క్రమబద్ధీకరణ జీవో వచ్చేస్తోంది!

క్రమబద్ధీకరణ జీవో వచ్చేస్తోంది!


► అక్రమ లే అవుట్లు, భవనాల క్రమబద్ధీకరణకు సీఎం ఆమోదం

► ఒకట్రెండు రోజుల్లో ఎల్‌ఆర్‌ఎస్ ఉత్తర్వులు

► చట్ట సవరణ తర్వాతే బీపీఎస్.. నెల రోజులు పట్టే అవకాశం

► క్రమబద్ధీకరణకు కటాఫ్ 2015, ఆగస్టు 31

► స్లమ్స్‌లో క్రమబద్ధీకరణకు చదరపు గజానికి రూ.15

► గడువు ముగిసిన తర్వాత అక్రమాలపై కఠిన చర్యలు

► కూల్చివేతలతో పాటు యజమానులపై క్రిమినల్ కేసులు

► అనుమతులు లేని కట్టడాలు, లే అవుట్ల రిజిస్ట్రేషన్లకు నో


 

 సాక్షి, హైదరాబాద్:  అక్రమ కట్టడాలు, లే అవుట్లు ఉన్న వారికి శుభవార్త. వాటి క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చివరిసారిగా రాష్ట్రంలో భవనాల క్రమబద్ధీకరణ పథకం(బీపీఎస్)తో పాటు లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని (ఎల్‌ఆర్‌ఎస్) ప్రవేశపెట్టాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పంపిన ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ ఆమోదించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు సంబంధిత ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సంతకాలు చేశారు. న్యాయ శాఖ ఆమోదం తెలిపిన వెంటనే ఎల్‌ఆర్‌ఎస్ అమలుకు ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఒకట్రెండు రోజుల్లో ఈ తంతు పూర్తయ్యే అవకాశముంది.బీపీఎస్ అమలుకు ముందు న్యాయపరమైన చిక్కులను తొలగించిన తర్వాతే ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఒకేసారి (వన్ టైమ్ స్కీం) అంటూనే గత ప్రభుత్వాలు పదేపదే అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ పథకాలను ప్రవేశపెట్టడంపై అభ్యంతరం తెలిపిన హైకోర్టు.. 1998లో నాటి ప్రభుత్వం జారీ చేసిన బీపీఎస్ ఉత్తర్వుల (జీవో 419)ను కొట్టేసింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ ద్వారా 2007-08లో మళ్లీ బీపీఎస్‌ను అమలు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా మళ్లీ ఆర్డినెన్స్ ద్వారా ఏపీ మునిసిపాలిటీ చట్టం, జీహెచ్‌ఎంసీ చట్టం, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టంతో పాటు భవన నిర్మాణ నియమావళి మార్గదర్శకాల (జీవో 168)ను సవరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ ముగిసి బీపీఎస్ ఉత్తర్వులు జారీ అయ్యేందుకు కొంత సమయం పట్టే అవకాశముంది. చివరిసారిగా అమలు చేసిన క్రమబద్ధీకరణ పథకాల గడువు 2013 జూన్ 12తో ముగిసిపోగా, వేల సంఖ్యలో దరఖాస్తులు అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఈ దరఖాస్తులను సైతం  పరిష్కరించాలని సర్కారు నిర్ణయించింది. పేద, మధ్యతరగతికి వెసులుబాటు

 అక్రమాల క్రమబద్ధీకరణ కోసం 2015 ఆగస్టు 31ని కటాఫ్ తేదీగా ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ తర్వాత చేపట్టిన కట్టడాలు, లే అవుట్లను క్రమబద్ధీకరించకూడదని నిర్ణయించింది. అవినీతికి తావు లేకుండా ‘టీఎస్-ఐపాస్’ తరహాలో క్రమబద్ధీకరణ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించి నిర్ణీత గడువులోగా పరిష్కరించనున్నారు. అక్రమ ప్లాట్లు, కట్టడాల మార్కెట్ ధరల ఆధారంగా రుసుం వసూలు చేయనున్నారు. వైశాల్యం ఆధారంగా వాటి మార్కెట్ విలువలో 20 నుంచి 100 శాతం వరకు ఫీజు వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, పేద, మధ్య తరగతి వర్గాలకు ఫీజుల విషయంలో వెసులుబాటు కల్పించనున్నారు.500 చ.మీ.లోపు ప్లాట్లకు నామమాత్రంగా రుసుములు ఉండనున్నాయి. 5 వేల చ.గజాలు దాటిన అక్రమ లే అవుట్‌లపై మాత్రం భారీగా వడ్డీంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. మురికివాడల్లో నిర్మించిన ఇళ్లు/కట్టడాలకు చ.గజానికి కేవలం రూ.15 చొప్పున క్రమబద్ధీకరణ ఫీజు వసూలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 100 చ.గజాలలోపు ఉండే కట్టడాలకు సైతం ఇదే ఫీజులను వర్తింపజేసే అవకాశముంది. బీపీఎస్ ద్వారా ఒక్క జీహెచ్‌ఎంసీలోనే సుమారు రూ. వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనావేస్తోంది. ఇకపై ‘అక్రమం’ క్రైమే!

 ఇదే చివరిసారి అంటూ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ పథకాలను ప్రవేశపెట్టబోతోంది. ఈ పథకాల గడువు ముగిసిన తర్వాత అక్రమ కట్టడాలు, లే అవుట్లపై ఉక్కుపాదం మోపనుంది. ఎక్కడికక్కడ కూల్చివేతలతో పాటు తొలిసారిగా యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టనుంది. కేసులు పెట్టేందుకు అనువుగా కొత్త భవన నిర్మాణ నియమావళికి రూపకల్పన చేస్తోంది. ఇది అమలులోకి వస్తే అక్రమ లే అవుట్లు, భవనాలకు రిజిస్ట్రేషన్లు జరపరు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top