breaking news
Murthy chander
-
మూర్తి చందర్ .. S/O మాస్టర్ వేణు
ఏరువాక సాగాలోరన్నో చిన్నన్నా... ఓ బాటసారీ... నను మరువకోయి...సడి సేయకో గాలి... సడి సేయబోకే... ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ... ఇటువంటి మరపురాని మరువలేని లెక్కించలేనన్ని మధురగీతాలు అందించారు మాస్టర్ వేణు...మూర్తిచందర్, భానుచందర్.... ఆయన కుమారులు... భానుచందర్ తెలుగు తెర నటుడిగా సుపరిచితులు... మూర్తి చందర్... పరిచయం చేస్తే గాని తెలియని అజ్ఞాత వ్యక్తి... తండ్రికి బహూకరించిన పియానోను పదిల పరచుకుని, దాని మీద వేళ్లతో సంగీత నాట్యం చేస్తున్నారు... ఆ వేళ్లు ఎక్కడున్నాయో కూడా కనిపించనంత వేగంగా పియానో మీటుతారు... సెలబ్రిటీ కుమారుడే అయినా ఏ మాత్రం భేషజం లేని మూర్తిచందర్ను పలకరిస్తే.... ఎంతో సౌమ్యంగా తన గురించి వివరించారు... నేను పుట్టింది మచిలీపట్టణంలో. కాని పెరిగిందంతా మద్రాసులోనే. నేను పుట్టే సమయానికి నాన్నగారు సినిమాలలో బిజీగా ఉండేవారు. పాటల రికార్డింగు కోసం ప్రతిరోజూ ఉదయాన్నే స్టూడియోలకి వెళ్లిపోయేవారు. మళ్లీ ఏ సాయంత్రానికో, రాత్రికో ఇంటికి వచ్చేవారు. స్వర్ణయుగం... 1950-1960 మధ్య సినీ పరిశ్రమకు స్వర్ణయుగం. దర్శకులు, నటులు, సాహిత్యం, సంగీతం... ఒకటేమిటి అన్ని రంగాలకూ పట్టాభిషేకం జరిగిన రోజులు. సంగీత దర్శకులంతా ఎవరి శైలిలో వారు కళామతల్లికి తమ వంతు నిస్వార్థ సేవ చేస్తూ, పేరుప్రఖ్యాతులు తీసుకువచ్చిన ఘనమైన రోజులు. సంగీతాన్ని తపస్సులా భావించి, సుమధురమైన, సుస్వరమైన, శ్రవణపేయమైన బాణీలు తయారుచేసిన రోజులు. అటువంటి మహనీయులలో నాన్నగారు కూడా ఒకరు. తనదైన శైలిలో సుమధురమైన పాటలు రూపొందిస్తూ, పూర్తిగా పాటల రికార్డింగులోనే మునిగిపోయి ఉండేవారు. అన్నం కూడా మర్చిపోయేవారు. ఆ పది పదిహేను సంవత్సరాలు సంగీత కళామతల్లికి నిత్యం స్వరార్చన చేశారు నాన్న. మార్పులతో... కాలక్రమేణా సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. దాంతో 1965 తర్వాత ఆయనకు సినిమాలు బాగా తగ్గాయి. మూడేళ్లకు ఒక సినిమా వస్తే గొప్ప. దాంతో ఆయన బిజీ జీవితానికి తెర పడి, విశ్రాంతి సమయం ఎక్కువ దొరికింది. ఇంట్లోనే ఎక్కువసేపు ఉండే అవకాశం దొరికింది. అంతవరకూ మమ్మల్ని పట్టించుకోవడానికి క్షణం కూడా తీరికలేని నాన్నగారు, ఖాళీ సమయం దొరకడంతో, మాతో ఒక స్నేహితుడిలా కాలక్షేపం చేయడం ప్రారంభించారు. ఎన్నో ఆటలు చక్కగా ఆడేవారు. ఒక సెలబ్రిటీలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఆయన సరదా మనిషి... నాన్నతో ఆడుకోవడమే మాకు మధురానుభూతి. అవన్నీ మాకు మరపురాని, మరువలేని తీపి జ్ఞాపకాలు. నాన్నతో కులాసాగా, కాలక్షేపంగా ఉండేవాళ్లం. నాన్నది పసిపిల్లవాడి తత్త్వం. ఎక్కువగా మాతో గాలిపటాలు, క్రికెట్, బొంగరాలు, కర్ర బిళ్ల ఆడేవారు. ఆటల్లో సరదాగా గొడవ పడేవాళ్లం. ఆయనతో కలిసి ఇంగ్లీషు సినిమాలు చూసేవాళ్లం. ఆయన ఎప్పుడూ సీరియస్‌గా ఉండేవారు కాదు. సంగీతమే ఊపిరి... నాన్నకి సంగీతం తప్పించి ఇతర విషయాలు తెలియవు. అందువల్ల మా చదువు బాధ్యత అంతా మా అమ్మగారే తీసుకున్నారు. నాన్న మాతో సమానంగా ఆడుతుండేవారు. అందుకని నాన్నమీద ఇష్టంగా ఉండేది. అమ్మ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. చదువుకోమని అమ్మ చెబుతుంటే అమ్మ మీద కోపం వస్తుండేది. కాని పెద్దయిన తర్వాత అమ్మ ఎందుకలా కేకలేసిందో అర్థమైంది. ఆవిడే మా గాడ్ మదర్. అమ్మ చాలా జాగ్రత్తగా పొదుపు చేయడం వల్లే ఇల్లు కొనుక్కోగలిగాం. స్కూల్ చదువు పూర్తయ్యాక కాలేజీ చదువులో చేరాం. నాన్న మమ్మల్ని మ్యూజిక్ ఫీల్డ్ లోకి వచ్చేందుకు ప్రోత్సహించలేదు. నేను, తమ్ముడు భానుచందర్ ఇద్దరం బీఏ పూర్తి చేశాం. భాను గిటార్, నేను పియానో వాయించేవాళ్లం. అమ్మ నన్ను మెడిసిన్ చదివించాలనుకుంది. కాని నాకు సంగీతం మీద శ్రద్ధ ఏర్పడి, మ్యూజిక్ డిప్లొమో చేశాను. నాకు సహజంగా సిగ్గు బిడియం ఎక్కువ. అందువల్ల నాన్నతో స్టూడియోలకి వెళ్లేవాడిని కాను. కాని భాను మాత్రం నాన్నతో వెళ్లి, ఆయన పాటలకు గిటార్ వాయిస్తుండేవాడు. అలాగే రెండు సినిమాలకు సంగీతం కూడా చేశాడు. నాన్నగారికి బహూకరించిన పియానో నా దగ్గరే ఉంది. దాని మీద ఇప్పటికీ నేను వాయించుకుంటూ ఉంటాను. మ్యూజిక్ టీచర్‌గా... చెన్నైలోని హోలీ ఏంజెల్స్ స్కూల్లో మ్యూజిక్ టీచర్‌గా పది సంవత్సరాలు పనిచేశాను. రాజ్- కోటి ఇద్దరూ విడివిడిగా ఎవరికి వారు ట్యూన్లు చేయడం మొదలుపెట్టాక, నేను రాజ్ దగ్గర అసోసియేట్‌గా పది సంవత్సరాలు పనిచేశాను. తమ్ముడు యాక్టింగ్ స్కూల్లో చేరాడు. అది కూడా అమ్మ అనుమతితోనే. నాన్నగారు వద్దని పట్టుబట్టినప్పటికీ అమ్మ పూర్తిగా ప్రోత్సహించింది. 1980లలో భానుచందర్ సినిమాల వైపు వెళ్లిపోయాడు. ‘తరంగిణి’ చిత్రంలో సినీ పరిశ్రమలో మంచి స్థానం పొందాడు. అది చూసి నాన్న సంతోషించారు. బ్రేక్ వచ్చిందని ఆనందపడ్డారు. నా గురించి ఆయనకి ఎప్పుడూ బాధగా ఉండేది. నేను ఫిలాసఫీ వైపు మొగు ్గచూపాను. వివాహం చేసుకోకుండా బ్యాచిలర్‌గా ఉండిపోయాను. జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్‌లో వలంటీర్‌గా పనిచేస్తున్నాను. ఆయన ఆంగ్లంలో ఇచ్చిన ప్రసంగాలను నేను తెలుగులో రికార్డు చేస్తున్నాను. 1981లో నాన్నగారు గతించారు. ఆ పియానో అపురూపం... విజయ - వాహినీ సంస్థలో మ్యూజిక్ ఆరేంజర్గా, మ్యూజిక్ కండక్టర్‌గా పనిచేశారు నాన్నగారు. ఘంటసాల సంగీతం స్వరపరచిన ‘పాతాళభైరవి’ సినిమాకి రీరికార్డింగ్ పని నాన్నకి అప్పచెప్పారు. అప్పట్లో విజయా వాహినీ వారు హ్యామండ్ ఆర్గాన్ తెప్పించారు. అయితే దానిని వాడటం ఎవ్వరికీ తెలియలేదు. మా నాన్నగారు దానితో ఎక్స్పరిమెంట్ చేసి, పాతాళభైరవి సినిమా అంతా ఆ వాద్యంతోనే రీరికార్డింగ్ చేశారు. అదే ప్రధానమైన వాద్యపరికరం. అందరూ ఆశ్చర్యపోయారు. విజయ - వాహినీ స్టూడియోలో మానేసి బయటకు వస్తున్న సందర్భంలో ఆ సంస్థవారు, నాన్నగారికి బహుమతిగా పియానో బహూకరించారు. నాన్నగారు గతించాక ఆ పియానో నా దగ్గర పదిలంగా భద్రపరుచుకున్నాను. దానిని నేను అపురూపంగా చూసుకుంటాను. నేటికీ దాని మీద వాయిస్తుంటాను. డప్పు మీద పాట... రోజులు మారాయి చిత్రానికి ఈ సంవత్సరం అరవై వసంతాలు నిండాయి. ఆ చిత్రంలో ‘ఏరువాకా సాగాలోరన్నో చిన్నన్నా’ పాట నేటికీ అందరి మదిలో మెదులుతూనే ఉంది. కేవలం డప్పు మీద స్వరపరిచిన ఈ పాట ఆ రోజుల్లో సంచలనం. దానిని స్వరపరచి చరిత్రను సృష్టించినవారు మాస్టర్ వేణు. - మూర్తి చందర్, ఫోన్ 9952926552 - ఫీచర్స్ ప్రతినిధి, సాక్షి, చెన్నై -
రిలేషణం: భానులో మంచి మ్యుజీషియన్ ఉన్నాడు!
భానుచందర్ అంటే ఒక జనరేషన్‌ని ఉర్రూతలూగించిన యాక్షన్ హీరో. ఓ పక్క టై, మెరుపుదాడిలాంటి యాక్షన్ ఫిలిమ్స్ చేసినా కూడా... తరంగిణి, నిరీక్షణ, సూత్రధారులు, మంచి మనసులులాంటి చిత్రాలతో తనలోని వెర్సటాలిటీని ఆవిష్కరించుకున్నారు. ప్రస్తుతం కేరెక్టర్ ఆర్టిస్టుగా బిజీబిజీగా ఉన్న భానుచందర్ గురించి ఆయన అన్నయ్య మూర్తి చందర్ చెబుతోన్న విశేషాలివి! ‘‘మా నాన్నగారు మాస్టర్ వేణు ఫేమస్ మ్యూజిక్ డెరైక్టర్. ఆయనకు మేమిద్దరమే కొడుకులం. భానుకన్నా నేను రెండేళ్లు పెద్ద. వయసు గ్యాప్ పెద్దగా లేకపోవడం వల్లనేమో, ఇద్దరం బ్రదర్స్‌గా కన్నా క్లోజ్ ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్లం. బాగా తిట్టుకుని, కొట్టుకునేవాళ్లం. నాకు పంతమెక్కువ. రెండు, మూడు రోజులు మాట్లాడకపోతే, వాడే వచ్చి బతిమాలుకునేవాడు. ఇద్దరిదీ ఒకటే మంచం. స్కూలు ఫైనల్ వరకూ ఒకే కలర్ డ్రెస్ కూడా. మా ఇద్దర్నీ రామలక్ష్మణులనేవారు. సినిమాలకు, షికార్లకు కలిసి వెళ్లాల్సిందే. ఎక్కువ ఇంగ్లిష్ సినిమాలకు వెళ్తుండేవాళ్లం. క్రికెట్ కూడా ఆడేవాళ్లం. ఇద్దరికీ మ్యూజిక్ అంటే ఇంట్రస్ట్. వాడు గిటార్ నేర్చుకుంటే, నేను పియానో ట్రై చేసేవాణ్ణి. నాన్నగారిలాగా వాడూ మ్యూజిక్ డెరైక్టర్ కావాలని అమ్మ ఆకాంక్ష. నన్నేమో డాక్టర్ని చేయాలని కోరిక. రెండూ నెరవేరలేదనుకోండి. సెప్టెంబర్ 8, ఫన్డే రిలేషణంలో... సినీనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం సోదరుడు సీతారామారావుగారికి కేవలం ఇద్దరు ఆడపిల్లలు అని పొరపాటుగా ప్రచురితమైనది. వాస్తవంగా ఆయనకు ముగ్గురు పిల్లలు. ఒక మగపిల్లాడు, ఇద్దరు ఆడపిల్లలు. కుమారుడు శేషగిరిబాబు ఒక కంపెనీ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. పొరపాటుకు చింతిస్తున్నాం. నౌషాద్‌గారి దగ్గర సంగీత శిక్షణ కోసమని భాను కొన్నాళ్లు ముంబై వెళ్లాడు. ఆ టైమ్‌లో చెడు స్నేహాల వల్ల డ్రగ్స్‌కి బానిసయ్యాడు. నేను వాణ్ణి బలవంతంగా మద్రాసు తీసుకొచ్చి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను. కరాటే నేర్చుకున్నాక వాడి లైఫ్ స్టయిల్ మారిపోయింది. అప్పట్నుంచీ కరెక్ట్ రూట్లోకి వచ్చేశాడు. సినిమా ఆర్టిస్టు అవుతానంటే వద్దని నేను నిరాశపరిచేవాణ్ణి. కానీ భాను మొండివాడు. అనుకున్నది సాధించాడు. తను హీరో కావడం నాకు సర్ప్రైజ్. ఎందుకంటే చిన్నప్పుడు తనలో హీరో ఫీచర్స్ ఉండేవి కాదు. కష్టపడి, ఇష్టపడి తనను తాను డెవలప్ చేసుకున్నాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. నాలో చిన్నప్పటినుంచీ స్పిర్చువల్ థాట్స్ ఎక్కువ. అందుకే పెళ్లి చేసుకోలేదు. నా గురించి భాను కూడా కొన్నాళ్లు పెళ్లి చేసుకోలేదు. చివరకు అమ్మ ఒత్తిడి మేరకు ఆలస్యంగానైనా పెళ్లి చేసుకున్నాడు. వాడికి ఇద్దరు కొడుకులు. వాళ్లని చూస్తుంటే అచ్చంగా మా బాల్యం గుర్తొస్తుంది. ఒకడేమో హీరో అయ్యాడు. ఇంకొకడు మెడిసిన్ చదువుతున్నాడు. మా అమ్మ కోరిక అలా నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. మా ఇద్దరికీ పోలికలున్నా, మనస్తత్వాలు పూర్తి విరుద్ధం. నేను ఇంట్రావర్ట్‌ని. వాడు ఎక్కడికైనా దూసుకుపోగలడు. నాకు మెడికల్ సీటు రాక బి.ఏ.లో చేరాను. ఆ తర్వాత మ్యూజిక్ డిపార్ట్మెంట్లో స్థిరపడిపోయాను. నేను కొన్నాళ్లు మ్యూజిక్ టీచర్‌గా ఓ స్కూల్లో పనిచేశాను. అలాగే సంగీత దర్శకుడు రాజ్ దగ్గర పదేళ్లు ఉన్నాను. నాకన్నా భానులోనే ఎక్కువ మ్యూజిక్ టాలెంట్ ఉంది. తను ఇప్పుడు తలుచుకున్నా మంచి మ్యూజిక్ డెరైక్టర్ కాగలడు. తన సినిమాల్లో నాకు ‘నిరీక్షణ’ అంటే చాలా ఇష్టం. తనలో చాలా పొటెన్షియాలిటీ ఉంది. దాన్నెవరూ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. భాను కేరెక్టర్ యాక్టర్‌గా చేయడం నాకిష్టం లేదు. చేస్తే హీరోగానే చేయాలి. తనకిలాంటి చిన్నా చితకా పాత్రలు చేయాల్సిన అవసరం లేదు. అమితాబ్ బచ్చన్ 70 ఏళ్లు వచ్చినా కూడా శక్తిమంతమైన పాత్రలు చేస్తున్నాడు. ఈ విషయమే ఎన్నిసార్లు చెప్పినా భాను పట్టించుకోడు. ఖాళీగా కూర్చోలేను కదా అంటుంటాడు. - పులగం చిన్నారాయణ