వీధి శునకాల ఆత్మ బంధువు

Dollar Homes For Street Dogs - Sakshi

మృత్యువుతో పోరాడుతూనే సేవ

‘డాలర్‌ హోమ్స్‌’ పేరుతో ఆశ్రమం నిర్వహణ

ఇవటూరి విజయలక్ష్మి జంతు ప్రేమ

జూబ్లీహిల్స్‌లో చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్, యూసఫ్‌గూడ పోలీస్‌ లైన్స్‌ పెట్రోల్‌ బంక్‌.. ఇలాంటి చోట్లవేసవిలో కాస్త పరీక్షగా చూస్తే నీళ్లు నింపిన సిమెంట్‌ తొట్టెలు కనిపిస్తాయి. కాసేపు అక్కడే ఉండిగమనిస్తే వీధి శునకాలు అక్కడికి రావడం.. ఆ తొట్టెల్లోని నీరు తాగడం కూడా చూడొచ్చు. నగరంలో ఇలాంటివి ఇంకా చాలా చోట్లేకనిపిస్తాయి. వీటి ఏర్పాటు వెనుక వీధి శునకాల దుస్థితికిచలించిపోయిన ‘విజయలక్ష్మి’ మానవతా హృదయం ఉంది. పెంపుడు జంతువులు మాత్రమే కాదు..రోడ్డు మీద తిరిగే ప్రతి జంతువు బాగూ కోరే కొండంత తపన ఉంది. 

సాక్షి, సిటీబ్యూరో :బేగంపేటలోని ఓ వీధిలో అపార్ట్‌మెంట్స్‌ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో వీధికుక్క ఆరు పిల్లల్ని పెట్టింది. చుట్టుపక్కల నివాసితులంతా వాటిని అక్కడి నుంచి ఎలా తరిమేయాలా అనే ఆలోచన చేశారు. కొందరు తరిమేసేందుకు విసిరిన రాళ్ల దెబ్బలకూ బెదిరి అటూ ఇటూ పరుగులు తీసిన పిల్లల్లో రెండు రోడ్డుపై వెళ్లే వాహనాల కింద పడి నలిగిపోయాయి. మిగిలిన తల్లీ పిల్లల్ని స్థానికుల ఫిర్యాదు మేరకు మున్సిపల్‌ వ్యాన్‌లో తరలించబోతే అడ్డుకుని వాటిని పెంచుకుంటానని ఇంటికి తెచ్చుకుంది ఆ మానవతా హృదయం. ఆ మనసు పేరు ‘‘ఇవటూరి విజయలక్ష్మి’’. వెంగళరావునగర్‌ డివిజన్‌ సిద్ధార్థనగర్‌లో నివసిస్తున్న ఈమె వీధి శునకాల కోసం ‘డాలర్‌ హోమ్స్‌’ పేరుతో ప్రత్యేక స్వచ్ఛంద ఆశ్రమాన్నే నడుపుతున్నారు. అంతేకాదు శంషాబాద్‌లో దాదాపు 250 దాకా నిరాశ్రయ శునకాలను సాకుతున్నారు. ఆమె పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..

వీధికుక్కలకూ విలువుంది..
శునకాలంటే చిన్నప్పటి నుంచి అభిమానం. మాకు ఇంట్లో ‘డాలర్‌’ పేరుతో ఓ పమేరియన్‌ ఉండేది. దాన్ని బాగా చూసుకునేవాళ్లం. అదే సమయంలో వీధిలో తిరిగే కుక్కల్ని చూసినప్పుడు బాధనిపించేది. గాలికి తిరుగుతూ రాళ్ల దెబ్బలు తింటూ ఏ వాహనం కిందో పడి రాలిపోయే వీధి కుక్కల సమస్యలు చూసి చలించిపోయేదాన్ని. బేగంపేటలో మా అపార్ట్‌వెంట్‌ పక్కనే ఖాళీ స్థలంలో ఓ శునకానికి పుట్టిన ఆరు పిల్లల్లో రెండు అలాగే ప్రాణాలు కోల్పోయాయి. మిగిలిన తల్లీ, పిల్లల్నీ తీసుకొచ్చి పెంచతున్నాను. తల్లికి బర్త్‌ కంట్రోల్‌ ఆపరేషన్‌ చేయించాను. ఫ్రెండ్‌కి ఒకటి దత్తతకి ఇచ్చాను. బేగంపేట నుంచి ఇల్లు మారే సమయంలో కుక్క పిల్లలకి రూ.500, పెద్ద వాటికి రూ.1000 చొప్పున చెల్లించి కిస్మత్‌పూర్‌లోని కెనల్‌లో ఉంచాను. నెలకి ఇంత చొప్పున చెల్లించే పద్ధతిలో మొత్తం 11 వీధి కుక్కల్ని అక్కడ ఉంచాను.  కెనల్‌ నిర్వాహకురాలికి ఆరోగ్యం బాగాలేదని నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకునేటప్పటికి అక్కడ నేను చేర్చిన శునకాతో కలిపి 42 ఉన్నాయి. అవన్నీ ఏమవుతాయో అనే భయంతో అలవాటు లేని పనే అయినా కెనల్‌ నిర్వహణ తలకెత్తుకున్నా. 

డాలర్‌ని కోల్పోయి.. కేన్సర్‌కు గురై..
నా పిల్లలు ముగ్గురికి పెళ్లయి అమెరికాలో సెటిలైపోయారు. సొంత బిడ్డలా 15 ఏళ్లు పెంచుకున్న నా డాలర్‌ పమేరియన్‌ ఐదేళ్ల క్రితం చనిపోవడంతో తట్టుకోలేకపోయాను. అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆస్పత్రి పాలయ్యా. అదే సమయంలో నాకు కేన్సర్‌ అని నిర్థారణ అయింది. దాంతో భర్త, పిల్లలు నేను చేసే ప్రైవేట్‌ జాబ్‌ మాన్పించేశారు. మరోవైపు చాలా మంది నన్ను ఈ కుక్కల బాధ్యతలు వదిలేయమని సలహా ఇచ్చారు. కానీ అప్పుడే నాకు ఇంకా పట్టుదల వచ్చింది. కేన్సర్‌తో పోరాడుతూనే.. నచ్చిన సేవను విస్తరించాను.  అంకురించిన ‘డాలర్‌ హోమ్స్‌’ డాలర్‌ హోమ్స్‌ పేరుతో ఓ ట్రస్ట్‌ రిజిస్టర్‌ చేశాను.

శంషాబాద్‌లోని తుండుపల్లి గ్రామం వద్ద స్థలం
తీసుకుని వీధి శునకాల కోసం హోమ్‌ ప్రారంభించాను. ఇది ఒక రకంగా మనుషులకు ఉన్నట్టే శునకాల అనాధాశ్రమం. ఇందులో ఆరుగురు పనివాళ్లు ఉన్నారు. పెరాలసిస్‌ వచ్చినవి, కళ్లులేని, అంగవైకల్యం కలవి.. ఇలా అన్ని రకాల  శునకాలూ ఇక్కడ ఆశ్రయం పొందుతున్నాయి. వలంటీర్స్‌ కొందరు రెస్క్యూ చేసిన డాగ్స్‌ తెచ్చి ఇస్తుంటారు. ఏటేటా వ్యాక్సిన్లు వేయించడం, స్టెరిలైజేషన్‌ అవన్నీ చేస్తుంటాం. ఏదైనా శునకం చనిపోతే అంత్యక్రియలు చేస్తాం. వండిన ఫుడ్‌ నైవేద్యం కింద పెట్టి మిగతాది కుక్కలకి పెడతాం. ఈ హోమ్‌కి చాలా మంది సిటిజనులు మద్ధతు ఇస్తున్నారు.  ఏపీ టూరిజంలో పనిచేసే గోవిందరాజులు గత నాలుగేళ్లుగా తండ్రి సంవత్సరీకం రోజున కిలోల కొద్దీ చికెన్, పెడిగ్రీ, పెరుగు.. తెచ్చి ఇక్కడి డాగ్స్‌కి పెడుతుంటారు. గచ్చిబౌలిలో వెటర్నరీ డాక్టర్‌ మధు పదుల సంఖ్యలో కుక్కలకు ఉచిత సర్జరీలు కూడా చేశారు. అనాథ శునకాలకు కనీసం తాగే నీరు కూ డా కరవే. ఎండాకాలంలో వాటి బాధలు వర్ణనాతీతం. ఆకలి కొంతైనా తీర్చాలని సమ్మర్‌లో బక్కెట్‌ వాటర్‌ పట్టే సిమెంట్‌ బౌల్స్‌ వందల సంఖ్యలో తయారు చేయిస్తున్నాం. దాదాపు నగరంలో అన్నిచోట్లా పెట్టిస్తున్నాం. 

పూర్తి స్థాయి షెల్టర్‌ లక్ష్యంగా..
కేన్సర్‌ వ్యాధికి మందులు తీసుకుంటున్నా. అందుకే 10 రోజులకో, రెండు వారాలకోసారి మాత్రమే మా డాలర్‌ హోమ్స్‌కు వెళ్లగలుగుతున్నా. నగరంలో ఏ యానిమల్‌ అయినా సరే ఏ కారణంగానైనా బాధపడకూడదనే ఉద్దేశంతో ‘డాలర్‌ హోమ్స్‌’ పెట్టాను. మీకు వద్దనుకున్న డాగ్స్‌ని రోడ్డు మీద వదిలేయకుండా నా దగ్గర వదిలేయాలని కోరుతున్నా. డాగ్స్‌తో పాటు అన్ని రకాల జంతువులకీ షెల్టర్‌ ఇవ్వాలని, దీనికోసం మరింత భారీ స్థాయిలో సొంతంగా హోమ్‌ కట్టాలని ఆలోచన ఉంది. అలాగే వీధి శునకాలకు బర్త్‌ కంట్రోల్‌ సర్జరీలు చేసే పనిలో పెద్ద ఎత్తున పాలుపంచుకోవాలని ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top