
నిర్వాసిత కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
చింతూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునుకు గురవుతున్న ఫేజ్–1బీలో ఉన్న 32 గ్రామాల్లో ఆర్‌అండ్‌ఆర్ గ్రామసభలు పూర్తయినట్లు ఐటీడీఏ పీవో, ఆర్‌అండ్‌ఆర్ అధికారి అపూర్వభరత్ తెలిపారు. బుధవారం చింతూరులో జరిగిన గ్రామసభలో పాల్గొన్న పీవో మాట్లాడుతూ 32 గ్రామాలకు సంబంధించి మొత్తం 13,807 పీడీఎఫ్‌లు ఉండగా వాటిలో 12,468 మందిని అర్హులుగా, 1,339 మందిని అనర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. అనర్హుల జాబితాలో ఉన్న వారి నుంచి స్వీకరించిన దరఖాస్తులను పదిరోజుల్లో పరిశీలించి వారు అర్హులని తేలితే వారికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గ్రామసభల్లో అర్హులుగా గుర్తించిన వారంతా తదుపరి డ్రాఫ్ట్ అవార్డు నిమిత్తం కావాల్సిన అన్ని ధ్రువపత్రాలను త్వరితగతిన సంబంధిత అధికారులకు అందచేయాలని పీవో సూచించారు. ఇకపై గృహాల విలువ, ఆర్‌అండ్‌ఆర్ కాలనీల కోసం భూసేకరణ, గిరిజనులకు భూమికి భూమి వంటి అంశాలపై దృష్టిసారించడం జరగుతుందన్నారు. దీనికోసం ఇరిగేషన్, వ్యవసాయ, హార్టీకల్చర్, ఆర్‌డబ్ల్యుఎస్ శాఖల ద్వారా తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. వరద ముంపునకు గురవుతున్న మరికొన్ని గ్రామాలను కూడా త్వరలోనే టెక్నికల్ బృందంతో సర్వే చేయించి ఆయా గ్రామాలను కూడా 41.15 కాంటూరులో చేర్చి నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ పరిహారం అందేలా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫేజ్–1ఏలో ఉన్న గ్రామాలకు సంబంధించిన ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు త్వరలోనే పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిధ్థం చేస్తున్నామని, అర్హులైన ప్రతి నిర్వాసితుడికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని, నిర్వాసితులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని పీవో సూచించారు.
గ్రామసభలో దరఖాస్తుల స్వీకరణ
చింతూరులో బుధవారం జరిగిన గ్రామసభలో అనర్హుల జాబితాకు సంబంధించిన ప్రజల నుంచి ఐటీడీఏ పీవో అపూర్వభరత్ అభ్యంతరాలు, ధ్రవపత్రాలతో కూడిన దరఖాస్తులను స్వీకరించారు. చింతూరుకు సంబంధించి 1,808 పీడీఎఫ్‌లకు గాను 1,641 మందిని అర్హులుగా, 167 మందిని అనర్హులుగా గుర్తించారు. అర్హుల జాబితాను అధికారులు గ్రామసభలో వెల్లడించిన అనంతరం పీవో అనర్హులుగా తేలిన వారి నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. అర్హులు, అనర్హుల జాబితాలో పేర్లులేని వారి దరఖాస్తులను కూడా పరిశీలించి కలెక్టర్ ఆదేశాల మేరకు అర్హులైన వారికి పరిహారం అందించేందుకు చర్యలు చేపడతామని పీవో తెలిపారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లక్ష్మీపతి, బాలకృష్ణారెడ్డి, నజరయ్య, ఆంజనేయులు, తహసీల్దార్ చిరంజీవి, ఎంపీడీవో రామకృష్ణ, ఆర్‌ఐ విఘ్నేష్, కార్యదర్శి ప్రసాదరావు, సర్పంచ్ కారం కన్నారావు, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ జిక్రియా, పీసా కమిటీ సభ్యులు కారం వాసు, సోడె శ్రీనివాసరావు పాల్గొన్నారు.
32 గ్రామాల్లో ఆర్ అండ్ ఆర్ గ్రామసభలు పూర్తి
12,468 మంది అర్హులు,
1,339 అనర్హులు
ముంపు గ్రామాల్లో మరోమారు సర్వే
ఐటీడీఏ పీవో అపూర్వభరత్

నిర్వాసిత కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి