నేటి నుంచి బతుకమ్మ పండుగ | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బతుకమ్మ పండుగ

Published Wed, Sep 24 2014 1:54 AM

నేటి నుంచి బతుకమ్మ పండుగ

 ప్రత్యేక రాష్ట్రంలో అధికారికంగా నిర్వహణ
 
 సాక్షి ప్రతినిధి, వరంగల్:

 బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...
 బంగారు బతుకమ్మ ఉయ్యాలో...
 ఇద్దరక్కజెల్లెల్లు ఉయ్యాలో...
 ఒక్కూరిచ్చిండ్లు ఉయ్యాలో
 ఒక్కడే మాయన్న ఉయ్యాలో...
 వచ్చన్న బోడాయె ఉయ్యాలో...
 ఎట్లస్తు చెల్లెల  ఉయ్యాలో...
 ఏరడ్డమాయె ఉయ్యాలో...
 ... తెలంగాణ పల్లె జీవన విధానాన్ని తెలిపే ఇలాంటి ఎన్నో పాటల యాది బతుకమ్మ పండుగ. అచ్చమైన పూల ఉత్సవం. తెలంగాణ సంస్కృతిని, పల్లె జీవన శైలిని పాటలతో చాటి చెప్పే ప్రకృతి పండుగ.. బుధవారం ఎంగిపూల బతుకమ్మతో మొదలై అక్టోబర్ 2న సద్దుల బతుకమ్మతో ముగియనుంది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న బతుకమ్మ పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. అధికారికంగా బతుకమ్మ నిర్వహణ కోసం అన్ని జిల్లాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. బతుకమ్మతో తెలంగాణలోని ప్రతీ పల్లె, పట్టణానికి ఇప్పుడు కొత్త కళ వస్తోంది.
 
 సాంస్కృతిక అస్తిత్వం నిలుపుకునే క్రమంలో తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మకు ప్రాధాన్యం ఏటికేడు పెరుగుతోంది. స్వరాష్ట్రం కోసం మొదలైన మలి దశ ఉద్యమంతో దీనికి మరింత ప్రాచుర్యం వచ్చింది. అప్పటి వరకు గ్రామాల్లో బతుకమ్మను ఆడే వాళ్ల సంఖ్య తక్కువగానే ఉండేది. ఊళ్లలో పెద్ద కుటుంబాల వారు సద్దుల బతుకమ్మకే పరిమితమయ్యే వారు. ఇప్పుడు కనీసం మూడు నాలుగు రోజులు బతుకమ్మ ఆడుతున్నారు. ఇది పూర్తిగా ప్రకృతిని, ఆత్మీయతలను మననం చేసుకునే ఉత్సవం. బతుకమ్మ పాటలూ ఇవే ప్రధాన ఉద్దేశాలుగా ఉంటాయి.
 
 కొత్త పాత సందు: బతుకమ్మ పండుగ వచ్చే రోజులకు ప్రత్యేకత ఉంటుంది. వానాకాలం పంటలకు సంబంధించి... వరి నాట్లకు, కోతలకు ఇది మధ్యకాలం. వర్షాకాలం
 ముగింపు, చలి కాలం మొదలయ్యే తరుణం. అందుకే దీన్ని కొత్త పాత సందు అంటారు. ఆశ్వయుజ మాసం అమావాస్య(పెత్రామాస) రోజున ఎంగిలి పూలతో తొలి రోజు బతుకమ్మ పండగ మొదలై సద్దుల పండగతో తొమ్మిదో రోజు ముగుస్తుంది. అంతటా పార్వతిని శక్తిగా కొలిస్తే... తెలంగాణలో బతుకమ్మ రూపంలో పూజిస్తారు. పార్వతి... పర్వత రాజు పుత్రిక. అందుకే బతుకమ్మను కొండలాగా పేర్చుతారు. తంగేడు పువ్వు లేకుండా బతుకమ్మ పేర్చడం ఉండదు. తెలంగాణలో బతుకమ్మను ఇంటి ఆడబిడ్డగా చూసుకుంటారు. ఆడబిడ్డను శుక్రవారం, బుధవారం పుట్టింటి నుంచి పంపరు. అందుకే సద్దుల బతుకమ్మను శుక్రవారం, బుధవారం జరపరు. తిథి ప్రకారం ఈ రోజుల్లో సద్దుల బతుకమ్మ వచ్చినా మరుసటి రోజు నిర్వహిస్తారు. బతుకమ్మ పేర్చే తీరు ప్రత్యేకంగా ఉంటుంది.
 
 బతుకమ్మను ఏడు రోజులూ వెదురు లేదా దుశ్సెరు తీగతో అల్లిన సిబ్బిలో పేరుస్తారు. సిబ్బిపై ముందుగా గుమ్మడి ఆకులను పరుస్తారు. మొదట ఆకులతో ఉన్న తంగేడు పూలను, గునుగు పూలను పేరుస్తారు. చివరగా బీర, గుమ్మడి, కట్ల, రుద్రాక్ష, సీతజడ, బంతి, మందార, మొల్ల, గోరంట, చామంతి, కలువ, గన్నేరు, జాజి, సంపెంగ... ఇతర రంగురంగుల పూలను కోణాకారంలో అమర్చుతారు. మధ్యలో గౌరమ్మ(గుమ్మడిపువ్వు మధ్య భాగం)ను పెడతారు. బతుకమ్మ పేర్పునకు ఇదే మూలం. పసుపు, కుంకుమ పెట్టి గౌరమ్మను పూజిస్తారు. సద్దులనాడు(మహర్నవమి) మాత్రం పెద్ద పెద్ద బతుకమ్మలు పేరుస్తారు. దీని కోసం తాంబాళం(స్తాంభాళం) ఉపయోగిస్తారు. మొదటిరోజు ఎంగిపూల బతుకమ్మ. రెండో రోజు పప్పుబెల్లం బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ(ఈ  రోజు బతుకమ్మ ఆడరు), ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. ఈ సీజనులో వచ్చిన పంట ఉత్పత్తులతో చేసిన ప్రసాదాలను ఇలా ప్రతి రోజు బతుకమ్మ ఆడే వద్దకు తీసుకువస్తారు. ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. బతుకమ్మను మొదటి రోజు ఆలయాల్లో... తర్వాత రోజులు ఊరి చెరువులో నిమజ్జనం చేస్తారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement