
నిరంతర విద్యుత్ సరఫరాయే లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం: ఈపీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ టీవీ సూర్యప్రకాష్ అన్నారు. ఇటీవల డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించిన ఆయన.. డిస్కమ్ పరిధిలోని వివిధ సర్కిళ్లలో సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రాజెక్టుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ’సాక్షి’తో మాట్లాడుతూ విద్యుత్ శాఖలో వివిధ హోదాల్లో 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. 2021లో పదవీ విరమణ చేసినప్పటికీ, ప్రస్తుతం డైరెక్టర్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టినట్లు సూర్యప్రకాష్ తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టినట్లు వెల్లడించారు. సర్కిళ్ల వారీగా వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, సరఫరాలో లోపాలపై నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ నివేదికల ఆధారంగా అవసరమైన మార్పులు చేసి, నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు చేపడతామన్నారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ను అందించేందుకు కృషి చేస్తామని, గ్రామీణ ప్రాంతాలకు 24 గంటలూ మూడు ఫేజుల విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల తరచూ జరుగుతున్న విద్యుత్ ప్రమాదాలను అరికట్టేందుకు, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో విద్యుత్ కోటా కంటే డిమాండ్ ఎక్కువగా ఉందని, రోజూ 18 నుంచి 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందన్నారు. గాలి, వర్షాల కారణంగా వైర్లు తెగిపడటం, స్తంభాలు కూలిపోవడం వంటి అత్యవసర పరిస్థితులు మినహా, మిగతా సమయాల్లో ఈపీడీసీఎల్ పరిధిలో అంతరాయాలు లేకుండా సరఫరా చేస్తున్నట్లు వివరించారు. నైరుతి రుతుపవనాలు త్వరగా ప్రవేశించే అవకాశం ఉన్నందున.. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు ఇప్పటికే ప్రారంభించామన్నారు. ప్రతి లైన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, లోపాలను సరిదిద్దుతున్నామని.. వర్షాకాలంలో సరఫరాలో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రణాళికలు అమలు చేస్తామని సూర్యప్రకాష్ వివరించారు.
ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యప్రకాష్

నిరంతర విద్యుత్ సరఫరాయే లక్ష్యం