వృత్తి విద్య ఇక మిథ్య..? | Professional education is taking place in the ..? | Sakshi
Sakshi News home page

వృత్తి విద్య ఇక మిథ్య..?

Dec 19 2013 4:49 AM | Updated on Sep 2 2017 1:45 AM

ఈ చట్టాన్ని రూపొందించి ఏడేళ్లు కావస్తున్నప్పటికీ, ఇప్పటి దాకా ప్రభుత్వం, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల మధ్య ఏటా కుదురుతున్న ఒప్పందం కారణంగా అమలు కాలేదు.

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలోని వృత్తి విద్యా కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించి ‘కర్ణాటక వృత్తి విద్యా సంస్థల (ప్రవేశాల నియంత్రణ, ఫీజు నిర్ధారణ) చట్టం 2006 అమలు ద్వారా విద్యార్థి లోకంలో పెరిగిపోతున్న అనుమానాలకు ప్రభుత్వం ఇస్తున్న వివరణ సంతృప్తినివ్వడం లేదు. ఈ చట్టాన్ని రూపొందించి ఏడేళ్లు కావస్తున్నప్పటికీ, ఇప్పటి దాకా ప్రభుత్వం, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల మధ్య ఏటా కుదురుతున్న ఒప్పందం కారణంగా అమలు కాలేదు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థుల్లో అలజడి చెలరేగుతోంది. రిజర్వేషన్ల ద్వారా విద్యార్థుల ప్రయోజనాలను, సామాజిక న్యాయాన్ని కాపాడుతామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, విద్యార్థుల్లో అనుమానాలు తొలగిపోలేదు. చట్టం అమలుకు ముందు అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజు నిర్ధారణపై ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులతో రెండు కమిటీలను నియమించింది. ఆ కమిటీ నివేదికలు అందాక కానీ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.
 
విద్యార్థుల అనుమానాలు

రాష్ట్రంలో 210 ఇంజనీరింగ్, 32 వైద్య కళాశాలున్నాయి. వీటిలో 21 ఇంజనీరింగ్, పది వైద్య కళాశాలల్లోని ఐదు వేల సీట్లకు మాత్రమే కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ (కేఈఏ) పరీక్షలు నిర్వహిస్తుంది. మిగిలిన 75 వేల సీట్లకు ప్రైవేట్ కళాశాలల నిర్వహణలోని కామెడ్-కే పరీక్షలు నిర్వహించనున్నందున ‘దొంగ చేతికి తాళం’ ఇచ్చినట్లవుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కామెడ్-కే పరీక్షల్లో జరిగిన అవకతవకలను వారు ఉదహరిస్తున్నారు. అక్రమ పద్ధతుల్లో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు లక్షల రూపాయలకు సీట్లను బేరం పెడతాయని వారు చెబుతున్నారు. ఇంకా...
 
 1. రాష్ట్రంలోని ఏ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలలోనూ ప్రభుత్వ కోటా కింద సీట్లు లభించవు. అంటే...యాజమాన్యాలు చెప్పినట్లు భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
 
 2. ప్రైవేట్ కళాశాల్లో ప్రవేశానికి ప్రతి విద్యార్థీ విధిగా కామెడ్-కే పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
 
 3. ప్రభుత్వం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈటీ) రాష్ట్రంలోని 21 ఇంజనీరింగ్, పది వైద్య కళాశాలలకు మాత్రమే వర్తిస్తుంది.
 
 4. సీఈటీలో తొలి ర్యాంకు సాధించినా.. ప్రతిష్టాత్మక ప్రైవేట్ కళాశాలలో చేరాలంటే భారీ మొత్తంలో ఫీజులు సమర్పించుకోవాల్సిందే.
 
 5. ప్రభుత్వం నిర్ణయించే ఫీజు విధానం, సీట్ల పంపక  నిష్పత్తి అన్ ఎయిడెడ్ కళాశాలలకు వర్తించవు.
 
 6. ఇప్పటి వరకు 45 శాతం ఇంజనీరింగ్, 40 శాతం వైద్య, 35 శాతం దంత వైద్య సీట్లను ప్రభుత్వ కోటా కింద రిజర్వేషన్లు, నిర్ణీత ఫీజుతో భర్తీ చేయాల్సి ఉండేది. చట్టం అమలులోకి వస్తే ఈ సీట్లన్నీ ప్రైవేట్ కళాశాలల హస్తగతమవుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement