిమిపెట్టి విచక్షణారహితంగా చితకబాదాడు. గాయపడిన బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదుకు ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నట్లుగా తెలిసింది. దాడికి పాల్పడిన హోంగార్డును కాపాడేందుకు కేసును నిర్వీర్యం చేస్తున్నారంటూ కడవకల్లు వాసులు అసహనం వ్యక్తం చేశారు.

హనుమద్ వాహనంపై నృసింహుడి విహారం

పగిడి మహమ్మద్ అస్లాం జిల్లా స్థాయి రెండో ర్యాంకు

పాలిసెట్‌లో హారికకు మొదటి ర్యాంకు