breaking news
Reverence
-
మంగళకరం
భారతీయ సంప్రదాయంలో ఏదయినా ప్రారంభం చేసేటప్పుడు.. మంగళకరమైన వాక్కులతో, శబ్దాలతో ప్రారంభం జరుగుతుంటుంది. ‘మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని శాస్త్రాణి ప్రథంతే’.. అంటారు. అంటే మంగళకర వాక్కుతో ప్రారంభించాలి, మధ్యలో మంగళకరమైన వాక్కు ఉండాలి. ముగింపును కూడా మంగళకరంగా పూర్తి చేయాలి.. అని శాస్త్ర వాక్కు. అంటే జీవితం ఎప్పుడూ మంగళకరంగా, శోభాయమానంగా ఉండాలి. శాంతికి విఘాతం కలగకుండా చూసుకుంటుండాలి. అంటే ఇతరుల మనశ్శాంతికి కారణమయ్యేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి. మంగళకర వాక్కులు, శబ్దాలు ఉన్నచోట పూజనీయత ఉంటుంది. వాతావరణం కూడా పరిశుద్ధమయి, దేవతల అనుగ్రహానికి కారణమవుతుందని విశ్వసిస్తాం. ఘంటానాదంతో పూజ ప్రారంభం చేస్తాం. ఎందుకని.. ఆగమార్థంతు దేవానాం/ గమనార్థంతు రాక్షసాం/ కురుఘంటారవంతత్ర/ దేవాతాహ్వాన లాంఛనం... అంటే రాక్షసులు అక్కడినుంచి వెళ్లిపోవాలన్నా, దేవతలు రావాలన్నా... ఘంట మోగాలి. ఆ శబ్దంలోని పవిత్రత, మంగళప్రదత్వం అటువంటిది. నాదస్వరం, షెహనాయి, మృదంగం, డోలు, శాక్సోఫోన్, మద్దెల, ఘంటలు, గజ్జెలు, ఢమరుకం, శంఖం, కొమ్ము, వేణువు, వీణ, వయోలిన్, హార్మోనియం, క్లారినెట్... ఇవన్నీ మంగళప్రదమైన శబ్దాలు చేసే సంగీత పరికరాలు. బ్యాండ్ కూడా అంతే... దానిలోని శాక్సోఫోన్ కానీ, క్లారినెట్ కానీ, ఇతర పరికరాలు కానీ అవి కూడా గురుముఖతః నేర్చుకుని వాయిస్తారు. వీటిని మోగించే కళాకారులను కూడా సమాజం సమున్నతం గా ఆదరిస్తుంది. పండిట్ రవిశంకర్, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ లను భారతరత్న వరించింది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్... వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలను ఆయన అందుకున్నారు. ‘నేను సరస్వతీ ఆరాధకుడిని’ అని బిస్మిల్లాఖాన్ ప్రకటించుకున్నారు. ‘యావత్ భారతదేశంలోని ప్రజలందరూ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు..’ అని ఆయన తరచుగా అంటూండేవారు. ఒకసారి అమెరికాలో కచేరీ సందర్భంగా అభిమానులు ఆయనను అక్కడే ఉండిపొమ్మని కోరగా... కాశీని, విశ్వనాథుడిని, విశాలాక్షిని, గంగమ్మను వదిలి రాలేను అని.. ప్రకటించుకున్న గొప్ప దేశభక్తుడు. సింహాచలం ఆస్థాన విద్వాంసుడు చిట్టబ్బాయిని... సంగీతనాటక అకాడమీ, కళాప్రపూర్ణ వంటి బిరుదులెన్నో వరించాయి. కాకినాడలో సత్యనారాయణ అనే గొప్ప క్లారినెట్ విద్వాంసుడు ఎందరో శిష్యులను తయారు చేసాడు.. వారందరూ కలిసి ఆయనకు గురుదక్షిణగా బంగారు క్లారినెట్ ను బహూకరించారు. ఇటువంటి వాద్య సంగీత విద్వాంసులను కూడా గౌరవించడం, వారి కచ్చేరీలు నిర్వహించి వారిని, వారి కళను, వారి వాయిద్యాలను సమాదరించడం మన కర్తవ్యంగా భావించాలి. మంగళత్వం అనేది కోయిల కూతలో, మామిడాకులో వానచినుకులో, పసుపులో, కుంకుమలో, పువ్వులో.. కూడా దర్శించే సంప్రదాయం మనది. ఇప్పటికీ నృత్యకళను అభ్యసించినవారు అరంగేట్రం చేయడానికి ముందు .. సభలో ఆసీనులైన పెద్దల దగ్గరకు వచ్చి, వారి చేతికి గజ్టెలు అందించి... తిరిగి వారి చేతులనుండి స్వీకరించి కాలికి కట్టుకుని వెళ్ళి ప్రదర్శిస్తుంటారు... అంత గాఢంగా మనం ఈ కళలను అభిమానిస్తాం... ఈ సంప్రదాయాన్ని నవతరం కూడా నిష్ఠతో కొనసాగించాలని కోరుకుందాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
భగవంతుని సేవతోనే జీవిత సాఫల్యం
భక్తితత్వంతో ముందుకు సాగుతూ భగవంతుని సేవ చేసినప్పుడే జీవితం సాఫల్యమవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా నియమితులైన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. ఆయన శనివారం తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన భావాలను పంచుకున్నారు. తిరుపతి కల్చరల్: భక్తి శ్రద్ధలతో తాను చేసిన సేవలను భగవంతుడు గుర్తించి ఆయన సేవ చేసుకునే భాగ్యం కల్పించాడని డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రతిమనిషికీ జీవితంలో తల్లిదండ్రులు, గురు, దైవం ప్రధానమన్నారు. వారికి నిస్వార్థంతో సేవలు అందించి ఆశీస్సులు పొందినప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుందన్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక ధార్మిక క్షేత్రం తిరుమల పుణ్యక్షేత్రమనీ, ఈ క్షేత్రంలో భక్తకోటికి అందించే సేవల్లో తనను భాగస్వామిని చేయడం మహద్భాగ్యమన్నారు. వృత్తిపరంగా తాను వైద్యుడు అయినా భగవంతునికి, భక్తులకు సేవచేసే భాగ్యం లభించడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు. భక్తి ప్రతి మనిషి జీవితాన్ని సుఖమయం చేసే చక్కటి మార్గమని తన నమ్మకమన్నారు. ఇందులో భాగంగానే 13 ఏళ్ల క్రితం శ్రీవారి పాదాల చెంత వెలసిన తిరుపతి నగరంలో అడుగిడిన తనకు ఆ భగవంతుడు మంచి మార్గం చూపారన్నారు. ఆయన ఆశీస్సులతోనే సంతాన సంపద వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పునరుద్ధరించి భక్తి తత్వాన్ని ప్రజల్లో నింపి సేవలు అందిస్తున్నారన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా వచ్చిన అవకాశాన్ని ఆ భగవంతుని సేవకు అంకితం చేస్తానన్నారు. నిస్వార్థంతో సేవలు చేపడుతూ హైందవ సంస్కృతి, సాంప్రదాయాలు పెంచే దిశగా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గ్రామీణ స్థాయిలో పురాతన ఆలయాలను పునరుద్ధరించి తద్వారా ఆధ్యాత్మిక భావాలను పెంపొందించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య, విద్య విభాగాల్లో సేవలను మరింత విస్తృతం చేసి ప్రజలకు చేరువ చేసేందుకు శ్రమిస్తానని తెలిపారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు మొదట అడుగు వేసేది తిరుపతి నగరమేనన్నారు. తిరుపతిలో అడుగిడే ప్రతి భక్తుడిలో ఆధ్యాత్మికతను పెంపొందించే విధంగా తిరుపతి రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేసేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల కోసం నగరంలో, కాలినడక రహదారుల్లో భక్తి భావం కలిగించే విధంగా సరికొత్త కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఆధ్యాత్మిక భావంతో తాను చేపట్టే ప్రతి కార్యక్రమానికి ప్రజలు, భక్తులు సహకారం అందించి ఆశీర్వదించాలని కోరారు.