ఆహా కల్యాణం అంటున్న నాని
టాలీవుడ్ యువ నటుడు నానికి ప్రాచుర్యం బాగా పెరిగిందనే చెప్పాలి. తెలుగుతో పాటు తమిళంలోను నటుడిగా పేరు తెచ్చుకుంటూ బహుభాషా నటుడిగా ఎదుగుతున్న నాని పేరు తాజాగా బాలీవుడ్ వరకు పాకింది. ప్రఖ్యాత బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ యాష్‌చోప్రా దృష్టిలో నాని పడ్డారు. అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ తాజాగా అమీర్‌ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్‌తో ధూమ్-3 చిత్రం నిర్మించింది. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
ఈ సంస్థ ఇప్పుడు కోలీవుడ్‌పై కన్నేసింది. తమిళంలో ఆహా కల్యాణం అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది హిందీలో విజయం సాధించిన బ్యాండ్ బాజా భారత్ చిత్రానికి రీమేక్. ఇందులో హీరోగా నటిస్తున్నది ఎవరో కాదు మన నానినే. ఈగ (నాని ) చిత్రంలో తెలుగుతోపాటు తమిళంలో పాపులర్ అయిన నాని ఈ ఆహా కల్యాణం ద్వారా మరోసారి తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. రాణిగుప్తా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు విష్ణువర్ధన్ శిష్యుడు గోకుల్ మెగాఫోన్ పట్టారు. త్వరలో తెరపైకి రానుంది.