
మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర
సాక్షి, విశాఖపట్నం: ‘ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చాలామంది టీచర్లు రాజకీయాలు చేస్తున్నారు. అలాంటి వారిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో మిమ్మల్ని బాధ్యులను చేస్తూ మీపై మేమే చర్యలు తీసుకుంటాం’ అని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర హెచ్చరించారు. శనివారం ఒకటి నుంచి ఏడు వరకు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగాయి. విద్యపై జరిగిన చర్చలో సభ్యులు కొంతమంది ఉపాధ్యాయుల తీరును ఆక్షేపించారు. ఇలాంటి వారు విద్యా బోధనకంటే రాజకీయాలు చేయడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని ఆరోపించారు. మునగపాక మండలం రాజుపేటలో స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రస్తుత సర్పంచ్‌తో కాకుండా మాజీ సర్పంచ్‌తో అక్కడి ఉపాధ్యాయుడు పతాకావిష్కరణ జరిపించారని, కానీ ఆయనపై ఏమీ చర్యలు తీసుకోలేదని ఆ జెడ్పీటీసీ సత్యనారాయణ సమావేశంలో పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో విద్యా ప్రమాణాల మెరుగుపడడం లేదని, టీచర్ల బోధనపై ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదని పెదబయలు, అరకు జెడ్పీటీసీలు మత్స్యలింగం, శెట్టి రోషిణిలు చెప్పారు.
ఈ నేపథ్యంలో చైర్‌పర్సన్ పై విధంగా స్పందించారు. గిరిజన పిల్లలు విద్యా బోధనను సరిగా అందుకోలేకపోతున్నారంటూ డీఈవో తరఫున హాజరైన అల్లూరి జిల్లా డీఈవో కార్యాలయ సూపరింటెండెంట్ చక్రధర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో ఆయన గిరిజన సభ్యులకు క్షమాపణ చెప్పారు. అల్లూరి జిల్లాలో కొన్ని ఆస్పత్రుల్లో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అక్కడి సభ్యులు సభలో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చైర్‌పర్సన్ మాట్లాడుతూ సభ్యుల ఆవేదనతో తానూ ఏకీభవిస్తున్నానని చెప్పారు. ముంచంగిపుట్టు సీహెచ్‌సీ వైద్యుడు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని, పైగా ప్రశ్నించిన తనపైనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని వాపోయారు. ఏజెన్సీలో ఒక్కో వైద్యునికి ప్రభుత్వం రూ.2 లక్షలు జీతం ఇస్తున్నా సేవలు సక్రమంగా అందించకపోవడం శోచనీయమన్నారు.
అల్లూరి జిల్లాలో విద్య,
వైద్యం మెరుగు పడాలి
‘జెడ్పీ స్థాయీ’ సమావేశాల్లో
పలు అంశాలపై సభ్యుల చర్చ