సొసైటీలకు దాపరికమెందుకు?

సొసైటీలకు దాపరికమెందుకు?


విశ్లేషణ


సొసైటీ అనేది జనంతో ముడిపడి ఉన్న సంఘం. రిజిస్టర్ చేసుకున్న తరు వాత తమ ప్రజాసంబంధాలను పారదర్శకతను వారు చాటుకున్నట్టే. మా చిరునామాలు, మా విషయాలు చెప్పబోమని అనడానికి వీల్లేదు.



పెద్ద పెద్ద వాగ్దానాలుచేసి ప్రజారంగ వ్యవహారాలు చేసే వారు పారదర్శకంగా ఉండాలి. దాచుకునే రహ స్యాలున్నాయని, దాచు కునే హక్కు తమకు ఉందని వాదించడానికి వీల్లేదు. కౌన్సిల్ ఆఫ్ ఇండి యన్ స్కూల్ సర్టిఫికెట్ సొసైటీ తనకు చెందిన సమాచారం ఇవ్వడం న్యాయమా, ఇవ్వకపోవడం వారి హక్కా అనే సమస్య ఇటీవలే సమాచార కమిషన్ ముందుకు వచ్చింది. సమాచార హక్కు చట్టం ప్రకారం పబ్లిక్ అథారిటీ సంస్థలు పీఆర్‌వోని నియమించి జనం అడిగిన సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. ప్రమా ణాలతో పరీక్షలు నిర్వహించి పాఠశాలలకు ధృవ పత్రాలను ఇచ్చే ఈ కౌన్సిల్‌పై.. తను నిర్ధారిం చుకున్న లక్ష్యాలకు, తానే ప్రకటించిన ఉద్దేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నట్టు తామే వివరించు కోవలసిన నైతిక బాధ్యత ఉంది. కానీ అనేక సంద ర్భాలలో తను పబ్లిక్ అథారిటీ కాదని, ఎవరికీ జవా బుదారీ కాబోమని కౌన్సిల్ వాదించింది.

 

అలహాబాద్ హైకోర్టు ఎ. పవిత్ర కేసు (2014)లో ఈ సంస్థ పబ్లిక్ అథారిటీ కాదని తీర్పు చెప్పింది. కేంద్ర సమాచార కమిషనర్ ఓపీ కేజరీ వాల్ కూడా.. ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష పరోక్ష ఆర్థిక సాయం తీసుకోని ఈ కౌన్సిల్ పబ్లిక్ అథారిటీ కాదన్నారు. అయినా పార దర్శకంగా ఉండాలని అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని కమిషన్ ఆదే శించింది. కానీ ఆ మాట వినలేదు. దాంతో దర ఖాస్తుదారు మళ్లీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దరఖాస్తుదారుడికి ప్రయాణ వసతి ఖర్చులకింద వేరుు రూపాయలు ఇవ్వాలని కమిషన్ ఆదే శించింది. ఈ ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు సమర్థ్థించింది. దానిపైన ఇద్దరు సభ్యుల ధర్మాసనం అప్పీలు స్వీకరించి కౌన్సిల్ పబ్లిక్ అథారిటీ కాదని తీర్మానించింది.

 

ఈ సంస్థను సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం 1860 కింద రిజిస్టర్ చేసారు. ఈ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం ఎవరైనా సరే రిజిస్ట్రార్ దగ్గర ఉంచిన ఈ సొసైటీ పత్రాలను చూడవచ్చు. ఆ విధంగా తీసు కున్న సమాచారాన్ని చట్టపరమైన వివాదాలలో ప్రాథమికంగానే సాక్ష్యంగా పరిగణిస్తారు. 156 ఏళ్ల కిందట ఆంగ్ల పాలకులు ప్రతి వ్యక్తికీ ఇచ్చిన సమా చార హక్కు ఇది. సొసైటీలు రిజిస్టర్ చేసేవారు, ఆ సొసైటీల ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలలు నడిపే వారు సమాచారం ఇచ్చి తీరాలని, ఆ సమాచారం సాక్ష్యం అవుతుందని ఆనాడే నిర్ణయించారు.



సొసైటీని రిజిస్టర్ ఎందుకు చేస్తారు? తమకు ఒక సంస్థ ఉందని అది ప్రజాప్రయోజనాలకోసం పనిచేస్తుందని తెలియజేయడానికి రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్‌లో ఉన్న ఆ సొసైటీ వివరాలు ఎవరైనా చూడవచ్చుననే నోటీసు రిజిస్ట్రేషన్‌లో ఉంటుంది. సెక్షన్ 2 ప్రకారం ప్రపంచానికి ఈ సొసైటీ సభ్యుల పేర్లు వారి అడ్రసులు, తదితర వివరాలు, చేయదల చుకున్న కార్యక్రమాలను, అనుసరించే నీతి నియ మావళులను, డెరైక్టర్‌లు, కమిటీలు పాలకసంఘం సభ్యులు, యాజమాన్యం వివరాలు అన్నీ ఇవ్వ వలసి ఉంటుంది. పబ్లిక్ అథారిటీ కాకపోయినా సొసైటీ అనేది జన సంస్థ. జనంతో ముడిపడి ఉన్న సంఘం. రిజిస్టర్ చేసుకున్న తరువాత తమ ప్రజా సంబంధాలను పారదర్శకతను వారు చాటుకు న్నట్టే. మా చిరునామాలు ఇవ్వబోమని, మా విష యాలు చెప్పబోమని అనడానికి వీల్లేదు.  

 

ఈ సొసైటీ ప్రత్యేకంగా భారత్ అనే పేరును వాడుకుంటున్నది. భారత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభు త్వాలలో అనేక విద్యా సంస్థలలో కూడా దీనికి ప్రాధాన్యం, ప్రాతినిధ్యం ఉంది. ఈ సంస్థ ప్రత్యేకావసరాలు ఉన్న పిల్లలకు సహాయం చేస్తున్నది. తనకు అనుబంధమైన పాఠశాలల సమాచారాన్ని దాచడం ఈ సొసైటీ లక్ష్యాలకు విరుద్ధం. ఒక ఉద్యోగి తన జీతం గురించి డీఏ అర్హత గురించి అడగవలసి రావడమే అన్యాయం. అడిగితే ఆర్టీఐ కింద చెప్పననడం మరొక అన్యాయం.

 

సెక్షన్ 2(ఎఫ్) సమాచార హక్కు చట్టంలో ప్రైవేట్ సంస్థ సమాచారాన్ని కూడా కోరవచ్చునని నిర్ధారించింది. ఏ చట్టం అయినా సమాచారాన్ని తెలుసు కోవచ్చని వీలు కల్పిస్తే ఆ సమాచారం ఆర్టీఐ చట్టం కింద సమాచారం అన్న నిర్వచనం కిందికి వస్తుందని ఈ సెక్షన్ వివరిస్తున్నది. కనుక ఈ సమాచారాన్ని ఇవ్వవలసిన బాధ్యత సొసైటీ పైన ఉంది. తెలుసుకునే హక్కు ఎవరికై నా ఉంది. సెక్షన్ 19, సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం, సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 2(ఎఫ్)తో కలిపి చదివితే సమాచారం ఇవ్వవలసిన బాధ్యత సొసైటీ పైన ఉందని, వీరికి సమాచారం ఇప్పించే బాధ్యత రిజి స్ట్రార్ పైన ఉందని, అడిగే హక్కు ఉందని అర్థం చేసుకోవలసి ఉంది.

 (బాల్‌కిషన్ వర్సెస్ పీఐఓ కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్, కేసులో సీఐసీ 1.11.2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా)


మాడభూషి శ్రీధర్

వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్

professorsridhar@gmail.com

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top