Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Full list of Cabinet Ministers in Narendra Modi Government
కేంద్ర కేబినెట్‌: మోదీ 3.0 మంత్రులు వీరే..

సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ ఖరారైంది. ఆదివారం ఉదయం నరేంద్ర మోదీ తన నివాసంలో కొత్త మంత్రులకు తేనీటి విందు ఇచ్చారు. బీజేపీ అగ్రనేతలు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీలకు మరోసారి కేబినెట్‌ పదవులు దక్కాయి. వాళ్లకు పాత శాఖల్నే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక.. కీలక శాఖల్ని కూడా బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం.రాష్ట్రపతి భవన్‌లో ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా... మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించింది. సంకీర్ణ సర్కార్‌ కేబినెట్‌లో భాగస్వామ్య పార్టీల ఎంపీలు కూడా భాగం కానున్నారు.కేబినెట్‌లో బీజేపీ నుంచి రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుక్ మండవియ,రావు ఇంద్రజిత్ సింగ్‌లకు చోటు దక్కింది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు చోటు దక్కింది. ఒకే వాహనంలో ఈ ఇద్దరూ మోదీ నివాసానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి నర్సాపూర్ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు కేబినెట్‌ బెర్త్‌ దక్కింది. మోదీ నివాసంలో తేనీటి విందుకు ఈయన కూడా హాజరయ్యారు. రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్(టీడీపీ), కుమార స్వామి (జేడీఎస్‌), లలన్ సింగ్(జేడీయూ), సహాయ మంత్రిగా రామ్ నాత్ ఠాకూర్(జేడీయూ), జితిన్ రామ్ మాంజీ( హిందూస్తాన్ ఆవం మోర్చా), జయంత్ చౌదరి(ఆర్‌ఎల్‌డీ) ప్రతాప్ రావ్ జాదవ్(శివసేన), అజిత్..ప్రఫుల్ పటేల్(ఎన్‌సీపీ), అనుప్రియా పాటిల్(అప్నాదళ్), రామ్దాస్ అత్వాలే(ఆర్పీఐ)లకు చోటు దక్కింది. సాయంత్రం కల్లా కేంద్ర కేబినెట్‌పై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Telangana Latest News: Ramoji Rao Last Rites Updates
రామోజీరావు అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్‌, సాక్షి: రామోజీగ్రూప్‌ సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం ఉదయం ఫిల్మ్‌ సిటీలోని స్మృతి వనంలో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు జరిగాయి. రామోజీరావుకు గౌరవ వందనంగా గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు పోలీసులు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ముగ్గురు అధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇక.. అంత్యక్రియలకు భారీ సంఖ్యలో రామోజీ సంస్థల ఉద్యోగులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అంతకు ముందు ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి స్మృతి వనం దాకా అంతిమయాత్ర కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామోజీరావు అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. ఆయన కుటుంబ సభ్యుల కూడా ఇందులో పాల్గొన్నారు.మరోవైపు ఈ ఉదయం కూడా పలువురు ప్రముఖులు రామోజీ పార్థివదేహానికి నివాళులర్పించారు. అంతిమ సంస్కారాలను వీక్షించేందుకు స్మృతివనంలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: పెదపారుపూడి టు ఫిలింసిటీ

Canada Reacts to Posters of Indira Gandhi
‘ఖలిస్థానీ‘ వివాదాస్పద పోస్టర్లు: ఘాటుగా స్పందించిన కెనడా మంత్రి

కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు ఇందిరా గాంధీ హత్యకు సంబంధించిన పోస్టర్లు అతికించడం కలకలకలం రేపింది. ఈ చర్యలను కెనడా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హింసను ప్రోత్సహించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. దీనిపై ఎక్స్ వేదికగా కెనడా మంత్రి డామినిక్ ఏ లెబ్లాంక్ స్పందించారు. ‘వాంకూవర్‌లో కొందరు ఇందిరా గాంధీ హత్య పోస్టర్లు వేశారు. కెనడాలో ఈ విధంగా హింసను ప్రోత్సహించడం ఆమోదయోగ్యం కాదు’ అని పేర్కొన్నారు. దీనికి ముందు కెనడాలోని వాంకోవర్‌లో ఖలిస్థానీ మద్దతుదారులు ఇందిరా గాంధీ హత్యపై వివాదాస్పద పోస్టర్లు అతికించడాన్ని హిందూ-కెనడియన్ ఎంపీ, మంత్రి చంద్ర ఆర్య తీవ్రంగా తప్పుపట్టారు. కెనడాలో హింసను ప్రోత్సహించడాన్ని ఎన్నటికీ అంగీకరించబోమని స్పష్టం చేశారు. వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ట్రూడో ప్రభుత్వాన్ని ఆయన కోరారు.ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పార్టీకి చెందిన ఎంపీ ఆర్య ట్విట్టర్‌ వేదికగా.. ‘భారత ప్రధాని ఇందిరా గాంధీ శరీరంపై బుల్లెట్ రంధ్రాలు ఉన్నాయని, ఆమె అంగరక్షకులే తుపాకులు పట్టుకుని హంతకులుగా మారారని పేర్కొంటూ ఖలిస్థానీ మద్దతుదారులు పోస్టర్లు వేసి, మరోమారు హిందూ-కెనడియన్లలో భయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.ఇది కొన్ని సంవత్సరాల క్రితం బ్రాంప్టన్‌లో జరిగిన బెదిరింపుల కొనసాగింపని, కెనడాలోని హిందువులను భారతదేశానికి తిరిగి వెళ్లాలని కోరుతున్న ఖలిస్థానీ ఉద్యమ నేత పన్నూన్‌ చర్య అని పేర్కొన్నారు. ఆయన ప్రత్యేక సిక్కు రాష్ట్ర ఉద్యమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ విధమైన చర్యలకు పాల్పడతున్నారన్నారు. పన్నూన్‌పై కెనడాలోని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్య డిమాండ్‌ చేశారు. ఇటీవల వాంకోవర్‌లో భారత ప్రధాని ఇందిరా గాంధీ హత్యను చిత్రీకరించే పోస్టర్లు వెలిశాయని పబ్లిక్ సేఫ్టీ, డెమోక్రటిక్ ఇన్‌స్టిట్యూషన్స్, ఇంటర్ గవర్నమెంటల్ అఫైర్స్ మంత్రి డొమినిక్ ఎ లెబ్లాంక్ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. హింసను ప్రోత్సహించడం ఎన్నటికీ ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా హౌస్ ఆఫ్ కామన్స్ ఆఫ్ కెనడాలో నేపియన్ ఎన్నికల జిల్లాకు చంద్ర ఆర్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. Khalistan supporters in Vancouver with posters, of Hindu Indian prime minister Indira Gandhi body with bullet holes with her bodyguards turned assassins holding their guns, are again attempting to instil fear of violence in Hindu-Canadians. This is continuation of threats with a… pic.twitter.com/ia8WQL4VtH— Chandra Arya (@AryaCanada) June 8, 2024

whats wrong with the T20 World Cup pitches in New York?
దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్‌పైనే?

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో అస‌లు సిస‌లు స‌మ‌రానికి రంగం సిద్దమైంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. 8 నెలల తర్వాత క్రికెట్ మైదానంలో యుద్దానికి ఆ రెండు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం​ చేసుకున్నాయి.ఓ జట్టు ఐసీసీ టోర్నీల్లో తమ ఆధిపతాన్ని కొనసాగించాలని భావిస్తుంటే.. మరో జట్టు చరిత్రను తిరిగి రాయాలని ఉవ్విళ్లూరుతోంది. మీరు క్రికెట్ అభిమానులు అయితే ఈ ఉపోధ్గాతం అంతా ఎవరి కోసమో ఈపాటికే అర్థం అయిపోయింటుంది. అవును మీరు అనుకుంటుంది నిజమే.ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం(జూన్ 9)న న్యూయ‌ర్క్ వేదిక‌గా చిరకాల ప్ర‌త్య‌ర్ధులైన భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్లు అమీతుమీ తెల్చుకున్నాయి. సాధ‌ర‌ణంగా దాయాదుల పోరు అంటే అందరూ ఎవరు గెలుస్తారు? ఏ జ‌ట్టు బ‌ల‌మెంత‌? బ‌ల‌హీన‌త‌లు ఏంటి? అంటూ పెద్ద ఎత్తున చ‌ర్చ‌ న‌డుస్తుంటుంది. కానీ ఇప్పుడు ఈ దాయాదుల పోరుకు వేదికైన నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని పిచ్‌పైనే అంద‌రి క‌ళ్లు ఉన్నాయి. ఈ వికెట్‌ ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.అది పిచ్ కాదు.. భూతంఈ ఏడాది పొట్టి వ‌ర‌ల్డ్‌క‌ప్‌న‌కు వెస్టిండీస్‌తో పాటు అమెరికా కూడా ఆతిథ్యం ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మెగా టోర్నీ ఆరంభానికి మూడు నెల‌ల ముందు అమెరికాలోని న్యూయ‌ర్క్‌లో కొత్త‌గా అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించారు. అదే నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. ఈ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నసావు మైదానం వేదిక‌గా మొత్తం 8 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఈ మెగా టోర్నీలో శ్రీలంక-దక్షిణాఫ్రికా, ఐర్లాండ్-ఇండియా, ఐర్లాండ్‌- కెనడా, దక్షిణాఫ్రికా-నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌లు జ‌రిగాయి. ఈ స్టేడియంలోని పిచ్‌ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ వికెట్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎవ‌రికి ఆర్ధం కావ‌డం లేదు. ఈ వికెట్‌పై అనూహ్య బౌన్స్ కార‌ణంగా బ్యాట‌ర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. న‌సావు స్టేడియంలో ఇప్పటివరకూ జరిగిన మ్యాచుల్లో 150 పరుగులు కూడా దాటలేదు.ఇప్ప‌టివర‌కు జ‌రిగిన మ్యాచ్‌ల్లో కెన‌డా చేసిన 137 ప‌రుగులకే అత్య‌ధిక స్కోరు కావ‌డం గ‌మ‌నార్హం. పిచ్‌పై ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోని ఆరు ఇన్నింగ్స్‌ల్లో రెండుసార్లు మాత్రమే జట్లు 100 పరుగుల మార్కును అధిగమించాయి. న‌సావు వికెట్ ఎలా ఉందో ఈ గ‌ణాంకాలు చూస్తే మ‌న‌కు అర్ధమ‌వుతుంది. అస్స‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదు. ద‌క్షిణాఫ్రికా, భార‌త్ వంటి మేటి జ‌ట్లు కూడా స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి.అంతేకాకుండా ఆట‌గాళ్లు గాయాల బారిన కూడా ప‌డుతున్నారు. ఐర్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఓ రాక‌సి బౌన్స‌ర్ వ‌ల్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మోచేతికి గాయ‌మైంది. దీంతో మ్యాచ్ మ‌ధ్య‌లోనే రోహిత్ మైదానాన్ని వీడాడు. అయితే ఈ పిచ్‌పై రోహిత్ శ‌ర్మ సైతం అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ఈ వికెట్‌పై 140-150 వరకూ స్కోరు చేయడమే చాలా కష్టమని రోహిత్ చెప్పుకొచ్చాడు. అయితే భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌కు కొత్త పిచ్ ఉప‌యెగించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ‌ కొత్త పిచ్‌ను ఉపయోగిస్తే అది బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందా లేక బౌలర్లకే సహకరిస్తుందా అన్న‌ది వేచి చూడాలి.

550 Times Re Released Movie Creat All Time Record
550 సార్లు రీ-రిలీజ్‌ అయిన ఏకైక సినిమా.. ఈ విషయాలు తెలుసా..?

టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట రీ-రిలీజ్‌... ఒకప్పుడు బ్లాక్‌ బస్టర్‌ అయిన సినిమాలను మళ్లీ వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపుతున్నారు. అప్పటి సినిమాలకు కొత్త టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ చేసి మరీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు అయితే రెండు నుంచి మూడు సార్లు రీ-రిలీజ్‌ అయ్యాయి. అయితే, ఒక సినిమాను ఏకంగా 550 సార్లకు పైగానే రీరిలీజ్‌ చేశారంటే నమ్ముతారా..? ఆశ్చర్యం అనిపించినా ఈ వార్త నిజమే. కన్నడలో ఉపేంద్ర డైరెక్ట్‌ చేసిన 'ఓం' ఈ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్‌ హీరోగా నటించారు. ఇందులో ప్రేమ హీరోయిన్‌గా మెప్పించింది. 1995 మే 19న ఈ చిత్రం విడుదలైంది. సుమారు 30 ఏళ్లు అవుతున్నా ఈ చిత్రానికి క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి వరకు ఏకంగా 550 సార్లు రీ-రిలీజ్‌ చేసిన సినిమాగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అత్యధికసార్లు రీ-రిలీజ్‌ అయిన భారతీయ చిత్రంగా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో కూడా స్థానం దక్కించుకుంది.ఈ సినిమా కోసం అండర్‌వరల్డ్‌లో పనిచేసిన అనేక మంది నేరస్థులతో పాటు నిందితులను కూడా తీసుకొచ్చారు. ఓం సినిమా కోసమే జైలు నుంచి బెయిల్‌పై వారిని బయటకు తీసుకొచ్చారు. అందులో కొంతమంది కరుడుగట్టిన నురస్థులు కూడా ఉన్నారు. అప్పట్లో ఇదొక సంచలనంగా మారింది. అప్పట్లో ఈ సినిమా నిర్మించేందుకు రూ. 70లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. బెంగళూరులోని కపిల్‌ థియేటర్‌లో 'ఓం'చిత్రాన్ని అత్యధికంగా 35సార్లు రీ-రిలీజ్‌ చేయడం అనేది ఆల్‌టైమ్‌ రికార్డుగా ఉంది. 1996 కర్ణాటక స్టేట్‌ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా శివరాజ్‌కుమార్‌, నటిగా ప్రేమ అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఉపేంద్రకు కూడా అవార్డు దక్కింది. ఓం సినిమాతో సౌత్‌ ఇండియా నుంచి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ను శివరాజ్‌కుమార్‌ దక్కించుకున్నారు. 2015లో 'ఓం' డిజిటల్‌ రైట్స్‌ను అమ్మకానికి మేకర్స్‌ పెట్టగా రూ.10కోట్లకు ఉదయ్‌ టీవీ కొనుగోలు చేసింది. ఇంతటి హిస్టరీ క్రియేట్‌ చేసిన ఈ సినిమా తెలుగులోనూ 'ఓంకారమ్‌' పేరుతోనే రాజశేఖర్‌ రీమేక్‌ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇందులో రాజశేఖర్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. బాలీవుడ్‌లో 'అర్జున్‌పండిట్‌' పేరుతో సన్నీ డియోల్, జుహీచావ్లా రీమేక్‌ చేశారు.

Funday Special Cover Story Commemorating The Re-Opening Of Children's Schools
పిల్లలూ గుర్తుందా!? వేసవి సెలవులు అయిపోవచ్చాయి..!

వేసవి సెలవులు అయిపోవచ్చాయి. స్కూళ్లు ప్రారంభమవుతున్నాయి. మళ్లీ తరగతి గదులు, ట్యూషన్లు, హోమ్‌ వర్కులు ఇలా పిల్లల్లో హంగామా మొదలైపోయింది. యూనిఫామ్, టెక్స్‌›్టబుక్స్‌ ఇలా అన్నీ మారుతుంటాయి. ఇదంతా పిల్లల తల్లిదండ్రులకు కూడా పరీక్షే! కొత్త స్కూల్‌ బ్యాగ్‌ కొనడం దగ్గర నుంచి కొత్త పుస్తకాలకు అట్టలు వేయడం వరకూ ప్రతి పనీ పేరెంట్స్‌కి హైరానా కలిగిస్తుంది. అయితే పిల్లల్లో పాత ఫ్రెండ్స్‌ని కలుసుకుంటున్నామని, కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారని, క్లాస్‌ రూమ్‌ మారబోతుందని, కొత్త పాఠాలు నేర్చుకోబోతున్నామని ఇలా మిశ్రమ భావోద్వేగాలు తొంగి చూస్తుంటాయి.అయితే పిల్లలు తిరిగి స్కూల్‌ వాతావరణానికి అలవాటు పడాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పవు. పిల్లలు స్కూల్లో ఏది బాగా తింటారు? బాక్సుల్లో ఏం పెట్టాలి? వీటి గురించి కూడా దృష్టి పెట్టాలి. మొదటిసారి స్కూల్‌కి వెళ్తున్న పిల్లల విషయంలో ఎలాంటి చిట్కాలు పాటించాలి? ఆల్‌రెడీ స్కూల్‌ అలవాటున్న పిల్లలను హాలిడేస్‌ మూడ్‌ నుంచి ఎలా బయటికి తీసుకురావాలి? అవన్నీ ఇప్పుడు చూద్దాం.మొదటిసారి స్కూల్‌కి పంపుతున్నారా..?ప్రీస్కూల్, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీల్లో పిల్లల్ని జాయిన్‌ చేసేటప్పుడు వారిని పేరెంట్స్‌ చాలా ప్రిపేర్‌ చేయాల్సి ఉంటుంది. కొంతమంది పిల్లలు ఈ మార్పును ఆనందంగా అంగీకరిస్తారు. కానీ మరికొందరికి అలవాటు పడటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. పిల్లల ఎడ్యుకేషన్‌ స్టార్ట్‌ అయ్యిందంటే తల్లిదండ్రులకు టెన్షన్ ్స మొదలైపోయినట్లే! మరి దానిని సులభం చేయడానికి ఈ చిట్కాలను పాటిస్తే మంచిది.చిన్నచిన్న పిల్లలకు స్కూల్‌ ఎలా ఉంటుందో చూపించడానికి ’టాయ్‌ స్కూల్‌’ని తయారు చెయ్యాలి. బొమ్మలతో చిన్న నమూనా పాఠశాలను ఏర్పాటు చెయ్యాలి. మామూలుగా పాఠశాల రోజున ఏమి జరుగుతుందనే దాని గురించి చిన్నగా మాట్లాడుతూనే వారితో కలిసి ఆడుకోవాలి.పాఠశాల ప్రారంభానికి ముందు పిల్లలకు వీలయినన్ని ఎక్కువ పుస్తకాలను చదివి వినిపించాలి. లేదా వారితో చదివించాలి. పిల్లలు వారి కొత్త పాఠశాలలో చేయగలిగే సంగతులు గురించి చర్చించాలి. వారు కలుసుకోబోయే స్నేహితులు, అక్కడుండే వినోదం గురించి మాట్లాడుతూ ఉండాలి.క్లాస్‌ రూముల్లో పిల్లలు స్వయంగా చెయ్యగలిగే పనులను ఇంట్లో ఉన్నప్పటి నుంచే చక్కగా ప్రాక్టీస్‌ చేయించాలి. లంచ్‌ బాక్స్, జ్యూస్‌ లేదా వాటర్‌ బాటిల్‌ మూతలు తెరవడం, తిరిగి మూతలు పెట్టడం.. తమంతట తామే షూస్‌ తియ్యడం, తిరిగి తొడుక్కోవడం, స్పూన్‌తో అన్నం తినడం ఇలాంటి సాధారణ పనులను నేర్పించాలి.స్కూల్లో ఏదైనా విషయం గురించి పిల్లలు ఇబ్బంది పడితే ఆ విషయం గురించి టీచర్‌కి ఎలా చెప్పాలి? ఎలా పర్మిషన్‌ అడగాలి? వంటివి కూడా అలవాటు చెయ్యాలి.స్కూల్‌ ప్రారంభమయ్యే ముందురోజుల్లో పిల్లలను తీసుకుని షాపింగ్‌ వెళ్తే మంచిది. ఆ షాపింగ్‌లో వాళ్లకు నచ్చిన స్కూల్‌ బ్యాగ్, పెన్సిల్‌ కేస్, యూనిఫాం, లంచ్‌ బాక్స్, వాటర్‌ బాటిల్‌ ఇలా అన్నీ కొనిస్తే వారిలో ఉత్సాహం పెరుగుతుంది.ఇక చిన్నారులను స్కూల్‌కి పంపించే నాటికి స్వయంగా టాయిలెట్‌కి వెళ్లగలరా లేదా నిర్ధారించుకోవాలి. లేదంటే కనీసం టాయిలెట్‌ వస్తుందని టీచర్‌కి చెప్పడం అయినా నేర్పించాలి.చిన్న పిల్లలకు షేరింగ్‌ కూడా అలవాటు చెయ్యాలి. స్కూల్లో ఇతర పిల్లల దగ్గర లాక్కోకుండా ఉండటంతో పాటు పక్కపిల్లలకు తమ దగ్గరున్నది షేర్‌ చేసే విధానం నేర్పాలి. స్కూల్లో ఏదైనా పంచిపెడుతున్నప్పుడు తమ వంతు వచ్చే వరకూ వేచి చూడటం గురించి వివరించాలి. దాని వల్ల పిల్లలకు స్నేహితులు పెరుగుతారు.ఇక స్కూల్లో జాయిన్‌ అయిన తర్వాత కూడా పిల్లలతో కలిసి పేరెంట్స్‌ పాఠశాలకు వెళ్లడం, స్కూల్‌ దగ్గర ఆగి ప్లే గ్రౌండ్‌ని పరిశీలించడం, వారి క్లాస్‌ టీచర్‌తో, ఇతర విద్యార్థులతో మాట్లాడటం మంచిది. ఆ సమయంలోనే పిల్లలకు వారి తరగతి గదిలో ఏది బాగా నచ్చుతుందో తెలుసుకోవచ్చు.పాఠశాలలో మొదటి రోజు ఒత్తిడి లేకుండా పిల్లలను సిద్ధం చేయడానికి స్కూల్‌ తెరిచే ముందే మీ పిల్లల తరగతిలో జాయిన్‌ కాబోతున్న ఇతర పిల్లలకు మీ పిల్లలను పరిచయం చెయ్యాలి. అవసరం అయితే ఆ విద్యార్థి కుటుంబాన్ని కలుసుకోవాలి. దాని వల్ల స్కూల్‌లో జాయిన్‌ అయిన రోజు క్లాసులో మీ పిల్లలకు తెలిసి వ్యక్తి ఒకరైనా ఉంటారు. దాంతో ఆ స్కూల్‌ తమకు తెలియని చోటు అనే బెరుకు తగ్గుతుంది.కొద్ది సమయం పాటు మీ నుంచి దూరంగా ఉండేలా వారికి ముందే అలవాటు చెయ్యాలి. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు లేదా మీరు విశ్వసించే పెద్దవారితో మీరు లేకపోయినా మీ పిల్లలు కలిసి ఉండేలా చూసుకోవాలి.పై తరగతులకు వెళ్లే పిల్లల కోసం..చదువులో కాస్త డల్‌గా ఉండి టీచర్స్‌కి భయపడే పిల్లలకు స్కూల్స్‌ ప్రారంభం అంటే కాస్త బెరుకు ఉంటుంది. అలాంటి పిల్లలతో పేరెంట్స్‌ మనసు విప్పి మాట్లాడాలి. వారిలో మానసిక ధైర్యాన్ని కలిగించాలి.పిల్లలు మొదటిరోజు కోసం ఎదురుచూడటంలో సానుకూల అంశాల గురించి పేరెంట్స్‌ చర్చించాలి. వారి పాత ఫ్రెండ్స్‌ని గుర్తు చేస్తూ, కొత్త ఫ్రెండ్స్‌ వస్తే ఎలా కలుస్తారో తెలుసుకుంటూ స్నేహపూర్వకంగా మాట్లాడాలి.పిల్లలు స్కూల్‌కి నడిచి వెళ్తున్నా, బస్సు లేదా ఆటోలో ప్రయాణిస్తున్నా వారితో పాటు ఉండే వారి స్నేహితుల్ని పరిచయం చేసుకోవడం మంచిది. మొదటిరోజు మాత్రం వీలైతే స్వయంగా స్కూల్లో డ్రాప్‌ చేసి పికప్‌ చేసుకోవడం మంచిది. వారిలోని ఒత్తిడికి దూరం చేసినట్లు అవుతుంది.కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు నుంచే స్కూల్‌ షెడ్యూల్‌ని బట్టి వారి నిద్ర వేళలను నిర్ణయించి, అలానే నిద్రపోయేలా చెయ్యాలి. సరైన నిద్ర అందకపోతే స్కూల్లో వారు యాక్టివ్‌గా ఉండలేరు. అలాగే వారికి స్నానం చేయించడం, స్కూల్‌కి రెడీ చేయించడం, స్కూల్‌ నుంచి రాగానే స్కూల్లో సంగతులు అడిగి తెలుసుకోవడం, అవసరం అయితే వారి ఆలోచనలను సరిచేయడం, హోమ్‌ వర్క్‌ చేయించడం వంటి పనుల్లో వారి కోసం సమయాన్ని కేటాయించాలి. అలాగే పిల్లలు నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇంటిని వీలైనంత నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించాలి.పిల్లలు స్కూల్‌కి వెళ్లే దారిల్లో ఏ షాపులు ఎక్కడ ఉన్నాయి? ఎటు వెళ్తే స్కూల్‌ వస్తుంది? అలాగే స్కూల్‌ నుంచి ఇంటికి ఏయే దారుల్లో రావచ్చు.. అవన్నీ ప్రాక్టీస్‌ చేయించాలి. వారితో కూడా వెళ్తున్నప్పుడు వారినే దారి చెప్పమని అడగటం, లేదంటే ఇంట్లో కూర్చోబెట్టి ఆ దారి గురించి చర్చించడం లాంటివి చెయ్యాలి. అలా చేయడం వల్ల వారు ప్రమాదంలో పడినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినా క్షేమంగా ఇంటికి చేరుకోగలరు.బస్సులు లేదా ఆటోలు ఎక్కుతున్నప్పుడు ఆగి దిగాలని, నిదానంగా ఎక్కాలని పిల్లలకు సూచించాలి. అలాగే పిల్లల్ని తీసుకెళ్లే డ్రైవర్‌తో కూడా పిల్లలను ఓ కంట కనిపెట్టమని చెబుతుండాలి. మీ పిల్లలు ఎక్కడ కూర్చుంటారు? ఎలా కూర్చుంటారు? అన్నీ డ్రైవర్‌ని ఆరా తియ్యాలి.అలాగే స్కూల్‌కి వెళ్తున్న పిల్లలకు రోడ్డు దాటే సమయాల్లో ఇరువైపులా చూసుకోవడం నేర్పించాలి. ఏవైనా వాహనాలు వస్తుంటే పక్కకు ఆగి, అవి వెళ్లిన తర్వాతే నడవడం గురించి చెప్పాలి. ఇవన్నీ దగ్గరుండి ప్రాక్టీస్‌ చెయ్యించాలి.ఏది తిన్నా రోడ్డు మీద ఆరుబయట తినొద్దని, ఇంటికి తెచ్చుకునైనా, లేదా స్కూల్లోనైనా తినాలని చెప్పాలి. అలాగే చేతులు కడుక్కున్న తర్వాతే తినడం అలవాటు చెయ్యాలి. లేదంటే అలర్జీలు, జలుబులు వస్తుంటాయని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.పిల్లల్లో ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే దాని గురించి ముందుగానే ఆ స్కూల్‌ టీచర్స్‌తో, ఆయాలతో వివరంగా చెప్పి అత్యవసర పరిస్థితిల్లో సమాచారం ఇవ్వమనాలి.ఇక స్కూల్‌కి సైకిల్‌ మీద వెళ్లే పిల్లల(టీనేజ్‌ వారు) విషయంలో మరింత జాగ్రత్తలు అవసరం. రద్దీప్రదేశాల్లో వెళ్తుంటే హెల్మెట్‌ తప్పసరి ధరించేలా చూడాలి.అపరిచితులు ఇచ్చిన ఆహారం తినొద్దని పిల్లలకు చెప్పడంతో పాటు తింటే దాని వల్ల కలిగే ప్రమాదాల గురించి చెప్పాలి. అవసరమైతే కొన్ని ఉదాహరణలను వివరించాలి. అపరిచితులు పిల్లలను కిడ్నాప్‌ చేస్తారని.. తిరిగి ఇంటికి రాకుండా తీసుకునిపోతారని డైరెక్ట్‌గా చెప్పకుండా.. కొన్ని పేర్లు ఊహించి చెబుతూ.. ఓ కథ రూపంలో వారికి చెబుతుండాలి. అలా చేస్తే వారి మనసుల్లో నాటుకునిపోతుంది.పిల్లలు స్కూల్లో లేదా బయట లేదా బస్సుల్లో ఏవైనా బెదిరింపులకు లోనవుతున్నా, ఏదైనా సమస్యల్లో ఇరుక్కున్నా, అలాంటి విషయాలను ఎప్పటికప్పుడు గమనించు కుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్‌ గురించి ఆడపిల్లలతో పాటు మగ పిల్లలకు కూడా చెప్పాల్సిందే. సమస్యను మీదకు తెచ్చుకోకుండా ఎలా ఉండాలో చెప్పడంతో పాటు సమస్య వస్తే దాని నుంచి ఎలా బయటపడాలో కూడా నేర్పించాలి. ఒకవేళ ఇతర పిల్లలకు మీ పిల్లల వల్లే సమస్య ఏర్పడుతుంటే దాన్ని కూడా సున్నితంగానే తీసుకోవాలి. పిల్లల దూకుడు ప్రవర్తనకు కొన్ని పరిమితులు విధించి వారిని నెమ్మదిగా మార్చాలి.హోమ్‌వర్క్‌ సమయంలో టీవీ లేదా ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులన్నింటినీ ఆపెయ్యాలి. పెద్దవారు అవుతున్న పిల్లల విషయంలో ఇంటర్నెట్‌ వినియోగాన్ని గమనిస్తూ ఉండాలి.పిల్లల్లో కళ్లు, మెడ, తల అలసటకు గురవుతుంటే దాన్ని గుర్తించి, చదువుతున్నప్పుడు వారికి కాసేపు విరామం ఇస్తుండాలి. కనీసం ఒక పది నిమిషాలు వారికి నచ్చినట్లుగా ఉండనివ్వాలి.పిల్లలు ఇష్టంగా తినే ఈజీ రెసిపీలు..పిల్లలు ఆకలికి ఎక్కువగా ఆగలేరు. పైగా బయట చూసిన తినుబండారాలను చూస్తే అసలు ఆగరు. అందుకే వారికి కావాల్సిన భోజనంతో పాటు స్నాక్స్‌ కూడా సిద్ధం చేసి బాక్సుల్లో పెట్టడం మంచిది. ఒకవేళ మధ్యాహ్నం భోజనాన్ని స్కూల్‌లో ఉచితంగా అందిస్తున్నా, ఇలాంటి స్నాక్స్‌ బాక్స్‌ల్లో పెడితే పిల్లలు దృఢంగా పెరుగుతారు. ఈజీగా సిద్ధమయ్యే కొన్ని రెసిపీస్‌ ఇప్పుడు చూద్దాం.రాగి కుకీలు..కావాల్సినవి..రాగి పిండి– ఒకటిన్నర కప్పులుఏలకుల పొడి– అర టేబుల్‌ స్పూన్‌గుడ్డు– 1ఉప్పు– తగినంతఅల్లం పొడి– కొద్దిగాకొబ్బరి పాలు, రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ – పావు కప్పు చొప్పునతయారీ..ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. ఒక పాన్ లో రాగి పిండి, ఏలకుల పొడి వేసుకుని దోరగా వేయించాలి. ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి.. దానిలో గుడ్డు, అల్లం పొడి, రైస్‌ బ్రాన్‌ ఆయిల్, కొబ్బరి పాలు వేసుకుని మిక్సీ పట్టాలి. దాని వల్ల ఆ మిశ్రమం మొత్తం ముద్దలా మారిపోతుంది. అనంతరం కుకీస్‌లా చేసుకుని.. ఓవెన్ లో 180 డిగ్రీలసెల్సియస్‌లో.. 8 నిమిషాల పాటు బేక్‌ చేస్తే సరిపోతుంది.ఓట్స్‌ ఇడ్లీ..కావాల్సినవి..ఓట్స్‌– 2 కప్పులు (దోరగా వేయించి, మిక్సీ పట్టుకోవాలి)నూనె– అర టేబుల్‌ స్పూన్‌మినప పొడి– 1 టేబుల్‌ స్పూన్‌శనగపిండి– అర టేబుల్‌ స్పూన్‌పెరుగు– 2 కప్పులుపసుపు, కారం– కొద్దికొద్దిగాతయారీ..ముందుగా ఒక బౌల్‌లో ఓట్స్‌ పౌడర్, నూనె, మినప పొడి, శనగపిండి, పెరుగు వేసుకుని బాగా కలిపి.. అవసరం అయితే కొద్దిగా నీళ్లు పోసుకుని, ఇడ్లీ రేకుల్లో కొద్దికొద్దిగా వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి. అభిరుచిని బట్టి ఇడ్లీ పిండిలో క్యారెట్‌ తురుము, కొత్తిమీర తురుము కూడా కలుపుకోవచ్చు.ఖర్జూరం– జీడిపప్పు లడ్డూ..కావాల్సినవి..ఖర్జూరాలు, జీడిపప్పు– 1 కప్పు,కొబ్బరి తురుము– అర కప్పు,ఉప్పు– తగినంత,నూనె– 1 టేబుల్‌ స్పూన్‌తయారీ..ముందు ఖర్జూరాలను ఒక గంట నీటిలో నానబెట్టి, గింజ తీసి.. ఆరబెట్టాలి. అనంతరం ఒక మిక్సీ బౌల్‌లో ఖర్జూరాలు, జీడిపప్పు, కొబ్బరి కోరు, తగినంత ఉప్పు, నూనె వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని, నేయి రాసుకున్న చేతులతో చిన్న చిన్న ఉండల్లా చేసుకోవచ్చు.హెర్బ్‌డ్‌ పొటాటోస్‌..కావాల్సినవి..బంగాళదుంపలు– 2 పెద్దవి(తొక్క తీసి.. కడగాలి, వాటిని సన్నని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి),ఆలివ్‌ నూనె– 1 టేబుల్‌ స్పూన్,వెల్లుల్లి తురుము– కొద్దిగాతులసి ఆకుల తురుము – కొద్దిగా(అభిరుచిని బట్టి),చిల్లీ ఫ్లేక్స్‌– అర టేబుల్‌ స్పూన్‌ఒరేగానో తురుము– 1 టేబుల్‌ స్పూన్‌ (మార్కెట్‌లో దొరుకుతుంది)తేనె– 2 టేబుల్‌ స్పూన్లుఉప్పు– తగినంతతయారీ..ఒక బౌల్‌లో బంగాళాదుంప ముక్కలు వేసుకుని చిల్లీ ఫ్లేక్, ఆలివ్‌ నూనె, వెల్లుల్లి తురుము, తులసి ఆకుల తురుము, తేనె, ఒరేగానో తురుము ఇలా అన్నీ కలిపి గిన్నెను బాగా కుదపాలి. అనంతర వాటిని బేకింగ్‌ ట్రేలో పెట్టి.. 200 డిగ్రీల సెల్సియస్‌లో 10–15 నిమిషాలు బేక్‌ చేస్తే సరిపోతుంది.స్టీమ్డ్‌ ధోక్లా..కావాల్సినవి..శనగపిండి – 1 కప్పు,ఓట్స్, జొన్నపిండి – పావు కప్పు చొప్పున,పంచదార – 1 టేబుల్‌ స్పూన్,పసుపు– 1 టీస్పూన్,నిమ్మరసం– 1 టేబుల్‌ స్పూన్,ఉప్పు– తగినంత,బేకింగ్‌ పౌడర్‌– 1 టేబుల్‌ స్పూన్‌నీళ్లు– సరిపడా,నూనె– 1 టీ స్పూన్‌తయారీ..శనగపిండి, ఓట్స్, జొన్నపిండి, పంచదార, పసుపు, నిమ్మరసం, బేకింగ్‌ పౌడర్, నూనె వేసుకుని బాగా కలిపి.. కొద్దిగా ఉప్పు తగినంత నీళ్లు పోసుకుని బాగా మిక్స్‌ చెయ్యాలి. అనంతరం ఒక బౌల్‌ తీసుకుని దానిలో ఈ మిశ్రమాన్ని వేసుకుని ఆవిరిపై ఉడికించాలి. ఆవాలు, కొత్తిమీర తాళింపు వేసుకుని.. కొత్తి మీర చట్నీతో కలిపి బాక్స్‌లో పెడితే సరిపోతుంది.మొత్తానికి పిల్లలకు నచ్చేవిధంగా, వారు మెచ్చే విధంగా స్కూల్‌కి పంపించగలిగితే వారి వ్యక్తిత్వ వికాసం బాగుంటుంది. వారిలో కొత్త ఉత్సాహం పొంగుకొస్తుంది. దాంతో వారు పెద్దల మాటను వినడంలో, శ్రద్ధగా చదవడంలో, వినయ విధేయలతో పెరగడంలో నంబర్‌ వన్‌ అవుతారు.

Gangs Of Godavari OTT Streaming Date Announced Now
ఓటీటీలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. అధికారిక ప్రకటన

టాలీవుడ్‌ ప్రముఖ హీరో విశ్వక్ సేన్ నటించిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు మే 31న థియేటర్స్‌లోకి వచ్చేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా విశ్వక్‌ అభిమానులకు విజిల్స్‌ కొట్టించే సినిమా అని కూడా చెప్పవచ్చు. తాజాగా విశ్వక్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త వచ్చేసింది. ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.విష్వక్‌ సేన్‌, అంజ‌లి, నేహాశెట్టి, నాజ‌ర్‌, పి.సాయికుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' జూన్‌ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. తెలుగు,తమిళ్‌,కన్నడ,మలయాళంలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది.గోదావ‌రి నేప‌థ్యంలో సినిమా అంటే ప‌చ్చ‌టి ప‌ల్లెసీమ‌ల్లో కనిపించే వాతావ‌ర‌ణ‌మే గుర్తొస్తుంది. అయితే, అందుకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది ప‌గ‌, ప్ర‌తీకారాల‌తో ఓ యువ‌కుడి ప్రయాణాన్ని దర్శకుడు కృష్ణ‌చైత‌న్య అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులు అంజలి పాత్రకు కాస్త ఎక్కువ మార్కులే పడుతాయి. విష్వక్‌ నటనకు ఏమాత్రం పేరు పెట్టాల్సిన పనిలేదని చెప్పవచ్చు. సినిమా విడుదలయిన వారంలోనే రూ. 20 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌తో థియేటర్‌లో రన్‌ అవుతుంది. అయితే, కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. దీంతో మరోసారి సినిమా చూడొచ్చని ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషి అవుతున్నారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in)

Israel-Hamas war: Israel rescues 4 hostages, 210 Palestinians reported killed
గాజాలో భీకర పోరు.. 210 మందికి పైగా మృతి!

జెరూసలెం/గాజా: సెంట్రల్‌ గాజాలో నుసెయిరత్‌లో హమాస్‌ మిలిటెంట్లు, ఇజ్రాయెల్‌ సైన్యం మధ్య పోరు భీకరంగా సాగుతోంది. శనివారం నుసెయిరత్, పరిసర ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ దాడుల్లో 210 మంది చనిపోయినట్టు సమాచారం! 400 మంది దాకా గాయపడినట్లు హమాస్‌ను ఉటంకిస్తూ అల్‌జజీరా పేర్కొంది. మృతుల్లో పలువురు చిన్నారులున్నట్లు తెలిపింది. డెయిర్‌ అల్‌ బలాహ్‌లోని అల్‌–హక్సా ఆస్పత్రి మొత్తం రక్తంతో తడిచి వధశాలగా మారిపోయిందని డాక్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ పేర్కొంది.నలుగురు బందీలకు విముక్తి..ఇలా ఉండగా, హమాస్‌ మిలిటెంట్ల చెర నుంచి బందీలను విడిపించుకునేందుకు గాజాపై యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్‌ ఆర్మీ పెద్ద విజయం నమోదు చేసుకుంది. నుసెయిరత్‌లో ఓ భవన సముదాయంపై శనివారం పట్టపగలే ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టిన ఆర్మీ రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాచి ఉంచిన నోవా అర్గామని(25), అల్మోగ్‌ మెయిర్‌ జాన్‌(21), ఆండ్రీ కొజ్లోవ్‌(27), ష్లోమి జివ్‌(40) అనే నలుగురు బందీలను సురక్షితంగా తీసుకొచ్చినట్లు తెలిపింది. తాజాగా రక్షించిన నలుగురితో కలిపి ఇజ్రాయెల్‌ ఆర్మీ ఇప్పటి వరకు కాపాడిన బందీల సంఖ్య ఏడుకు చేరుకుంది. అమెరికా అందించిన సమాచారంతోనే బందీలను ఇజ్రాయెల్‌ ఆర్మీ గుర్తించి, రక్షించిందని బైడెన్‌ ప్రభుత్వంలోని ఓ అధికారి వెల్లడించారు. గురు, శుక్రవారాల్లోనూ ఇజ్రాయెల్‌ దాడుల్లో డజన్ల మంది మరణించారు.ఆమె వీడియో వైరల్‌.. శనివారం ఐడీఎఫ్‌ రక్షించిన వారిలో అర్గామని అనే మహిళ ఉన్నారు. మిలిటెంట్లకు చిక్కిన బందీల్లో అర్గామనికి చెందిన వీడియోనే మొదటిసారిగా బయటకు వచి్చంది. ఇద్దరు మిలిటెంట్లు బైక్‌పై తీసుకెళ్తుండగా ‘నన్ను చంపకండి’అని ఆమె రోదిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. బ్రెయిన్‌ కేన్సర్‌ ముదిరి మృత్యుశయ్యపై ఉన్న తనకు కూతురిని చూడాలని ఉందంటూ అర్గామని తల్లి లియోరా ఏప్రిల్‌లో ఒక వీడియో విడుదల చేశారు. చెర నుంచి విడుదలైన అర్గామనితో ప్రధాని నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడారు. బందీలందరినీ విడిపించేదాకా యుద్ధం ఆపబోమని స్పష్టం చేశారు.

Sakshi Editorial On results in evms
‘బలి’ కోరుతున్న సాంకేతిక విజయం!

‘ది హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ గోల్‌ గురించి క్రీడా ప్రియులందరూ వినే ఉంటారు. 1986 ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ సందర్భంగా అర్జెంటీనా – ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో డీగో మారడోనా చేసిన తొలి గోల్‌ వివాదాస్పదమైంది. డీగో చేసిన హెడర్‌ గోల్‌ను వాస్తవానికి చేత్తో నెట్టాడని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రికార్డింగ్‌ సౌకర్యం లేకపోవడం వల్ల రెఫరీ దాన్ని గోల్‌గానే ప్రకటించాడు. తర్వాత నాలుగు నిమిషాలకే ‘గోల్‌ ఆఫ్‌ ది సెంచరీ’ని కొట్టిన మారడోనా, అదే ఊపులో వరల్డ్‌ కప్‌ను గెలుచుకోవడమే గాక ఫుట్‌బాల్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. వివాదాస్పద గోల్‌పై ఆ తర్వాత స్పందించిన మారడోనా అది ‘సగం మారడోనా హెడ్, సగం హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ ఫలితమని ప్రకటించాడు.దుబాయ్‌లో ఇటీవల కురిపించిన కృత్రిమ వర్షం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో ప్రపంచమంతా చూసింది. క్లౌడ్‌ సీడింగ్‌ ఓవర్‌డోస్‌కు వాతావరణ మార్పులు కూడా తోడైన ఫలితంగా రెండేళ్లలో కురవాల్సిన వర్షమంతా ఒకేరోజు కురిసి ఎమిరేట్‌ను అతలాకుతలం చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో ‘అదృశ్య హస్తం’ (హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌) పనిచేసినట్టుగా, కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్టుగా అనిపించక మానదు. లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఫలితాలు రావాలంటే రష్యా నాయకుడు పుతిన్‌ లేదా తుర్కియే పాలకుడు ఎర్డోగాన్‌ లేదా మయన్మార్‌ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఉండాలి. అలా జరగలేదు కాబట్టి ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ ప్రమేయం ఉండాలి. ఎవరా గాడ్‌? కేంద్ర ప్రభుత్వమా? ఎన్నికల సంఘమా... ఎవరు? కృత్రిమ ఓట్ల వర్షానికి క్లౌడ్‌ సీడింగ్‌ ఎవరు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ జనసామాన్యం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి.ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ మెషిన్‌లను ట్యాంపరింగ్‌ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబే పలుమార్లు ప్రకటించారు. ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకెళ్లి ఈవీఎమ్‌లను ఎలా హ్యాక్‌ చేయవచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి చూపెట్టారు. అందువల్ల ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్‌ అనే ఆర్ట్‌పై కూటమికి స్పష్టమైన అవగాహన ఉన్నది.రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు రోజుల సమయాన్ని తీసుకున్నది. ఈ అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. ఆ గడువు ముగిసిన తర్వాత పోలయిన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలను రేకెత్తించే విధంగానే ఉన్నది.తుది పోలింగ్‌ శాతాన్ని సుమారు 81గా నిర్ధారిస్తూ మూడు రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేసింది. మామూలుగా పోలింగ్‌ సమయం ముగిసిన తర్వాత పోలింగ్‌ కేంద్రం ఆవరణలో నిలబడి ఉన్నవారికి స్లిప్స్‌ పంపిణీ చేస్తారు. వారికి మాత్రమే ఓటువేసే అవకాశం కల్పిస్తారు. అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్‌ లేదా టోకెన్లు పంపిణీ చేయలేదనే వార్తలు వినవస్తున్నాయి. ఇది అనుమానించదగ్గ అంశం.పోలింగ్‌ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్నవారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా యాభై నుంచి వంద దాటలేదు. వీరు ఓట్లు వేయడానికి ఇంకో రెండు, మూడు గంటలు చాలు. అంటే తొమ్మిది గంటలకల్లా పోలింగ్‌ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటిందాకా పోలింగ్‌ జరుగుతూనే ఉందట! అంటే ఆ యాభైమందే అంతసేపూ సైక్లింగ్‌ చేస్తున్నారా? వేలాది పోలింగ్‌ బూత్‌లలో గడువు ముగిసే సమయానికి 65 నుంచి 70 శాతం మధ్యనున్న పోలింగ్‌ శాతం తుది ప్రకటన వచ్చేసరికి 85 నుంచి 95 శాతం దాకా ఎగబాకింది.పోలింగ్‌కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం చంద్రబాబు పడిన పాట్లు, భరించిన అవమానాలు తెలిసినవే. కూటమిగా కుదురుకున్న తర్వాత వారు ‘ఎలక్షనీరింగ్‌’ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులను బదిలీ చేశారు. కనీవినీ ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసీ కూడా కూటమి కోర్కెలన్నింటినీ మారుమాట్లాడకుండా నెరవేర్చింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజ్‌లోనే ఉంటూ వచ్చాయి. కానీ కూటమి కోరిక మేరకు ఈసారి నాలుగో ఫేజ్‌కు నెట్టివేశారు.మొదటి మూడు దశల పోలింగ్‌ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతా భావం మొదలైందట. పోలింగ్‌ సరళి తమకు అనుకూలంగా లేదనే నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారు. నాలుగో దశకు ఎన్నికలను వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ‘ఏర్పాట్ల’ కోసం ఉపయోగించుకున్నారు. ఈ ఏర్పాట్లకు ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ పూర్తిగా సహకరించింది. దేశవ్యాప్తంగా 19 లక్షల ఈవీఎమ్‌ల మిస్సింగ్‌పై ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదు. ఇవెక్కడున్నాయి? ఏ పనికి వినియోగిస్తున్నారు? ఎవరి సేవల కోసం ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ వీటిని వినియోగిస్తున్నారో తేలవలసి ఉన్నది.గడచిన ఐదేళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్లుగా చూపించి గగ్గోలు పెట్టినవారు పోలింగ్‌ రోజు సాయంత్రం, మరునాడు – మళ్లీ కౌంటింగ్‌ రోజు నుంచి గత నాలుగు రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు ఆవేశంతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నది. కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరూ పోలింగ్‌ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకు దాడులు జరిగాయి. మరుసటి రోజు కూడా చాలాచోట్ల ఇవి కొనసాగాయి. మళ్లీ కౌంటింగ్‌ పూర్తవుతున్న సమయం నుంచి నాలుగు రోజులుగా యథేచ్ఛగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అసాధారణమైన ఓటింగ్‌ సరళిని సమీక్షించడానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికి ఈ దాడులు జరిగాయి. పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి తోడుగా నిలబడింది.విచక్షణారహితంగా జరుగుతున్న ఈ దాడులు మన ప్రజాస్వామ్య భవిష్యత్తు మీద ప్రశ్నార్థకాన్ని రచిస్తున్నాయి. ఈ దాడులను ఖండించకపోగా ‘వైఎస్సార్‌సీపీ కవ్వింపు చర్యలకు రెచ్చిపోకండ’ని ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు ట్వీట్‌ చేశారు. గత రెండేళ్లుగా లోకేశ్‌ ఒక రెడ్‌బుక్‌ను సభల్లో ప్రదర్శిస్తూ హెచ్చరికలు జారీ చేసేవారు. తాను రెడ్‌బుక్‌లో పేర్లు ఎక్కించిన వారి సంగతి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పేవారు. ఇప్పుడా రెడ్‌బుక్‌ హోర్డింగ్‌లను కూడళ్లలో ఏర్పాటు చేశారు. దాని సందేశమేమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.సందేశం గూండాతండాలకు స్పష్టంగానే అర్థమైంది. టీడీపీ వారికి చాలాచోట్ల జనసైనికులు కూడా తోడయ్యారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న సందర్భాల్లో పోలీసులు మౌన ప్రేక్షక పాత్రను పోషించారు. కొన్నిచోట్ల పారిపోతూ కనిపించారు. ఇప్పటివరకు బయటకొచ్చిన వీడియోల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కలవరం కలిగించాయి.నూజివీడులో వైసీపీకి చెందిన ముసినిపల్‌ కౌన్సిలర్‌ను వెంబడించి కత్తులతో పొడుస్తున్న దృశ్యం పిండారీల దండయాత్రను తలపించింది. ఒక హాస్టల్‌ నిర్వాహకుడి ఇంటిపై దాడిచేసి గృహాన్ని ఛిద్రం చేసి, ఆ పెద్దమనిషిని మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్న పైశాచికత్వం భయానకంగా కనిపించింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు, కత్తులతో దాడులు, కిడ్నాప్‌లు... ఎన్నెన్ని దృశ్యాలు? వైసీపీకి చెందిన వారి కార్యాలయాలను పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. వాహనాలను తగులబెట్టారు. జెండా దిమ్మెలను సుత్తులతో పగులగొట్టారు. శంకుస్థాపన ఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయాల మీద దాడులు చేశారు. వైఎస్సార్‌ విగ్రహాలను తొలగించి ఈడ్చుకుంటూ అవమానించారు.వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంపై వైఎస్సార్‌ అక్షరాలు తొలగించారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్‌ల వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించిన వైఎస్సార్‌ పేరు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి బాగుంటుందని భావించిన ప్రభుత్వం చట్టసవరణ ద్వారా ఎన్టీఆర్‌ పేరును మార్చి వైఎస్సార్‌ పేరు పెట్టారు. బదులుగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీఆర్‌ పేరును పెట్టారు. ఒక అల్లరిమూక దాడి చేసి ఇప్పుడా అక్షరాలను తొలగించింది..విశ్వవిద్యాలయాల మీద కూడా దాడులకు తెగబడ్డారు. వీసీలు, రిజిస్ట్రార్‌లు తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభు త్వం మారితే యూనివర్సిటీ పాలకవర్గాలను కూడా మార్చాలనే ఓ కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు కనిపిస్తున్నది. నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేయడం సంప్రదాయం కానీ, ఇవి నామినేటెడ్‌ పదవులు కావు. సెర్చ్‌ కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్‌ చేసిన నియామకాలు. అయినా సరే తమ పార్టీవాడే వీసీగా కూర్చోవాలనే దుందుడుకుతనం ప్రజాస్వామిక పద్ధతులను దెబ్బతీస్తున్నది.భయానక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తే అది నెరవేరే అవకాశం ఉండదు. నాలుగు రోజులు ఆలస్యమైనా సరే ఎన్నికల అవకతవకలపై వారు దృష్టి సారించకుండా ఉండరు. నిజానిజాలు తవ్వితీయకుండా ఉండరు. అలాగే కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం జనంతో కలిసి విపక్షాలు కచ్చితంగా ఉద్యమిస్తాయి. కూటమికి లభించిన విజయం సాంకేతికమైనదే. అయినా సరే, ప్రభుత్వాన్ని అదే ఏర్పాటు చేస్తుంది. అడ్డంకులేమీ ఉండవు. చేసిన హామీలను నెరవేర్చి, ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించితే కొత్త ప్రభుత్వం ప్రజల మన్నన పొందుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

newly married couple suicide in hyderabad
కలిసి బతకలేమని కడతేరిపోయారు!

జీడిమెట్ల, జగద్గిరిగుట్ట: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. జీవితాంతం కలిసి ఉండాలని బాసచేసి పెళ్లి చేసుకున్నారు.. వీరి కాపురం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఏం జరిగిందో ఏమో భార్య హెచ్‌ఏఎల్‌లోని తల్లి గారింట్లో, భర్త చింతల్‌ హెచ్‌ఎంటీలో ఒకేరోజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం హెచ్‌ఏఎల్‌ కాలనీకి చెందిన కృష్ణమూర్తి చిన్న కుమారుడు మంచూరి రెశ్వంత్‌ (26), గాజులరామారం హెచ్‌ఏఎల్‌ కాలనీకి చెందిన సాయిశ్రేయ (22)ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అనంతరం గాజులరామారం ద్వారకా నగర్‌లో కాపురం పెట్టారు. రెశ్వంత్‌ బిగ్‌బాస్కెట్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్లు దంపతులిద్దరూ బాగానే ఉన్నారు. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. శనివారం రెశ్వంత్‌ హెచ్‌ఎంటీ నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని మృతిచెందాడు. సాయిశ్రేయ హెచ్‌ఏఎల్‌ కాలనీలోని తల్లిగారింట్లో ఉరి వేసుకుని మృతిచెందింది. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement