ఆ బడులకు మహర్దశ
సీఎస్‌ఆర్ నిధులతో పాఠశాలల అభివృద్ధి జిల్లా కేంద్రంలో రెండు స్కూళ్లు ఎంపిక ఒక్కో బడికి రూ.కోటి 20 లక్షలు సీఎం రేపు శంకుస్థాపన
ఆదిలాబాద్‌టౌన్: సర్కారు బడుల అభివృద్ధికి కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇప్పటికే విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించిన ఆయన ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొ దటి విడత సక్సెస్‌తో మరోసారి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్)లో భాగంగా పాఠశాలల అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇటీవల హెచ్‌డీఎఫ్‌సీ వారు రూ.కోటి 20 లక్షల సీఎస్సార్ నిధులు కేటాయించగా వాటిని జిల్లా కేంద్రంలోని రెండు ప్ర భుత్వ యాజమాన్య పాఠశాలలను ఎంపిక చేశారు. ఆ బడుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. ఈనెల 4న సీఎం చేతుల మీదుగా ఆ పాఠశాలల అభివృద్ధికి సంబంధించి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శిలాఫలకం ఆవిష్కరించనున్నారు.
రెండు పాఠశాలలు ఇవే..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వారు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా నిధులు కేటాయించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల గెజిటెడ్ నం.1, మహాలక్ష్మివాడ పాఠశాలలను కలెక్టర్ ఎంపిక చేశారు. ఈ నిధులతో ఆ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేయనున్నారు. నాలుగేళ్ల పాటు వీటిని దత్తత తీసుకొని అవసరమైన మౌలిక వసతులు కల్పించనున్నారు. ఒక్కో పాఠశాలకు రూ.కోటి 20 లక్షల వరకు నిధులు ఖర్చు చేయనున్నట్లు విద్యా శాఖాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాల నం.1లో తెలుగు, ఇంగ్లీష్, మరాఠీ మీడియంలు కొనసాగుతున్నాయి. ఈ పాఠశాలల్లో 502 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మహాలక్ష్మివాడ పాఠశాలలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలు కొనసాగుతున్నాయి. ఈ పాఠశాలలో 358 మంది విద్యార్థులు చదువుతున్నారు. సీఎస్‌ఆర్ నిధులతో అదనపు తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, ఇన్‌స్ట్రక్టర్లు, సైన్స్‌ల్యాబ్, యూనిఫాం, షూ, టై, బెల్ట్, కిచెన్ షెడ్లు, ఇతర మౌలిక వసతులు, వాటర్‌ప్లాంట్, డైనింగ్ హాల్, డ్యూయల్ డెస్క్ బెంచీలను కల్పించనున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు ఈ నిధులు సమకూరనుండడంతో ఈ రెండు బడుల రూపురేఖలు మారనున్నాయి. పేద విద్యార్థులకు మేలు చేకూరనుంది.
సీఎస్‌ఆర్ నిధులతో మౌలిక వసతులు
కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఆదిలాబాద్ పట్టణంలోని రెండు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దత్తత తీసుకుంది. ఒక్కో పాఠశాలకు రూ.కోటికి పైగా నిధులతో అభివృద్ధి చేయనున్నారు. అన్ని మౌలిక వసతులు కల్పించనున్నారు. ఈనెల 4న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది.
– రఘురమణ, సెక్టోరియల్ అధికారి
ఆ బడులకు మహర్దశ


