నిందితులంతా నిర్దోషులే

CBI Judge Acquits All 22 Accused in Sohrabuddin Encounter Case - Sakshi

సొహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో సీబీఐ కోర్టు తీర్పు

మొత్తం 22 మంది నిందితుల్లో 21 మంది పోలీసులు

ముంబై: పదమూడేళ్లనాటి సొహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో 21మంది పోలీసు అధికారులు సహా మొత్తం 22 మందీ నిర్దోషులేనని స్పెషల్‌ సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సొహ్రాబుద్దీన్, అతని భార్య కౌసర్‌ బీ, అనుచరుడు తులసీ ప్రజాపతిల మృతిలో కుట్ర కోణం, ఆ ముగ్గురి మృతితో నిందితులకు ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ప్రాసిక్యూషన్‌ సరైన సాక్ష్యాధారాలను చూపలేకపోయిందంటూ స్పెషల్‌ సీబీఐ కోర్టు జడ్జి ఎస్‌జే శర్మ తీర్పుచెప్పారు.

‘22 మంది నిందితులపై కుట్ర ఆరోపణలను సమర్ధనగా సీబీఐ ఎలాంటి ఆధారాలను చూపలేకపోయింది. దీంతో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నాం’ అని తీర్పుచెప్పారు.  సొహ్రాబుద్దీన్‌ షేక్‌కు లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని, అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని మోదీని హత్య చేసేందుకు కుట్ర పన్నాడనేది పోలీసుల ఆరోపణ. అప్పటి డీజీపీ వంజారా ఆదేశాల మేరకే మరో అధికారి పీసీ పాండే ఎన్‌కౌంటర్‌లో ప్రజాపతిని చంపారని సీబీఐ ఆరోపించింది.

అయితే, ఇందుకు ఫోన్‌కాల్స్‌ వంటి ఎలాంటి ఆధారాలను చూపకపోవడంతో న్యాయస్థానం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. సీబీఐ కోర్టు తీర్పుపై సొహ్రాబుద్దీన్‌ సోదరుడు రుబాబుద్దీన్‌ స్పందించారు. ఈ తీర్పు విచారకరమనీ, దీనిని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. గ్యాంగ్‌స్టర్‌ సొహ్రాబుద్దీన్, అతని భార్య కౌసర్‌ బీ, అనుచరుడు తులసీ ప్రజాపతితో కలిసి హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీకి బస్సులో వస్తుండగా 2005 నవంబర్‌ 22వ తేదీ రాత్రి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.  అదే ఏడాది నవంబర్‌ 26వ తేదీన సొహ్రాబుద్దీన్, మరో మూడు రోజుల తర్వాత కౌసర్‌ బీ హత్యకు గురయ్యారు. వీరిని గుజరాత్, రాజస్తాన్‌ పోలీసు బృందమే హత్య చేసిందని సీబీఐ ఆరోపించింది. ప్రజాపతిని ఉదయ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో ఉంచిన పోలీసులు 2006 డిసెంబర్‌ 27వ తేదీన గుజరాత్‌–రాజస్తాన్‌ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చంపేశారని సీబీఐ పేర్కొంది.

ఈ కేసులోని 22 మంది నిందితుల్లో 21 మంది గుజరాత్, రాజస్తాన్‌ రాష్ట్రాలకు చెందిన దిగువ స్థాయి పోలీసు అధికారులు కాగా 22వ వ్యక్తి గుజరాత్‌లో సొహ్రాబుద్దీన్‌ దంపతులు హత్యకు ముందు బస చేసిన ఫాంహౌస్‌ యజమాని. గుజరాత్‌ సీఐడీ నుంచి కేసు దర్యాప్తు బాధ్యతలను చేపట్టిన సీబీఐ.. అప్పటి గుజరాత్‌ హోం మంత్రి, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, అప్పటి రాజస్తాన్‌ హోం మంత్రి గులాబ్‌చంద్‌ కటారియా, ఐపీసీ అధికారులు వంజారా, పీసీ పాండే సహా 38మందిపై ఆరోపణలు మోపింది. మొత్తం 210 మంది సాక్షులను విచారించగా అందులో 92 మంది వ్యతిరేకంగా మాట్లాడారు. విచారణ నిష్పాక్షికంగా సాగేందుకు ఈ కేసును గుజరాత్‌ నుంచి మహారాష్ట్రకు బదిలీ చేయాలన్న సీబీఐ పిటిషన్‌కు అనుకూలంగా 2013లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ కోర్టు జడ్జి బీహెచ్‌ లోయా మూడేళ్ల క్రితం మృతి చెందడం కూడా వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

కేసు విచారణ సాగిందిలా..
నవంబర్‌ 22, 2005: గ్యాంగ్‌స్టర్‌ సొహ్రాబుద్దీన్‌ షేక్, ఆయన భార్య కౌసర్‌ బీ, అనుచరుడు తులసి ప్రజాపతి హైదరాబాద్‌ నుంచి సాంగ్లికి బస్సులో వస్తుండగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. షేక్‌ దంపతులను ఒక వాహనంలో, ప్రజాపతిని మరో వాహనంలో తీసుకెళ్లారు.

నవంబర్‌ 22 నుంచి 25 2005: అహ్మదాబాద్‌ సమీపంలోని ఒక ఫాం హౌస్‌లో సొహ్రాబుద్దీన్, కౌసర్‌ బీలను ఉంచారు. ప్రజాపతిని ఉదయ్‌పూర్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు

నవంబర్‌ 26, 2005: గుజరాత్, రాజస్థాన్‌ పోలీసులు కలిసి జరిపిన ఎన్‌కౌంటర్‌లో సొహ్రాబుద్దీన్‌ మరణించాడు. అది నకిలీ ఎన్‌కౌంటర్‌ అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి

నవంబర్‌ 29, 2005: కౌసర్‌ శరీరమంతా కాలిన గాయాలతో శవమై కనిపించింది.

డిసెంబర్‌ 27, 2006: రాజస్థాన్, గుజరాత్‌ పోలీసు బృందం ఉదయ్‌పూర్‌ సెంట్రల్‌ జైలు నుంచి ప్రజాపతిని తీసుకువెళుతూ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని సర్హాద్‌ చప్రిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చంపేశారు.

మే 22, 2006: ఈ ఎన్‌కౌంటర్‌ కేసును విచారించాలని, కౌసర్‌ ఆచూకీ తెలపాలంటూ సొహ్రాబుద్దీన్‌ కుటుంబసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా గుజరాత్‌ రాష్ట్ర సీఐడీని ఈ కేసును విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

జనవరి 2010: సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది.

జులై 23, 2010: అప్పటి గుజరాత్‌ హోంమంత్రి అమిత్‌ షా, అప్పటి రాజస్థాన్‌ హోంమంత్రి గులాబ్‌చంద్‌ కటారియా, ఇతర ఐపీఎస్‌ అధికారులతో పాటు 38 మందిపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.

జులై 25: అమిత్‌ షాను సీబీఐ అరెస్ట్‌ చేసింది.

డిసెంబర్‌ 30, 2014: ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు అమిత్‌ను కేసు నుంచి విముక్తుడ్ని చేసింది. ఇతర ఐపీఎస్‌ అధికారులు బయటపడ్డారు.

నవంబర్‌ 2017: సీబీఐ ప్రత్యేక జడ్జి ఎస్‌జే శర్మ కేసు విచారణను ప్రారంభించారు

డిసెంబర్‌ 21, 2018: సరైన సాక్ష్యాలు లేవంటూ 22 మందికి విముక్తి కల్పిస్తూ తీర్పు

నిర్దోషులుగా బయటపడిన పోలీసులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top