పదవ షెడ్యూలు కింద నిష్పక్షపాత ట్రిబ్యునల్‌

Mangari Rajender Article On Tenth Schedule - Sakshi

సందర్భం

భారతదేశంలో ఆయారామ్‌ గయారామ్‌లు లెక్కకు మించి ఉన్నారు. ఆయారామ్, గయారామ్‌ అన్న పదబంధం రావడానికి కారణం హరియాణా రాష్ట్ర ఎమ్మెల్యే గయారామ్‌. 1967లో ఒకేరోజు ఆయన మూడుసార్లు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారాడు. ఈ పార్టీ ఫిరాయింపులను అరిగట్టడానికి 1985లో రాజ్యాంగంలో పదవ షెడ్యూలుని పొందుపరిచారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించినా, వేరే పార్టీలో స్వచ్ఛంగంగా చేరినా ఆయన పదవిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అయితే వారిని అనర్హులుగా నిర్ణయించే అధికారం స్పీకర్లకీ, చైర్మన్‌లకీ ఇవ్వడం వల్ల ఈ చట్టం నిరుపయోగంగా మారిపోయింది. మరో విధంగా చెప్పాలంటే అన్ని చట్టాలకు మించి ఇది దుర్వినియోగం అవుతోంది. అయినా ఈ పరిస్థితులను సరిచేయడానికి దేశంలోని ఏ పార్టీ సంసిద్ధతను చూపలేదు. తమ పార్టీ సభ్యులను ఇతర పార్టీలు ఆకర్షించినప్పుడు మాత్రం గగ్గోలు పెట్టడం మామూలు విషయంగా మారింది. 

శాసన సభ స్పీకర్లు, పరిషత్తు చైర్మన్లుగా అధికార పార్టీకి చెందిన సభ్యులే వుంటారు. వారు పార్టీ సభ్యులుగా కాకుండా తటస్థంగా వుండాలి. కానీ, ఆ సరిస్థితి మన దేశంలో లేదు. అనర్హత దరఖాస్తులను నెలల తరబడి పరిష్కరించకపోవడం, అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు ప్రకటించడం సర్వసాధారణంగా మారిపోయింది. తాము చేస్తున్నది తప్పే అయినా చేస్తున్నానని చెబుతున్న చైర్మన్లని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇటీవల కిషన్‌ మేఘా చంద్రసింగ్‌ వర్సెస్‌ గౌరవ స్పీకర్‌ మణిపూర్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ కేసులో కొన్ని అత్యంత అవసరమైన సూచనలని చేసింది. ఈ సూచనలను మన శాసనకర్తలు గౌరవిస్తారా లేదా అన్నది కాలం నిర్ణయిస్తుంది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌ ప్రకారం దాఖలైన శాసనకర్తల అనర్హత దరఖాస్తులను అసాధారణ కారణాలు ఉన్నప్పుడు తప్ప, మిగతా సందర్భాలలో మూడు నెలల కాలపరిమితిలో పరిష్కరించి నిర్ణయాన్ని ప్రకటించాలి. ఏది సముచిత కాలపరిమితి అన్న విషయం కేసులోని వాస్తవ పరిస్థితిని బట్టి ఉంటుంది. పదవ షెడ్యూలను ఉల్లంఘించిన శాసనకర్తలపై దాఖలైన దర ఖాస్తులను ఈ కాలపరిమితిలో పరిష్కరించడ మనేది స్పీకర్, చైర్మెన్‌ల రాజ్యాంగ విధి. న్యాయమూర్తులు ఆర్‌.ఎఫ్‌. నారీమన్, అనిరుద్ధ బోస్, రామసుబ్రమణియన్లతో కూడిన బెంచీ ఈ తీర్పుని వెలువరించింది. 

సుప్రీంకోర్టు ఈ విధమైన సూచనలు చేసింది. ‘స్పీకర్‌ అనే వ్యక్తి ఒక పార్టీకి చెందిన వ్యక్తి. అలాంటి వ్యక్తి క్వాసీ జ్యుడీషియల్‌ అథారిటీకి అధ్యక్షత వహించి ఈ అనర్హత దరఖాస్తులను పరిష్కరించడం ఎంత వరకు సమంజసమో పార్ల మెంట్‌ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అనర్హత దరఖాస్తులను పరిష్కరించడానికి ఓ శాశ్వత ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తులను ఆ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా నియమించాల్సిన అవసరం ఉంది. ఈ అనర్హత దరఖాస్తులను సత్వరం పరిష్కరించే విధంగా అవసరమైన మార్పులను పదవ షెడ్యూల్‌కు చేయాల్సిన అవసరం ఉంది’. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎన్నికైన మణిపూర్‌ శాసన సభ్యుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 2017లో సహకరించాడు. శాసన సభ్యుడిగా అతడు అర్హుడు కాదని, అనర్హత వేటు వేయాలని దరఖాస్తు చేశారు. స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా దాన్ని పెండింగ్‌లో ఉంచాడు.

దానిపై హైకోర్టులో దరఖాస్తు చేస్తే జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టులు ఏం చేయాలో రాజేంద్ర సింగ్‌ రానా వర్సెస్‌ స్వామి ప్రసాద్‌ మౌర్య(2007) ఎస్‌ సిసి (4) 270 కేసులో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. స్పీకర్‌ తన అధికార పరిధిని ఉపయోగించనప్పుడు ఆ నిర్వా్యపకత్వంపై న్యాయ సమీక్ష చేయవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రతి అందిన నాలుగు వారాల్లో అనర్హత పిటీషన్లని పరిష్కరించాలని సుప్రీం కోర్టు మణిపూర్‌ అసెంబ్లీ స్పీకర్‌ని ఆదేశించింది. సుప్రీం కోర్టు చేసిన సూచనను పార్లమెంట్‌ ఏం చేస్తుందో వేచి చూడాలి. స్పీకర్లుగా బయటి వ్యక్తులను నియమిస్తే ఎలా ఉంటుంది? ఇది సాధ్యమా? పార్లమెంట్‌ ఆలోచించాలి.

మంగారి రాజేందర్‌
వ్యాసకర్త గతంలో జిల్లా సెషన్స్‌ జడ్జీగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యునిగా పనిచేశారు
మొబైల్‌ : 94404 83001

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top