‘గెయిల్’ ఘటన దురదృష్టకరం
సంతాపసభలో వక్తలు
సాక్షి, ముంబై: గెయిల్ ఘటన మానవ తప్పిదమేనని ముంబై బహుజన అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గత శుక్రవారం జరిగిన గెయిల్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మశాంతి కోసం ఆదివారం అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతాప సభను నిర్వహించారు. ముందుగా మృతుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. తదనంతరం వక్తలు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం సంభవించిందని ఆరోపించారు. తన లాభాల్లో రెండు శాతం ఆయా మండలాలు, గ్రామాల అభివృద్ధికి గెయిల్ ఖర్చు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు ఆ సంస్థ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవని విమర్శించారు.
ఘటనా స్థలానికి ముందుగా చేరుకుని బాధితులకు ప్రాథమిక చికిత్సనందించడమే కాక పోలీసులకు సమాచారం అందించిన మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రత్నాకర్ ఆదర్శంగా నిలిచారన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బి.బి. రాజు, సెక్రటరి వి. జి. రావు, ఆంధ్ర యువజన సంఘం - అంధేరి, ఆంధ్ర ప్రజా సంఘం-గోరేగావ్, సంఘం ప్రతినిధి విజయానంద్, అంబేద్కర్ దళిత యువజన సంఘం- ప్రేమనగర్, విశాలాంధ్ర సంఘం -మలాడ్ పదాధికారులు, పాస్టర్ విజయ్, జి.మన్మథరావు, టి. ప్రకాశ్స్వామి, ఎం.సాయిబాబు, జి.కేశవరావు, వడ్డే సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. టి. రాజకుమార్ వందన సమర్పణ చేశారు.