రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశం

Southwest mansoons entry into the state - Sakshi

ఎట్టకేలకు పలకరించిన రుతుపవనాలు ∙రాష్ట్రంలో 70 శాతం భూభాగంలోకి నైరుతి 

నేటి నుంచి 2 వారాలు సాధారణం కంటే అధిక వర్షాలు 

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె. రెడ్డి వెల్లడి  

రైతులు పంటల సాగు మొదలు పెట్టుకోవచ్చని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తెలంగాణలోకి శుక్రవారం ప్రవేశించాయి. అనుకున్న సమయానికంటే ఏకంగా 12 రోజులు ఆలస్యంగా వచ్చాయి. వచ్చీ రావడంతోనే ఒకేసారి రాష్ట్రంలో 70 శాతం మేర విస్తరించాయి. ఒకట్రెండు రోజుల్లో మిగిలిన ప్రాంతాల్లోకి కూడా నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నైరుతి రుతుపవనాల ప్రవేశాన్ని ధ్రువీకరించారు. రుతుపవనాలు మరింత పురోగమనంలో ఉన్నాయని, వచ్చే రెండు వారాలూ అంటే వచ్చే నెల నాలుగో తేదీ వరకు తెలంగాణలో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు.

జూన్‌లో ఇప్పటివరకు తెలంగాణలో 48 శాతం లోటు వర్షపాతం నమోదైందని, ఆ లోటును రానున్న కాలంలో భర్తీ చేసేలా వర్షాలు కురుస్తాయన్నారు. 60 శాతం ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కావడం, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లతో గాలులు భూమి నుంచి 4 కిలోమీటర్ల ఎత్తు వరకు వీయడం ఈ రెండు అంశాలను లెక్కలోకి తీసుకొని నైరుతి రుతుపవనాల ఆగమనాన్ని అంచనా వేస్తామన్నారు. ఆ ప్రకారం రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు నిర్దారించామన్నారు. ఈ వర్షాలను ఆధారం చేసుకొని రైతు లు పంటలను సాగు చేసుకోవచ్చని ఆయన భరోసా ఇచ్చారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీంతో రుతుపవనాలు మరింత పురోగమిస్తాయని తెలిపారు. జూలై 15 లోపు దేశమంతా రుతుపవనాలు విస్తరిస్తాయని వివరించారు.  

ఈసారి 732 మిల్లీమీటర్ల వర్షం... 
సాధారణంతో పోలిస్తే ఈసారి 97 శాతం వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంటే ఆ లెక్కను కూడా సాధారణ వర్షాలుగానే పరిగణిస్తామని వై.కె.రెడ్డి తెలిపారు. తెలంగాణలో సాధారణ నైరుతి సీజన్‌ వర్షపాతం 755 మిల్లీమీటర్లు (ఎంఎం) కాగా, 97 శాతం లెక్కన ఈసారి 732 ఎంఎంలు కురిసే అవకాశముందన్నారు. గతేడాది ఇదే సీజన్‌లో సాధారణ వర్షపాతాలే కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించినా 2 శాతం లోటు నమోదైంది. 2016లోనైతే సాధారణం కంటే ఏకంగా 19 శాతం రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదైంది. నైరు తి రుతుపవనాలు ఒకసారి ప్రవేశించాక రెండ్రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయి. కొన్నిసార్లు విస్తరించడానికి నాలుగైదు రోజులు పడుతుంది. గతేడాది ఒకేసారి రాష్ట్రమంతటా విస్తరించాయి. ఈసారి రెండు రోజుల్లోనే విస్తరిస్తాయని వై.కె.రెడ్డి తెలిపారు. కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించడం గత ఆరేళ్ల లెక్కలతో పోలిస్తే ఈసారి చాలా ఆలస్యంగా వచ్చాయి. గతేడాది మే 29న రాగా, 2016లో జూన్‌ 7న ప్రవేశించాయి. ఈసారి జూన్‌ 8న వచ్చాయి.  

ఆలస్యం అనర్థంకాదు... 
రుతుపవనాలు ఆలస్యమైనంత మాత్రాన ఆ ఏడాది సీజన్‌ బాగుండదని అనుకోవాల్సిన అవసరం లేదని వై.కె.రెడ్డి తెలిపారు. గతంలో అనేకసార్లు ఆలస్యమైనా సాధారణ వర్షపాతం నమోదైన పరిస్థితి ఉందన్నారు. ఈ ఏడాది తెలంగాణలోకి జూన్‌ 8న రుతుపవనాలు వస్తాయని అంచనా వేశామని, కానీ 21న (శుక్రవారం) ప్రవేశించాయన్నారు. 2016లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి జూన్‌ 8న ప్రవేశించగా, తెలంగాణలోకి 19న వచ్చాయి. కానీ ఆ ఏడాది సీజన్‌లో సాధారణం కంటే ఏకంగా 19 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అలాగే 2012లో నైరుతి రుతుపవనాలు జూన్‌ 5న కేరళలోకి, అదే నెల 16న తెలంగాణలోకి ప్రవేశించాయి. కానీ 4 శాతం అధిక వర్షపాతం అప్పుడు రికార్డు అయింది. 2014లో మాత్రం కేరళలోకి నైరుతి రుతుపవనాలు జూన్‌ 6న ప్రవేశించగా, తెలంగాణలోకి జూన్‌ 20న వచ్చాయి. అప్పుడు మాత్రం ఏకంగా 34 శాతం లోటు వర్షపాతం నమోదైంది. గతేడాది మే 29న కేరళలోకి, 8న తెలంగాణలోకి అత్యంత ముందుగానే రుతుపవనాలు ప్రవేశించాయి. కానీ 2 శాతం లోటు వర్షపాతం నమోదైందని వై.కె.రెడ్డి తెలిపారు. గత ఇరవై ఏళ్లలో ఈసారి మాత్రమే అత్యంత ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించాయి.  

బలహీన రుతుపవనాలంటే? 
సాధారణంగా కురవాల్సిన దానిలో సగంలోపే వర్షపాతం నమోదైతే బలహీన రుతుపవనాలుగా పరి గణిస్తారు. సాధారణంలో సగానికి మించి నిర్ణీత వర్షపాతం నమోదైతే సాధారణ వర్షపాతంగా గుర్తిస్తారు. కనీసం 2 వాతావరణ కేంద్రాల్లో 3 సెంటీమీట్లర్లకంటే ఎక్కువగా నమోదై.. సాధారణ వర్షపాతం కంటే ఒకటిన్నర నుంచి నాలుగు రెట్లు నమోదైతే.. అవి బలమైన రుతుపవనాలు. కనీసం 2 వాతావరణ కేంద్రాల్లో 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా, సాధారణ వర్షపాతంలో నాలుగు రెట్లకు పైగా నమోదైతే.. అప్పుడు అద్భుత రుతుపవనాలుగా పరిగణిస్తారు.

1918లో రికార్డు... 
1918వ సంవత్సరంలో నైరుతి రుతుపవనాలు అత్యంత ముందస్తుగా కేరళలోకి ప్రవేశించడం గమనార్హం. ఆ ఏడాది ఏకంగా మే 7నే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. ఆ తర్వాత 1943లో మే 12న, 1932లో మే 15న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న జాతీయ రికార్డు. సాధారణంగా కేరళలోకి మే 29న ప్రవేశిస్తూ ఉంటాయి. ఇక అత్యంత ఆలస్యంగా కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన సందర్భాలూ ఉన్నాయి. 1972లో ఏకంగా జూన్‌ 20న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి.  2003లో జూన్‌ 13న కేరళలోకి ప్రవేశించా యి. ఇవే ఇప్పటివరకున్న రికార్డులు. 

విస్తారంగా వర్షాలు... 
రుతుపవనాల రాకకు ముందు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిశాయి. గురువారం నుంచే తెలంగాణలోని అనేకచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. జనగాం జిల్లా జఫర్‌గఢ్‌లో 10 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. భూపాలపల్లి, పాలకుర్తిలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. కరీంనగర్, ఘన్‌పూర్, పర్కాల్, రామగుండం, లింగంపేట, మొగుళ్లపల్లిలో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. డోర్నకల్, సుల్తానాబాద్, మంచిర్యాల, తాడ్వాయిలో 6 సెంటీమీటర్ల చొప్పున.. గోవిందరావుపేట, లక్సెట్టిపేట, బెజ్జంకి, బిక్నూరు, పెద్దపల్లి, కొత్తగూడ, సిర్పూరులో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మిగిలిన చాలా ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వర్షం కురిసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top