చదివేద్దాం.. ఓ గాంధీ పుస్తకం | - | Sakshi
Sakshi News home page

చదివేద్దాం.. ఓ గాంధీ పుస్తకం

Jun 8 2025 12:52 AM | Updated on Jun 8 2025 12:52 AM

చదివే

చదివేద్దాం.. ఓ గాంధీ పుస్తకం

● బాపు ఒక చరిత్ర కాదు.. జీవన పాఠం ● ద్వారకానగర్‌ పౌర గ్రంథాలయంలో ‘గాంధియానా’ ● మహాత్ముని జీవిత విశేషాల పుస్తకాల ప్రత్యేక విభాగం

సీతంపేట(విశాఖ): జాతిపిత మహాత్మా గాంధీ కేవలం స్వాతంత్య్ర సమరయోధుడు మాత్రమే కాదు.. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన మహోన్నత వ్యక్తి. సత్యం, అహింస అనే సిద్ధాంతాలను ఆయుధాలుగా మలిచి, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి మార్గాలతో రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. ఆయన చూపిన మార్గం ప్రపంచానికి ఒక కొత్త పాఠాన్ని నేర్పింది. గాంధీజీ ఆశయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ద్వారకానగర్‌లోని పౌరగ్రంథాలయంలో ‘గాంధియానా’పేరిట ప్రత్యేక పుస్తక విభాగాన్ని ఏర్పాటు చేశారు. గాంధీజీ చరిత్ర, జీవితం అపురూపం. ఆయన పోరాటం, సిద్ధాంతాలు, ఆశయాలపై వేలాదిగా పుస్తకాలు ప్రచురించగా.. వాటిలో సుమారు వెయ్యి వరకు పుస్తకాలు దాతల నుంచి సేకరించి ఇక్కడ అందుబాటులో ఉంచారు.

గాంధీజీ గురించి ఎందుకు చదవాలి?

గాంధీజీ జీవిత చరిత్ర, ఆయన పోరాట స్ఫూర్తి గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థి దశలోనే గాంధీజీ గురించి చదివితే నైతిక ప్రవర్తన అలవడుతుంది. తల్లిదండ్రుల పట్ల గౌరవం, పేదవారికి సహాయం చేయాలనే గుణం, దేశభక్తి వంటి సుగుణాలు పెంపొందుతాయి. తద్వారా విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగుతారు. వివేకంతో కూడిన విద్యను అభ్యసించి, మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడతారు. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, శరీరశ్రమ, నిర్భయత్వం, సర్వమత సమభావం, స్వదేశీ, అస్పృశ్యతా నివారణ అనేవి గాంధీజీ పాటించిన ఏకాదశ వ్రతాలు. మత సామరస్యం, అస్పృశ్యతా నివారణ, మద్యపాన నిషేధం, ఖాదీ, గ్రామ పరిశ్రమలు, మౌలిక విద్య, పారిశుధ్యం ఆరోగ్య నియమాలు, ప్రాంతీయ భాషాభివృద్ధి, వయోజన విద్య, సీ్త్ర సాధికారత, జాతీయ భాష, ఆర్థిక సమానత్వం, రైతు సంక్షేమం, కార్మిక సంక్షేమం, ఆదివాసుల వికాసం, కుష్టు రోగుల సేవ తదితరవి మహాత్ముడు అవలంబించారు. వీటన్నింటి గురించి తెలుసుకునేందుకు గాంధీజీకి సంబంధించిన పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి.స్వామి వివేకానంద చెప్పినట్లు ‘క్యారెక్టర్‌, కరికులమ్‌, కల్చర్‌’అనే మూడింటిని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలి.

వేల పుస్తకాలు.. కోట్ల ప్రతులు

ముంబయిలోని సర్వోదయ మండల్‌, గాంధీ రీసెర్చ్‌ ఫౌండేషన్లు గాంధీజీపై వచ్చిన సుమారు 7 వేల పుస్తకాలను సేకరించి భద్రపరిచాయి. గాంధీజీ స్థాపించిన నవజీవన్‌ ట్రస్ట్‌ ఆయన ఆత్మకథ ‘సత్యశోధన’ను 17 భారతీయ భాషలతో పాటు ఫ్రెంచ్‌, జర్మన్‌, స్పానిష్‌, ఇటాలియన్‌, కొరియన్‌, జపనీస్‌, చైనీస్‌ భాషల్లో ప్రచురించింది. కోటికి పైగా గాంధీజీ ఆత్మకథ పుస్తకాలు అమ్ముడయ్యాయంటే అతిశయోక్తి కాదు.

గాంధేయవాదం ఆదర్శం

గాంధేయవాదం అన్ని కాలాలకు, అన్ని సమాజాలకు వర్తించే మహత్తర భావన. యువత వ్యక్తిత్వ వికాసానికి గాంధీజీ ఆలోచనలు, ఆశయాలు ఎంతగానో దోహదపడతాయి. ఆయన ఆశయాలు భావితరాలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతోనే పౌరగ్రంథాలయంలో ‘గాంధియానా రిఫరెన్స్‌’పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ సెంటర్‌ వ్యవస్థాపకుడు కె.ఎస్‌.శాస్త్రి బహూకరించిన వందలాది అమూల్యమైన పుస్తకాలు యువతకు దిశానిర్దేశం చేయగలవు. ఇవి కేవలం అలనాటి జాతీయోద్యమ చరిత్రనే కాక, సామాజిక రుగ్మతలపై గాంధీజీ సాగించిన పోరాటాన్ని, ఆయన సంస్కరణ దృక్పథాన్ని ఈ తరం వారికి స్పష్టం చేస్తాయి. గాంధీ గురించి ఏ సమాచారం అయినా ఈ పుస్తకాల్లో లభిస్తుంది. – డి.వి.సూర్యారావు, రచయిత

నైతిక విలువలు పెరుగుతాయి

గాంధీజీ గురించి చదవడం వల్ల నైతిక ప్రవర్తన అలవడుతుంది. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యార్థి దశలోనే గాంధీజీ గురించి చదవాలి. కనీసం ఆయన ఆత్మకథ ‘ది స్టోరీ ఆఫ్‌ మై ఎక్స్‌పెరిమెంట్స్‌ విత్‌ ట్రూత్‌’పుస్తకాన్ని అయినా చదవాలి. కళాశాలలో చేరేటప్పుడు ప్రతి విద్యార్థికి యాజమాన్యం గాంధీజీ ఆత్మకథ పుస్తకాన్ని అందజేయాలి. ఏడాది చివరలో నాన్‌ క్రెడిట్‌ (మార్కులతో నిమిత్తం లేకుండా) పద్ధతిలో పరీక్ష నిర్వహించి ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా చూడాలి. దీని వల్ల ప్రతి ఒక్కరిలో నైతిక విలువలు పెరుగుతాయి. ఇలా చేస్తే మెరుగైన సమాజం ఏర్పడటానికి దోహదపడిన వారవుతారు. అలాగే సచివాలయ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులకు వారం, పది రోజుల పాటు శిక్షణ ఇవ్వడం ద్వారా గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలపై అవగాహన కల్పించవచ్చు. దీని వల్ల వారిలో అంకితభావం

పెరుగుతుంది. – ఆచార్య వి.బాలమోహన్‌దాస్‌, గాంధీ సెంటర్‌ అధ్యక్షుడు

తప్పక చదవాల్సిన కొన్ని పుస్తకాలు

ది స్టోరీ ఆఫ్‌ మై ఎక్స్‌పెరిమెంట్స్‌ విత్‌ ట్రూత్‌(సత్యశోధన), గాంధీ: ది ఇయర్స్‌ దట్‌ ఛేంజ్డ్‌ ది వరల్డ్‌(రామచంద్ర గుహ), గాంధీ బిఫోర్‌ ఇండియా(రామచంద్ర గుహ), ఇండియా ఆఫ్టర్‌ గాంధీ(రామచంద్ర గుహ), మై డియర్‌ బాపు(సి.రాజగోపాలాచారి గాంధీజీకి రాసిన లేఖలు), ది గుడ్‌ బోట్‌మ్యాన్‌(రాజమోహన్‌ గాంధీ), గాంధీ: ప్రిజనర్‌ ఆఫ్‌ హోప్‌(జుడిత్‌ ఎం. బ్రౌన్‌), ది డెత్‌ అండ్‌ ఆఫ్టర్‌లైఫ్‌ ఆఫ్‌ మహాత్మా గాంధీ(మకరంద్‌ పరాంజపే), హింద్‌ స్వరాజ్‌ లేదా ఇండియన్‌ హోమ్‌రూల్‌(గాంధీ–1909), ఐయామ్‌ గాంధీ(బ్రాడ్‌ మెల్ట్జర్‌), మై డేస్‌ విత్‌ గాంధీ(నిర్మల్‌ కుమార్‌ బోస్‌), ది లైఫ్‌ ఆఫ్‌ మహాత్మాగాంధీ(లూయీ ఫిషర్‌), ఎ వీక్‌ విత్‌ గాంధీ(లూయీ ఫిషర్‌), మహాత్మా గాంధీ: హిజ్‌ లైఫ్‌ అండ్‌ ఐడియాస్‌(చార్లెస్‌ ఎఫ్‌. ఆండ్రూస్‌, అరుణ్‌ గాంధీ), ది మ్యాన్‌ బిఫోర్‌ ది మహాత్మా(చార్లెస్‌ డిసాల్వో), ది లివింగ్‌ గాంధీ: లెసన్స్‌ ఫర్‌ అవర్‌ టైమ్స్‌(తారా సేఠియా), గాంధీ అండ్‌ మావో ఇన్‌ క్వెస్ట్‌ ఆఫ్‌ అనాలజీ(రతన్‌ దాస్‌), గాంధీ సీఈవో(అలాన్‌ ఆక్సెల్‌రాడ్‌)

చదివేద్దాం.. ఓ గాంధీ పుస్తకం 1
1/3

చదివేద్దాం.. ఓ గాంధీ పుస్తకం

చదివేద్దాం.. ఓ గాంధీ పుస్తకం 2
2/3

చదివేద్దాం.. ఓ గాంధీ పుస్తకం

చదివేద్దాం.. ఓ గాంధీ పుస్తకం 3
3/3

చదివేద్దాం.. ఓ గాంధీ పుస్తకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement