విరాట్‌ కోహ్లి మరో రికార్డు

Virat Kohli Surpasses Sourav Ganguly To Become Highest Scoring India Test Captain Overseas - Sakshi

నాటింగ్‌హామ్‌: ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తాజాగా మరో ఘనతను సాధించాడు. విదేశీ గడ్డలపై అత్యధిక పరుగులు చేసిన టీమిండియా జాబితాలో కోహ్లి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఇప్పటివరకూ టాప్‌లో ఉన్న సౌరభ్‌ గంగూలీని వెనక్కినెట్టాడు కోహ్లి. నాటింగ్‌హామ్‌ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో విరాట్‌ ఈ ఫీట్‌ సాధించాడు.

భారత క్రికెట్‌ జట్టు సారథిగా విదేశీ గడ్డలపై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సౌరభ్ గంగూలీ 1,693 పరుగులతో ఇప్పటివరకూ అగ్రస్థానంలో ఉన్నాడు. మూడో టెస్టు ప్రారంభానికి ముందు కోహ్లి.. గంగూలీ కంటే 59 పరుగుల వెనుకంజలో ఉన్నాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 97 పరుగులు చేశాడు. దీంతో గంగూలీని వెనక్కినెట్టి కోహ్లి అగ్రస్థానాన్ని అందుకున్నాడు. గంగూలీ 28 టెస్టుల ద్వారా ఇన్ని పరుగులు చేస్తే.. కోహ్లీ కేవలం 19 టెస్టుల ద్వారానే ఈ ఘనత అందుకున్నాడు. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని(1,591, 30 టెస్టులు) మూడో స్థానంలో ఉన్నాడు. ఇక మొహ్మద్‌ అజహరుద్దీన్‌ (1,717), రాహుల్‌ ద్రవిడ్‌ (1,219) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

అంతకుముందు ఇంగ్లండ్‌పై వెయ్యి టెస్టు పరుగులు పూర్తి చేసుకున్న 13వ భారత ఆటగాడిగా కోహ్లి గుర్తింపు సాధించిన సంగతి తెలిసిందే. బర్మింగ్‌హామ్‌ టెస్టులో కోహ్లి ఈ ఫీట్‌ సాధించాడు. ఇంగ్లండ్‌పై అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌(2535) అగ్రస్థానంలో ఉన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top