breaking news
Officers ignored
-
తప్పనిసరి మూడు‘ముళ్లు’
పదో తరగతి తర్వాత అథోగతి పాసైనా, ఫెయిలైనా పెళ్లి ఖాయం మన్యంలో కొనసాగుతున్న బాల్యవివాహాలు తూతూ మంత్రంగా స్పందిస్తున్న అధికారులు మన్యం వాసుల నిరక్షరాస్యత, అధికారుల నిర్లక్ష్యం బాల్యవివాహాలకు దారి తీస్తున్నాయి. ఏదో పదో తరగతి వరకూ చదివించి పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరిపోతుందని తల్లిదండ్రులు భావించడం, వీటిని అరికట్టాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో లోకం తెలియని వయసులోనే మూడు‘ముళ్లూ’ పడిపోతున్నాయి. బుట్టాయగూడెం :ప్రతి ఏటా పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అధికారుల దృష్టికి వచ్చిన వివాహలు మాత్రమే ఆగుతున్నాయి తప్ప బయటకు రాని పెళ్లిళ్లు చాలా ఉంటున్నాయి. గత ఏడాది వేసవి కాలంలోనే మండలంలో రెండు చోట్ల బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. అయితే వారు అడ్డుకున్న తరువాత కూడా బయటకు రాకుండా పెద్దలు సహకారంతో మండలంలో కొన్ని బాల్య వివాహాలు జరిగాయని తెలుస్తోంది. ఇంట్లో సమస్యల కారణంగానో, తాతామామ్మలు మనవరాలి పెళ్లి చూడాలని ఒత్తిడి తేవడం వల్లో బాల్య వివాహాలు చేస్తున్నామని ఏజెన్సీ ప్రాంతంలోని తల్లిదండ్రులు తరచుగా చెబుతుంటారు. పదోతరగతి పూర్తయిన తరువాత ఇంటర్ ఎంతమంది చదువుతున్నారు ?పదోతరగతి ఫెయిల్ అయిన వారిలో తిరిగి ఎంతమంది పరీక్ష రాస్తున్నారు. లేక తల్లిదండ్రులు పెళ్లి చేస్తున్నారా అనే విషయంపై ఆరా తీసేవారు లేకపోవటంతో ఏజెన్సీ ప్రాంతంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తల్లిదండ్రులకు అవగాహన క ల్పించ కపోవటంతో ఇటువంటివి జరుగుతున్నాయని కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సులో వివాహం వల్ల ఎన్నో అనర్థాలు తలెత్తుతాయని చెప్పే అధికారులు శ్రద్ధ తీసుకుంటే చాలావరకు వీటిని అరికట్టవచ్చు. పదోతరగతితో చదువుమానేసిన వారిని ఐటీడీఏ అధికారులు ఎంతమందిని గుర్తించారో వారికే ఎరుక. ముఖ్యంగా బాల్య వివాహాలపై కిషోర బాలికలకు సంవత్సరంలో ఒకసారి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. బాల్య వివాహాలపై రెండు ,మూడు నెలలకు ఒకసారైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే వారిలో చైతన్యం వస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పదోతరగతిలో ఉత్తీర్ణత సాధించే వారిని ఉన్నత చదువులకు పంపేలా, ఉత్తీర్ణత సాధించని వారికి నచ్చిన అంశంలో శిక్షణ ఇచ్చి చేయూత నిచ్చేలా కృషి చేస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు. గిరిజన ప్రాంతంలో నిరక్ష్యరాస్యత ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకి పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరిపోతుందని తల్లిదండ్రులు భావిస్తున్నారే తప్ప తరువాత వచ్చే ఇబ్బందుల గురించి తెలుసుకోలేకపోతున్నారు. ప్రణాళిక రూపొందిస్తాం పదోతరగతి పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చి పరీక్షలు రాయిస్తున్నాం. సప్లమెంటరీ రాసిన తరువాత కూడ ఫెయిల్ అయినవారు తరువాత ఏం చేస్తున్నారో తెలియదు. అటువంటి విద్యార్థుల గురించి ఇప్పటి వరకూ ఏ చర్యలు తీసుకోవటం లేదు. ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి ఈ అంశంపై ఒక ప్రణాళిక రూపొందిస్తాం. - బి.మల్లికార్జునరెడ్డి, డెప్యూటి డెరైక్టర్, ఐటీడీఏ -
తప్పుల తడక
గందరగోళంగా పట్టభద్రుల ఓటరు జాబితా ఫొటో ఒకరిది... పేరు ఇంకొకరిది ఫొటో మహిళది... పేరు పురుషుడిది ఒకేవ్యక్తి పేరు రెండునుంచి నాలుగు సార్లు నమోదు వేలాది మంది ఓటర్లకు ఫొటోల్లేవు.. గుర్తుపట్టలేని విధంగా ప్రింట్ అయిన ఫొటోలు చనిపోయిన వారి ఓట్లూ జాబితాలో ఉన్నాయి కొందరి ఇంటిపేర్లు గల్లంతు.. తుదిజాబితా ప్రకటించాక గందరగోళంలో ఓటర్లు అధికారుల నిర్లక్ష్యం.. రాజకీయ పార్టీల అత్యుత్సాహమే కారణం సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఒక్క దేవరకొండే కాదండోయ్... జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు.. దాదాపు అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి. అధికారుల నిర్లక్ష్యానికితోడు రాజకీయ పార్టీల అత్యుత్సాహం కారణంగా ఈసారి జిల్లాలో పట్టభద్రుల ఓటరు జాబితా గందరగోళంగా తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ ఓటర్ల జాబితాలాగా లక్షల్లో ఓటర్లను నమోదు చేయాల్సిన పనిలేకపోయినా... ఈ వర్గానికి చెందిన ఓట్లు వేలసంఖ్యలోనే ఉన్నా సాధారణ ఓటరు జాబితా కన్నా తీవ్రంగా తప్పులు దొర్లడం గమనార్హం. పురుషులకు బదులు మహిళల ఫొటోలు... మహిళల పేర్లున్న చోట్ల మగవాళ్ల ఫొటోలు.. అసలు ఫొటోలు లేకుండానే తుదిజాబితా ప్రచురించడం... ప్రింట్ అయిన ఫొటోలు కూడా గుర్తుపట్టలేకుండా ఉండడం... చనిపోయిన వారి ఓట్లూ తొలగించకపోవడం... ఈ మండలంలోని ఓటరు పేరు పక్క మండలంలో నమోదు కావడం.. ఒక్కొక్కరికి గరిష్టంగా నాలుగు నుంచి రెండు సార్లు ఓటు నమోదు కావడం... కొందరి ఇంటిపేర్లు లేకపోవడం.. కొందరికయితే అసలు పేర్లే తారుమారు కావడం.. కొన్నిచోట్ల క్వాలిఫికేషన్ కూడా నమోదు కాకపోవడం.. ఇలా ఎన్ని రకాల విచిత్రాలు జరగాలో అన్ని రకాల విచిత్రాలు పట్టభద్రుల ఓటరు జాబితాలో జరగడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వాస్తవానికి ఈ ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా గందరగోళంగానే జరిగింది. దరఖాస్తు చేసుకున్న వారి ఓట్లను పరిశీలించే బాధ్యతను రెవెన్యూ యంత్రాంగం తీసుకోకుండా, ఇతర శాఖలకు చెందిన చిన్నస్థాయి ఉద్యోగులకు ఇవ్వడం.. వారికి అవగాహన లేకపోవడం... ఆన్లైన్లో కొన్ని తప్పులు నమోదు కావడం కారణంగానే ఇన్ని తప్పులు దొర్లాయి. మరోవైపు కొన్ని రాజకీయ పక్షాలు గంపగుత్తగా ఓటరు దరఖాస్తులను తెచ్చి ఎమ్మార్వో కార్యాలయాల్లో డంప్ చేయడంతో నమోదు ప్రక్రియ గందరగోళంగా మారింది. వాస్తవానికి రాజకీయ పార్టీలు ఓటరు నమోదు ప్రక్రియలో పాలుపంచుకోవడం, ఓటర్లను చైతన్యవంతులను చేయడం మంచిదే కానీ... తమకు వచ్చిన దరఖాస్తులను గంపగుత్తగా కాకుండా ఎప్పటికప్పుడు కార్యాలయాలకు పంపి నమోదు చేయించుకుంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు రాజకీయ పార్టీల టెంట్లలో నమోదు చేసుకున్న వారు కూడా మళ్లీ నేరుగా ఎమ్మార్వో కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవడం కూడా రెండు, మూడు సార్లు ఓటరు నమోదుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఏదిఏమైనా పెద్దల సభకు ప్రతినిధులను పంపే ఓటర్ల జాబితాను నిర్లక్ష్యంగా తయారుచేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ పేరు ఎక్కడ తప్పు వచ్చిందో.. పోలింగ్ రోజు పోలింగ్ బూత్‌కు వెళ్లినా తమకు ఓటు వేసే అవకాశం వస్తుందో రాదోననే ఆందోళన ఓటర్లలో వ్యక్తమవుతోంది. పట్టభద్రుల ఓటరు జాబితాలో కొన్ని పదనిసలు... భువనగిరి ఖిలానగర్కు చెందిన కావలి నర్సింహాచారి బీఎస్సీ చదివి కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన పేరు వరుస నంబర్లలో రెండుసార్లు ఉంది. వలిగొండ మండలంలోని వెల్వర్తికి చెందిన కల్లూరి నరేష్ (ఎమ్మెస్సీ లెక్చరర్ చేస్తున్నాడు సీరియల్ నంబర్ 1321 నుంచి 1323 వరకు) ) పేరు నాలుగుసార్లు, టేకులసోమారానికి చెందిన రాము, వేములకొండకు చెందిన రమేష్, గొల్నేపల్లికి చెందిన లింగమ్మ, వలిగొండకు చెందిన గుండాల సునిత, కూర భవానిలవి రెండుసార్లు నమోదయ్యాయి. మరి కొందరివి ఫొటోలు లేకుండా దర్శనమిస్తున్నాయి. ఆలేరులోని శ్రీరామోజీ వేణుగోపాలచారి ఫొటోకు బదులు మహిళ ఫొటో ప్రింటైంది. ఆత్మకూరు మండలంలో ఓ వ్యక్తికి బదులు మరో వ్యక్తి ఫఞటో ప్రింటైంది. రాజాపేట, ఆత్మకూరు, బొమ్మలరామారం మండలాల్లో పురుషునికి బదులు స్త్రీ ఫొటోలు ప్రింటయ్యాయి. చిట్యాల మండలంలో పట్టభద్రుల ఓటర్లుగా 1530 మంది నమోదు చేయించుకున్నారు. కానీ వీరిలో 70 శాతం మంది ఓటర్లుకు ఫొటోలు జాబీతాలో ముద్రించలేదు. ఆయా గ్రామ పంచాయతీలలో ఓటరు జాబితాను ప్రచురించకపోవడంతో ఓటర్లు తమ పేర్లును జాబితాలో చూసుకునేందుకు అధికారుల చుట్టు తిరగాల్సి వస్తుంది. మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండలానికి చెందిన ఓటర్ల మునుగోడు మండలంలో ప్రత్యక్షమయ్యాయి. దేవరకొండ నియోజకవర్గంలోని పీఏపల్లి మండలంలో 513 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కాగా, 120 మంది ఫొటోలు లేకుండానే ఓటరు జాబితా తయారైంది. యాదగిరిగుట్ట మండలంలోని సోమారం గ్రామానికి చెందిన జంగ స్వామి ఫొటోకు బదులుగా లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన గిరిరాజు సిద్దిరాజు ఫొటో పడింది. ఇరువురి ఫొటోలు తారుమారు అయ్యాయి. యాదగిరిగుట్ట, వంగపల్లి, మల్లాపురం, సైదాపురం, సాదువెల్లి, జంగంపల్లి తదితర గ్రామాల్లో ఓటర్ల జాబితా తప్పులుగా వచ్చింది.నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండలంలోని అప్పలమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సీత్యాతండాకు చెందిన ధనావత్ మురళికి సీరియల్ నంబర్ 503,518,552లో మూడు చోట్ల ఓటు నమోదు అయ్యింది. అదే విధంగా బెజ్జికల్ గ్రామానికి చెందిన బాల్తీ జానకిరాములుకు సీరియల్‌నంబర్ 79,81లో రెండు చోట్ల ఓటు నమోదు అయ్యింది. మఠంపల్లి మండలంలో 775 మంది ఓటర్లుగా నమోదు కాగా ఎక్కువ మందికి ఓటర్ల జాబితాలో ఫొటోలు లేవు. అదేవిధంగా మరికొంత మందికి క్వాలిఫికేషన్ వివరాలు నమోదుకాలేదు.