జాతీయ గీతంపై సుప్రీం తీర్పు.. విజయం ఎవరిదీ?

who battled on the supreme court order on national anthem - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అన్ని సినిమా థియేటర్లలో ప్రతి ఆటకు ముందు జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ప్లే చేయాలని, అలా ప్లే చేసినప్పుడు ప్రేక్షకులు తప్పనిసరిగా లేచి నిలబడాలంటూ 2016, డిసెంబర్‌లో జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు మంగళవారం సవరించుకొని ఇక ముందు గీతాన్ని ప్లే చేయడం ఐచ్ఛికమేనని, తప్పనిసరి కాదని తీర్పు చెప్పడానికి కారణం ఏమిటీ? అందుకు దారితీసిన పరిస్థితులేమిటీ ? ఇందులో ఎవరిదీ విజయం? ఎవరిదీ అపజయం?

కేరళలోని ‘కోడంగళూరు ఫిల్మ్‌ సొసైటీ’ చేసిన న్యాయపోరాటం ఫలితంగా సుప్రీంకోర్టు తన తొందరపాటు ఆదేశాలను సవరించుకోవాల్సి వచ్చింది. కేవలం 280 మంది సభ్యులు గల ఈ సొసైటీకి ఇది పెద్ద విజయమనే చెప్పవచ్చు. ఈ సొసైటీ సభ్యులు ప్రతి శుక్రవారం ఓ మేడ మీద సమావేశమై జాతీయ, అంతర్జాతీయ చిత్రాలను చూస్తారు. అనంతరం ఆ సినిమాల మంచి, చెడుల గురించి సమీక్షిస్తారు. ఓ శుక్రవారం నాడు, అన్ని థియేటర్లలో ప్రతి ఆట ముందు జాతీయ గీతాన్ని విధిగా ప్లే చేయాలంటూ సుప్రీం కోర్టు 2016, డిసెంబర్‌ 2వ తేదీన ఉత్తర్వులు ఇచ్చిన అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చింది.

ఒక్కోసారి తాము రెండు, మూడు చిత్రాలను చూస్తామని, ప్రతిసారి జాతీయ గీతాన్ని ప్లే చేయడం, లేచి నిలబడడం చేస్తే తిక్కపుట్టి ఆ గీతంపైనున్న భక్తి భావం కాస్త గాలిలో కలిసిపోతుందని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇక అదే ఏడాది డిసెంబర్‌ 9వ తేదీ నుంచి కేరళలో జరుగనున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో వారం రోజుల్లో 60కిపైగా చిత్రాలను ప్రదర్శిస్తారని, అన్ని ఆటల ముందు జాతీయ గీతాన్ని ప్లే చేయడం, ప్రేక్షకులు లేచి నిలబడడం న్యూసెన్స్‌ అని కూడా ఫిల్మ్‌ సొసైటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. అందుకని సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేయాలని క్లబ్‌ సభ్యులు నిర్ణయించారు. ఆ మేరకు క్లబ్‌ కార్యదర్శి కేజే రిజాయ్‌ చొరవ తీసుకున్నారు. తీర్పును రివ్యూ చేయాలని సుప్రీంకోర్టును కోరడంతోపాటు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు జాతీయ గీతాలాపన నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ‘చిత్రోత్సవం సందర్భంగా 40 సినిమాలు చూస్తే, 40 సార్లు నిలబడు’ అంటూ వ్యాఖ్యానం కూడా చేసింది. ఈ అంశంపై అప్పుడు సంఘ్‌ పరివార్‌ సంస్థలు రాజకీయ దుమారం కూడా రేపాయి.
 
ముందుగా ప్రకటించినట్లుగానే డిసెంబర్‌ 9వ తేదీ నుంచి తిరువనంతపురం నగరంలో కేరళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా నగరంలోని 12 థియేటర్లలో దాదాపు 60 సినిమాలను ప్రదర్శించారు. ఈ చిత్రాల సందర్భంగా జాతీయ గీతాన్ని ప్లే చేసినప్పటికీ, ప్రేక్షకులు అందరు లేచి నిలబడలేదు. సంఘ్‌ పరివార్‌ సంస్థల ఫిర్యాదు మేరకు వారిని అరెస్ట్‌ చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు అంతర్జాతీయ చిత్రోత్సవాలను నిర్వహించిన కేరళ చలనచిత్ర అకాడమీ చైర్మన్, మలయాళం చలనచిత్ర దర్శకుడు కమల్‌ అడ్డుపడ్డారు. ‘దేశ నిబంధనలు పాటిస్తే దేశంలో ఉండు, లేదంటే పాకిస్థాన్‌ వెళ్లిపొమ్మంటూ’ సంఘ్‌ సంస్థలు పెద్ద ఎత్తున కమల్‌కు వ్యతిరేకంగా గొడవ చేశాయి. చలనచిత్రోత్సవాలకు రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ప్రతినిధులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు వల్ల తాము ఎలాంటి ఇబ్బందులకు గురికావాల్సి వచ్చిందో, జాతీయ గీతం పట్ల భక్తి భావం తగ్గే ప్రమాదం కూడా ఉందని సుప్రీంకోర్టులో ఫిల్మ్‌ సొసైటీ వాదించింది. పబ్లిక్‌ ప్లేసుల్లో ప్రజలు పాటించాల్సిన నిబంధనలు తీసుకొచ్చే అధికారం పార్లమెంట్‌కు ఉంటుందిగానీ, సుప్రీంకోర్టుకు ఎక్కడుందంటూ కూడా నిలదీసింది. వాదోపవాదాలు విన్న తర్వాత సుప్రీంకోర్టు తన ఉత్తర్వులను సవరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇది నిజమైన దేశభక్తుల విజయమని సుప్రీంకోర్టులో ఫిల్మ్‌ సొసైటీ తరఫున కేసును వాదించిన న్యాయవాదుల్లో ఒకరైన పీవీ దినోష్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. ప్రేక్షకులపై పోలీసులు పెట్టిన కేసులను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top