బ్యాంకులపై సైబర్‌ నెట్‌!

Cyber attacks on banks - Sakshi

రోజుకు సగటున మూడు సైబర్‌ దాడులు 

బ్యాంకింగ్, హెల్త్‌కేర్‌ రంగాల్లో పని చేస్తున్న వారికి 26 శాతం ఫిషింగ్‌ మెయిల్స్‌ 

ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ ఆడిట్‌ అండ్‌ కంట్రోల్‌ అసోసియేషన్‌ తాజా అధ్యయనంలో వెల్లడి 

ఉద్యోగులు, మేనేజ్‌మెంట్‌ హోదాలో ఉన్న వారికి నిత్యం

వచ్చే మెయిల్స్‌లో ఫిషింగ్‌ మెయిల్స్‌ 26 శాతం

ఐఎస్‌ఏసీఏ నుంచి సైబర్‌ నిరోధానికి పని చేస్తున్న నిపుణులు 800 మంది

నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలో గతేడాదిగా నమోదైన సైబర్‌ నేరాలు 1,000

క్లస్టర్లతో ప్రయోజనాలు సైబర్‌ దాడుల నిరోధానికి నగరంలో సైబర్‌ సెక్యూరిటీ క్లస్టర్లు పనిచేస్తున్నాయి. వీటితో ప్రయోజనాలను ఐఎస్‌ఏసీఏ వెల్లడించింది. ఈ నేరగాళ్ల సమాచారం, వారు వినియోగిస్తున్న సాంకేతికతపై సమస్త సమాచారాన్ని తెలుసుకునే హబ్‌ను ఏర్పాటు చేయడం. సైబర్‌ సెక్యూరిటీ క్లస్టర్‌లో చేరిన సంస్థలు లేదా దేశాలకు ఈ నేరాల నిరోధానికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తారు. ఆయా సంస్థల మధ్య సమన్వయం సాధించడంతోపాటు సైబర్‌ నేరాలు జరిగిన తీరును సాంకేతిక నిపుణులు ఆమూలాగ్రం విశ్లేషించి భవిష్యత్‌లో ఇలాంటివి చోటుచేసుకోకుండా చర్యలను వివరిస్తారు. విశ్వవ్యాప్తంగా సైబర్‌ నేరాల నిరోధానికి అవలంబించాల్సిన సాంకేతిక వ్యూహాలను సిద్ధం చేస్తారు. దీనిపై ఆయా సంస్థలకు అవగాహన కల్పిస్తారు. 

సాక్షి, హైదరాబాద్‌: కంప్యూటర్‌ ఆన్‌ చేయగానే టక్కున ఓ మెయిల్‌ వస్తుంది. అది ఏమిటా అని తెరిచి చూసేలోపే మన కంప్యూటర్‌లో ఉన్న డాటా అంతా అవతలి వాళ్లకు చేరిపోతుంది. ఇలాంటి సైబర్‌ నేరాలు ఏటా పెరుగుతున్నాయి. గ్రేటర్‌ పరిధిలో ప్రధానంగా బ్యాంకులు, హెల్త్‌కేర్‌ రంగాలే లక్ష్యంగా సైబర్‌ దాడులు జరుగుతున్నాయి. ప్రతిరోజూ సరాసరిన 3 సైబర్‌ఎటాక్స్‌ జరుగుతున్నట్లు తమ వద్ద నమోదవుతున్నాయని నగర కేంద్రంగా పనిచేస్తున్న ‘ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ ఆడిట్‌ అండ్‌ కంట్రోల్‌ అసోసియేషన్‌(ఐఎస్‌ఏసీఏ)’ తాజా అధ్యయనంలో తేలింది. ర్యాన్‌సమ్‌ వేర్‌.. వానా క్రై వంటి సైబర్‌ దాడులతోపాటు ఫిషింగ్‌ మెయిల్స్‌తో ఆయా బ్యాంకింగ్, నాన్‌ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, హెల్త్‌కేర్‌ రంగంలో పని చేస్తున్న వివిధ సంస్థలు ఈ దాడులకు గురవుతున్నట్లు ఈ సంస్థ తాజా అధ్యయనంలో తేలింది.

ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, మేనేజ్‌మెంట్‌ హోదాలో ఉన్న వారికి అనునిత్యం వివిధ సంస్థలు, వ్యాపార, వాణిజ్య లావాదేవీల నిమిత్తం వచ్చే మెయిల్స్‌లో సుమారు 26 శాతం ఫిషింగ్‌ మెయిల్స్‌ (చౌర్యానికి పాల్పడేవి) ఉన్నాయని.. ఉద్యోగులు ఏమరుపాటుగా వీటిని తెరచిచూస్తే ఆయా సంస్థల డేటాబేస్‌ చౌర్యంతోపాటు సిస్టం, సాఫ్ట్‌వేర్‌ తీవ్రంగా ప్రభావితమౌతున్నాయని తేల్చింది. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ఆయా సంస్థలు తమ ఉద్యోగులకు విధిగా సైబర్‌ సెక్యూరిటీ అంశంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించింది. ఇప్పటికే తమ సంస్థకు చెందిన నిపుణులు సైబర్‌ దాడుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా సంస్థలకు అవగాహన కల్పించడంతోపాటు పరిశోధన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించింది.  

‘సెక్యూరిటీ ఆపరేషన్స్‌’... 
వివిధ ప్రభుత్వ విభాగాల డేటా భద్రంగా దాచేందుకు సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌ను ఐటీ శాఖ నిర్వహిస్తోంది. సైబర్‌ దాడుల నిరోధానికి సెక్యూరిటీ పాలసీని కూడా తీసుకొచ్చినట్లు ఆ వర్గాలు తెలిపాయి. హేగ్‌ సెక్యూరిటీ డెల్టా, సీడాక్‌ సంస్థల సౌజన్యంతో సైబర్‌ దాడుల నిరోధానికి ప్రయత్నిస్తోంది. 

పెరుగుతోన్న నేరాలు... 
గత ఏడాది నగరంలో నమోదైన కేసుల్లో సాంకేతిక, సాంకేతికేతర అంశాలున్నాయి. పలు బ్యాంకులు, ఆర్థిక, వాణిజ్య సంస్థలకు చెందిన కంప్యూటర్లు, కంప్యూటర్ల నెట్‌వర్క్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, డేటా, సైబర్‌స్పేస్‌కు ముప్పు వాటిల్లడం, డేటా తస్కరణ, క్రెడిట్, డెబిట్‌ కార్డు మోసాల వంటి నేరాలు చోటుచేసుకున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లు, ప్రోగ్రామ్‌లు రూపొందించే అంశాలతో సైబర్‌ సెక్యూరిటీ కోర్సును రూపొందించారు. సైబర్‌ సెక్యూరిటీపై ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ అవగాహన తప్పనిసరి అని ఐఎస్‌ఏసీఏ తన అధ్యయనంలో వెల్లడించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top