సమ్మె.. సొమ్ము

Cab Services And Autos Double Charges in Hyderabad - Sakshi

క్యాబ్‌లలో దోపిడీపర్వం  

ఆర్టీసీ సమ్మె అదునుగా చార్జీల బాదుడు  

రవాణాశాఖ ఆదేశాలు బేఖాతరు

క్యాబ్‌ సంస్థలు ఆర్టీసీ కార్మికుల సమ్మెను సొమ్ము చేసుకుంటున్నాయి. పీక్‌ అవర్స్‌ పేరుతో అధిక చార్జీలు వసూలుచేస్తున్నాయి. మరోవైపు నిబంధనలకువిరుద్ధంగా సర్‌చార్జీలు కూడా విధిస్తున్నాయి. దీంతో క్యాబ్‌ చార్జీలు దాదాపు రెండింతలయ్యాయి. తాత్కాలిక డ్రైవర్లతో అరకొరగా నడుస్తున్న సిటీ బస్సులు సాయంత్రం 7గంటల లోపే డిపోలకుచేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో క్యాబ్‌ సంస్థలు ప్రయాణికులను దోపిడీ చేస్తున్నాయి.

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో క్యాబ్‌ దోపిడీ తారాస్థాయికి చేరుకుంది. ఉబెర్, ఓలా, తదితర క్యాబ్‌ సంస్థలు  ఆర్టీసీ సమ్మెను పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నాయి. సమ్మెను దృష్టిలో ఉంచుకొని సర్‌చార్జీలు విధించకూడదని, పీక్‌ అవర్స్‌ (రద్దీ వేళలు) నెపంతో  చార్జీలు పెంచడానికి వీల్లేదని  రవాణాశాఖ స్పష్టం చేసినా క్యాబ్‌ల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.  ఆర్టీసీ కార్మికుల సమ్మె  కారణంగా  ప్రయాణికుల డిమాండ్‌కు తగిన విధంగా బస్సులు అందుబాటులో ఉండకపోగా, సాయంత్రం  6 నుంచి  7 గంటలలోపే బస్సులు డిపోలకు చేరుకుంటున్నాయి. అంతేగాక ఆర్టీసీ సైతం నైట్‌ సర్వీసులను పూర్తిగా నిలిపివేయడంతో క్యాబ్‌లు, ఆటోలు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నాయి. క్యాబ్‌లలో అన్ని వేళల్లోనూ పీక్‌ అవర్స్‌ పేరుతో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. అంతేగాక ప్రయాణికులు కోరుకున్న  ప్రాంతం నుంచి క్యాబ్‌లు అందుబాటులో లేవనే సాకుతో సర్‌చార్జీలు విధిస్తున్నారు. దీంతో క్యాబ్‌ చార్జీలు రెండింతలయ్యాయి. దీంతో నగరంలో ప్రయాణం  భారంగా మారింది. సాధారణ రోజుల్లోనే ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేసే ఆటోవాలాలు సమ్మె పేరుతో మరింత అడ్డగోలుగా దోచుకుంటున్నారు. సాయంత్రం బస్సులు లేకపోవడంతో ఈ దోపిడీ ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. 

కొరవడిన నియంత్రణ...
క్యాబ్‌లు, ఆటోలపై రవాణాశాఖ ఇప్పటి వరకు ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టలేదు. గ్రేటర్‌ పరిధిలో 1.4 లక్షల ఆటోలు  తిరుగుతుండగా 85 శాతం ఆటోల్లో మీటర్లను వినియోగించడం లేదు. ఆటోవాలాలు డిమాండ్‌ చేసినంత ఇవ్వాల్సిందే. ఇక క్యాబ్‌లలో బుకింగ్‌ సమయంలోనే  చార్జీల  భారం తెలిసిపోతుంది. పీక్‌అవర్స్‌ను సాకుగా చూపుతూ అమాంతంగా పెంచేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో  ప్రయాణికులు క్యాబ్‌లను ఆశ్రయించవలసి వస్తుంది. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు సాధారణ రోజుల్లో క్యాబ్‌ చార్జీలు రూ.225 వరకు ఉండగా, గత పది రోజులుగా ఈ రూట్‌లో చార్జీ రూ.300 నుంచి రూ.350 వరకు పెరిగింది. తార్నాక నుంచి లాలాపేట్‌ వరకు సాధారణంగా రూ.350 వరకు చార్జీ అవుతుంది, ఇప్పుడు ఏకంగా రూ.650 కి పైగా  నమోదవుతున్నట్లు  ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘‘మణికొండ నుంచి లింగంపల్లి వరకు ఉబెర్‌ క్యాబ్‌లో మొదట రూ.120 చార్జీ నమోదైంది. ఫరవాలేదనుకొని బయలుదేరాను. తీరా  దిగే సమయంలో అది రూ.220 అయింది.’’ అని  సాయి అనే ప్రయాణికుడు  తెలిపారు. పీక్‌ అవర్‌ నెపంతో అడ్డగోలుగా విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  ప్రస్తుతం నగరంలో ఓలా, ఉబెర్‌ క్యాబ్‌లే ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని కొత్త  క్యాబ్‌ సంస్థలు   వచ్చినప్పటికీ  ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా లేకపోవడంతో  ఓలా, ఉబెర్‌లపైనే ఆధారపడాల్సి వస్తుంది. 

ఐటీ ఉద్యోగులకు కష్టాలు...
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి  హైటెక్‌సిటీ, మాదాపూర్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, కొండాపూర్, తదితర ఐటీ కారిడార్‌లకు రాకపోకలు సాగించే  లక్షలాది మంది ఉద్యోగులు బస్సుల కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ రోజుల్లో  ఆయా మార్గాల్లో సుమారు 1500 ట్రిప్పులు తిరుగుతాయి. ముఖ్యంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం  8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం  5 గంటల నుంచి రాత్రి  9 గంటల వరకు  సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం సమ్మె కారణంగా  రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోగా, రాత్రి పూట పూర్తిగా సర్వీసులు నిలిచిపోవడంతో క్యాబ్‌లకు డిమాండ్‌ పెరిగింది. విధులు ముగించుకొని ఆలస్యం గా ఇళ్లకు బయలుదేరేవారు పెద్ద మొత్తంలోనే సమర్పించుకోవలసి వస్తుంది.  

10వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె...
ఆర్టీసీ కార్మికుల సమ్మె సోమవారం 10వ రోజుకు చేరుకుంది. నగరంలోని మహాత్మాగా>ంధీ బస్‌స్టేషన్, జూబ్లీబస్‌స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్, రాణీగంజ్, కంటోన్మెంట్, పికెట్, హెచ్‌సీయూ, తదితర అన్ని డిపోల వద్ద  కార్మికులు కుటుంబాలతో సహా బైఠాయించి  నిరసన తెలిపారు. రాణిగంజ్‌ డిపోకు చెందిన కండక్టర్‌ సురేందర్‌గౌడ్‌ ఆత్మహత్య ఉదంతం ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగానే మరోవైపు హెచ్‌సీయూ డిపో వద్ద మరో కార్మికుడు  బ్లేడ్‌తో గాయపర్చుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అలాగే  ప్రైవేట్‌  డ్రైవర్ల చేతిలో బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆదివారం  హయత్‌నగర్‌ వద్ద ఓ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను, బైక్‌ను ఢీకొట్టిన సంగతి తెలిసిందే. సోమవారం కూకట్‌పల్లి వద్ద ఒక బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న మరో బస్సును ఢీకొట్టడంతో ముందు బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు సమ్మెపై అనిశ్చితి కొనసాగుతున్న దృష్ట్యా  గ్రేటర్‌ ఆర్టీసీ తాత్కాలిక సిబ్బంది నియామకాలను వేగవంతం చేసింది. ప్రస్తుతం  1200 మంది డ్రైవర్లు, 1200 కండక్టర్లు తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్నారు. అశోక్‌లీలాండ్, టాటా ఐశ్చర్, తదితర కంపెనీలకు చెందిన సుమారు 20  మెకానిక్‌ బృందాలను  డిపోల్లో ఏర్పాటు చేశారు. ఈ బృందంలో మెకానిక్, ఎలక్ట్రీషియన్, తదితర సిబ్బంది ఉంటారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నగరంలో 1133 అద్దె బస్సుల భర్తీకి రంగం సిద్ధమైంది. అలాగే మరో 752 ప్రైవేట్‌ బస్సులను నడపాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నగర శివార్లలోని గ్రామాలకు తిరుగుతున్న ఆర్టీసీ మఫిషియల్‌ సర్వీసుల స్థానంలో ఈ ప్రైవేట్‌ బస్సులు నడుస్తాయి.  

క్యాబ్‌లకు మీటర్లు బిగించాలి
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్ధతునిస్తున్నాం. క్యాబ్‌లలో దోపిడీని అరికట్టేందుకు మీటర్ల విధానాన్ని అమలు చేయాలి. స్లాక్‌ అవర్స్, పీక్‌ అవర్స్‌తో నిమిత్తం లేకుండా  కిలోమీటర్‌కు రూ.22 చొప్పున చార్జీ విధించాలి. అప్పుడే ప్రయాణికులు, డ్రైవర్లకు న్యాయం జరుగుతుంది.  –షేక్‌ సలా ఉద్దీన్,(  చైర్మన్, తెలంగాణ స్టేట్‌ ట్యాక్సీ అండ్‌ డ్రైవర్స్‌  జేఏసీ )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top