నీడ

Suddenly, someone was on my shoulder - Sakshi

కథా ప్రపంచం

అకస్మాత్తుగా వెనక నుంచి నా భుజం మీద ఎవరో చేతులేశారు. క్షణంసేపు నిశ్చేష్టురాలయ్యాను. ఆ చేతులు నిఖిల్‌వి – నా కొడుకువి. ఎందుకో ఆ చేతుల స్పర్శతో నాకు మా ఆయన – నిఖిల్‌ తండ్రి – సుధీర్‌ జ్ఞాపకం వచ్చారు. ‘‘అమ్మా, ఈవేళ వెళ్దాం కదూ?’’ నిఖిల్‌ మొహం నా మొహం దగ్గరికి తెచ్చి అడిగాడు. ‘‘ఎక్కడికిరా? ఎక్కడికెళ్దాం?’’ నేను విసుగ్గా, పట్టించుకోనట్లు అడిగాను. ‘‘అలా ఎందుకంటావమ్మా? ప్రతి ఏడాదీ రిజల్ట్స్‌ వచ్చిన మర్నాడు మనం కథల పుస్తకాలు కొనడానికి బజారుకి వెళ్తాం కదా? నిన్ననే నా రిజల్ట్స్‌ వచ్చాయి కదా?’  ‘‘నిజమేరా నిఖిల్‌. కానీ నాకు ఇంట్లో పనులింకా పూర్తవలేదు కదా!’’ నేనన్నాను. వీడికి నేనెలా నచ్చచెప్పడం? ఈవేళ సోమవారం అనీ, అమెరికా నుంచి రావాల్సిన సుధీర్‌ ఉత్తరం, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది –ఈవేళ రావచ్చనీ! బయటకి వెళ్లాలంటే త్వరగా వెళ్లి పోస్టుమేన్‌ వచ్చేలోగా హడావుడిగా తిరిగి రావలసివుంటుంది. లేకపోతే ఆ ఉత్తం నేనే స్వయంగా అందుకోలేదని చిరుకోపంతో కినుక వహించదూ? ‘‘ఇలా ఎందుకు చేస్తున్నావు అమ్మా?’’ వాడు ఏడుపుమొహం పెట్టాడు.

‘‘వెళ్లమ్మా కోడలా, వాడి మనస్సును కష్టపెట్టవద్దు’’ మూలన కూర్చున్న అత్తగారు దూదివత్తులు చేస్తూ అన్నారు. ‘‘సరే రా, వెళ్దాం పద.’’ నేను నిఖిల్‌తో అన్నాను. ప్రతీ సంవత్సరం రిజల్ట్స్‌ వచ్చింతరువాత మరుసటిరోజు కథల పుస్తకాల కోసం వెళ్లడం మాకు ఆనవాయితీ. మరి ఈ సంవత్సరమే ఎందుకు మర్చిపోయానో? నాకే ఆశ్చర్యం వేసింది. గతకాలంలోని చిన్న చిన్న విషయాలు నాకు జ్ఞాపకం వచ్చాయి.
రాజా–రాణీల కథల్లో నిమగ్నమైవుండే నిఖిల్‌ నా కళ్లముందు వచ్చాడు. కాస్త బజారుకి షాపింగ్‌కు వెళ్తేచాలు, ఎప్పుడూ పుస్తకాలు కొనమని బెట్టు చేస్తాడు. పుస్తకాలు – పుస్తకాలు – పుస్తకాలు. తండ్రీ, కొడుకులిద్దరూ ఒకటే, ఒకే మాలలో మణులు. సుధీర్‌ పుస్తకాలు కొనడానికి వెళ్లినప్పుడల్లా నిఖిల్‌ ఏడుస్తాడు – తనకూ కావాలని. ‘‘మీ నాన్న ముందు పుస్తక ప్రపంచం నుంచి బయటపడనియ్యి. తరువాత నీ సంగతి చూద్దాం.’’ఇలా నేను అప్పుడప్పుడు దెప్పిపొడిచేదానిని. ‘‘దివ్యా! తండ్రి మీద కోపం కొడుకుమీద ఎందుకు చూపిస్తావమ్మా?’’

సుధీర్‌ వ్యంగ్యంగా అన్నాడు. ఆ తరువాత సుధీర్‌ ఒక ఉపాయంతో నిఖిల్‌కి నచ్చజెప్పాడు. ‘‘ఇదిగో చూడు నిఖిల్‌ ప్రతీ సంవత్సరం రిజల్ట్స్‌ వచ్చిన మర్నాడే మనం పుస్తకాల షాపుకి వెళ్లి, నీకు కావలసినన్ని పుస్తకాలు కొందాం. ఇలా మధ్య మధ్య తీసుకోవడం వద్దు. ఈ పద్ధతి అనుసరిస్తే నీ తల్లి రుసరుసలు, కోపతాపాలూ నీమీదా, నామీదా పడవు. ఇద్దరం బతికిపోతాం.’’ నిఖిల్‌ తండ్రి మాటలు విని ‘‘సరే అలాగే చేద్దాం’’ అంటూ తలాడిస్తూ, కోతిలా గెంతులేస్తూ బయటికి వెళ్లిపోయాడు. నేను మాత్రం ఈ తండ్రీ కొడుకుల నాటకం కుతూహలంగా చూస్తూ వూరుకున్నాను. సుధీర్‌ ఎప్పుడు నా వెనకనించి వచ్చి నా మెడలో చెయ్యి వేశాడో నాకు తెలియలేదు. ‘‘దివ్యా, మనం ఈ పుస్తకాల వల్లనే దగ్గరికి వచ్చాం కదూ?’’ అతను తన చెంపని, నా చెంపకి చేర్చాడు. నా మనస్సు గతంలోకి పోయింది. బరోడా యూనివర్సిటీ రోజులు గుర్తుకొచ్చాయి. నేనూ, సుధీర్‌ ఫైనల్‌ ఇయర్‌ బిఎ చదువుతున్నాం. నాకూ, సుధీర్‌కీ పుస్తక పఠనం అంటే ప్రాణసమానం. అందువల్ల మా టైము చాలావరకూ లైబ్రరీలోనే గడిపేసేవాళ్లం. అక్కడే మా పరిచయం మొదలైంది. ఇద్దరి

అభిరుచులూ, మనస్సులూ కలిశాయి. ఎలా ఎలా నేను సుధీర్‌కి దగ్గరవుతున్నానో, అలా అలా అతని ఆర్థిక పరిస్థితీ, అసామాన్య బుద్ధికుశలత, అంతులేని మహత్వాకాంక్ష అర్థమవసాగాయి. ఆ ప్రకారమే అతనికి నచ్చే విధంగా నేను ప్రవర్తించసాగాను. బిఎ పరీక్షలో సుధీర్‌కి వచ్చినన్ని మార్కులు, గత పది సంవత్సరాలలో ఎవ్వరికీ రాలేదట! కొత్త రికార్డు స్థాపించి గోల్డ్‌మెడల్‌ సంపాదించాడు. అతను ఎంఎ చదవడం మొదలెట్టాడు. నేను మాత్రం బిఎ తరువాత బి.ఎడ్‌. కోర్సు పూర్తి చేసి టీచరు ఉద్యోగం సంపాదించాను. అతను ఎంఎ కూడా మంచి మార్కులతో పూర్తి చేశాడు. ఆ తరువాత మా వివాహం అయింది.
కానీ అతని చదివే అలవాటు ఏమాత్రం సడలలేదు. నిజానికి పెరిగింది. ఒక ప్రసిద్ధ కాలేజీలో లెక్చరర్‌గా చేరాడు. ఒక అద్భుతమైన అధ్యాపకుడిగా పేరు గడించాడు. నాకు అతణ్ని చూస్తే గర్వంగా ఉండేది. నా టీచరు ఉద్యోగం, సంసార బాధ్యతలు రెండూ నడుస్తున్నాయి. ఆఖరుకు ఎన్నో సంవత్సరాలుగా నిర్మించుకున్న సుధీర్‌ కలలు పండే రోజు ఆసన్నమైంది. అతనికి అమెరికాలోని నార్త్‌ ఈస్టర్న్‌ యూనివర్సిటీలో పెద్ద చదువులకి ప్రవేశం దొరికి, అతను స్టడీ లీవ్‌ తీసుకుని, అమెరికా వెళ్లాడు. బహుశా ఈవేళ రానున్న సుధీర్‌ ఉత్తరంలో అతని థీసిస్‌ ఎప్పటికి పూర్తయ్యేదీ, అతనెప్పుడు అమెరికా నుంచి మన దేశం తిరిగి వచ్చేదీ, తెలుస్తుంది.

వేడి వేడి చపాతీలు నా చేతికి తగిలి, ఊహాలోకం వదిలి మేల్కొన్నాను. ఈ మధ్య నాకేదో చెప్పలేని బాధ పట్టుకుంది. ఈ బాధ ఎటువంటిదీ? శారీరకమైనదా? మానసికమైనదా? బహుశా రెండు విధాలా అనుకొంటాను. సుధీర్‌ ఉన్నత లక్ష్యాల పరుగులో అతనికి ఎలాగున్నా నాకు మాత్రం బాగా అలసట వచ్చి, విసిగిపోయాను. అతను ఆశయాలు సాధించడానికి నేను అటు ఉద్యోగం, ఇటు సంసారబాధ్యతలూ ఒక్కదాన్నే భరించి నడుపుకొస్తున్నాను. అలాగే నిఖిల్‌ ఆరోగ్యం, చదువు, ఆటపాటలూ పర్యవేక్షించాలి – కళ్లలో వొత్తులేసుకొని మరీ. చాలాసేపు అలాగే కూర్చుండిపోయాను. గత కొద్ది రోజులుగా నాకీ వొంటరితనం విసుగెత్తింది. ముఖ్యంగా మగదిక్కు లోపించడం కుటుంబంలో పెద్ద భారంగా తోస్తోంది. అన్ని నిర్ణయాలూ, పనులూ సుధీర్‌ చేయాలనీ, నేను అతని నీడలా నిర్లిప్తంగా, నిమిత్తమాత్రంగా వుండిపోవాలని ఆకాంక్ష మొదలైంది. ఈవేళ అతని దగ్గర్నుంచి వచ్చే ఉత్తరంలో తెలుస్తుంది – అతనెప్పుడొచ్చేదీ, ఎప్పుడు నాకీ బాధ్యతా, బరువూ తొలిగేదీ! ఈమధ్య నాకేమయిందో నాకే తెలియదు. ఇంట్లోని ఎన్నో పనులు సుధీర్‌ వచ్చి చూసుకుంటాడులే అని చేయకుండా అలాగే వుంచేస్తున్నాను – మరీ తప్పనిసరి అయినవి తప్పిస్తే! ఇంటికి రంగు వెయ్యడం, వి.సి.ఆర్‌. కొనడం, వంటయింట్లో చెయ్యాల్సిన బాగులు, మార్పులు, ఇలా వొకటా, రెండా – కొన్ని వందల పనులు. ఇంట్లో వుండేది నేనూ, మా అత్తగారూ, నిఖిల్‌ పిల్లవాడు. ఈ ఆడపెత్తనంతో ఎన్నాళ్లు సంసారం నడుస్తుంది? సుధీర్‌ వీటన్నిటికీ అతీతంగా, దూరంగా వున్నాడు. అదృష్టం!

‘పోస్ట్‌’ అనే శబ్దంతో నేను తెలివిలోకి వచ్చాను. మామూలుగా వచ్చే నీలంరంగు ఉత్తరం చూసి నేను కరిగిపోయాను. కొత్త పెళ్లికూతురిలా సిగ్గుబడుతూ ఆ ఉత్తరాన్ని చింపాను. త్వరత్వరగా చదవాలనే ఆత్రుత కళ్లనిండా నిండింది. ఉత్తరం మీద ఉత్సుకతతో పరుగులెత్తుతున్న నా కళ్లు హఠాత్తుగా ఆగాయి. సుధీర్‌ ఇలా రాశాడు. ‘‘పి.హెచ్‌డీ కోసం నాకు ఏర్పాటైన గైడ్‌ అకస్మాత్తుగా లండన్‌కు ఏదో కాన్ఫరెన్స్‌కి వెళ్లవలసివచ్చింది. అందువల్ల నా థీసిస్‌ పని కాస్త పొడిగించాల్సివచ్చింది. అంటే మరో నాలుగు నెలలు ఆలస్యం అవుతుంది. నాకు తెలుసు రాణీ! నేను నీ వోపిక పరీక్షిస్తున్నాను. ఇన్నాళ్లూ నువ్వు భరించావు. మరో నాలుగు నెలలు నవ్వుతూ ఏమాత్రం బాధ కనిపించకుండా, నీ అమూల్య అంగీకారం తెలియజెయ్యి.’’నా కళ్లలో బొటబొటా నీళ్లు. సుధీర్‌ రాసిన నాలుగు నెలల ఆలస్యం నా పాలిట నాలుగు యుగాలు!      ‘‘వెళ్దాం పద అమ్మా’’ నిఖిల్‌ మాటలు నన్ను మేల్కొలిపాయి.

‘‘అవును, వెళ్దాం. నన్ను తయారవనియ్యి.’’‘‘సరే నువ్వు సిద్ధంగా ఉండు. నేను బయటకెళ్లి రిక్షా తీసుకువస్తా’’ నిఖిల్‌ అలా అని బయటకు పరుగెత్తాడు.నేను యాంత్రికంగా అన్ని పనులూ చేస్తున్నాను. సుధీర్‌ ఆగమనం మరో నాలుగు నెలలు వాయిదా పడింది. అంటే ఈ ఇంటి భారాలన్నీ నేనొక్కర్తినే మరో నాలుగు నెలలు నిర్వహించాలి.నాకు వూరికే పెద్ద దెబ్బ తగిలినట్లనిపించింది. అత్తగారికి చెప్పి బయటపడ్డాను. ముందు చూస్తే నిఖిల్‌ రిక్షా తీసుకువస్తున్నాడు. వాడు రిక్షా కొద్దిదూరంలో ఆపి గబగబా నా దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు. నాకు ఎందుకో ఇరవై ఏడేళ్ల క్రిందట సుధీర్‌తో జరిగిన ఒక విషయం జ్ఞప్తికి వచ్చింది. మేమిద్దరం రిక్షాలో కూర్చున్నాం.నేను అనుకోకుండా వాడిని చూశా. ఆశ్చర్యమేసింది. వీడి మొహం మీద లేతదనం, పసితనం పోయింది. పెదవులపైన నలుపు వచ్చింది. నాకు కొత్తగా గుర్తుకొచ్చినట్లనిపించింది. వచ్చే సంవత్సరమే వీడు పదకొండవ క్లాసు పరీక్షకి కూర్చుంటాడు. నాలోని తల్లి హృదయం సంతోషంతో నిట్టూర్చింది. వాడు బట్టల విషయం అంతగా పట్టించుకోవడం లేదు. వాడు పొడుగు ప్యాంటూ, పొడుగు చేతుల షర్టూ వేసుకున్నాడు. చాలా పొడుగ్గా కూడా అయ్యాడు.యథాలాపంగా ప్రతీ సంవత్సరం ఈ పుస్తకాలు కొనే ప్రక్రియ గుర్తుకొచ్చింది. పోయిన ఏడాది నేనే వెళ్లి రిక్షా తెచ్చాను. వాడి చేతులు పట్టుకుని ముందు వాడిని రిక్షాలో కూర్చోబెట్టి, ఆ తరువాత వాడి చేతుల ఆధారంగా నేను రిక్షాలో కూర్చున్నాను.

ఈ ఆలోచనల్లో మునిగివుండగా, రిక్షా పుస్తకాల షాపు ముందు ఆగింది. మేమిద్దరం రిక్షా దిగి, డబ్బులిచ్చి, షాపులోకి వెళ్లాం. ఏం పుస్తకాలు తీసుకోవాలా అని నేను పరికిస్తున్నాను. ఇంతలోనే నిఖిల్‌ షాపు యజమానికి నాలుగైదు చక్కటి పుస్తకాల పేర్లు చెప్పాడు – అవి కావాలని. నిఖిల్‌ ఫటాఫట్‌ పుస్తకాలు ఏరుతున్నాడు. ఇప్పుడు వాడికి ఇదివరకటిలాగ భూత, ప్రేత, పిశాచ కథలూ, రాజా–రాణీ కథలూ అక్కరలేదు. వాటిని ముట్టనయినా ముట్టలేదు. రెండు మూడు వైజ్ఞానిక కథలుండే పుస్తకాలు తీసి పక్కన పెట్టాడు. అవి రాసింది వాడి అభిమాన రచయిత అట!ఆ తరువాత వాడు మహిళల కోసం రాసిన పుస్తకాలున్న ర్యాక్‌ దగ్గరికి వెళ్లాడు. నేను వాణ్ని పరీక్షగా చూస్తూ వెంబడించాను. ఎన్నో పుస్తకాలు వెతికి, చివరికి ఒక పుస్తకం తీశాడు. అది తీసి నా చేతిలో వుంచి,‘‘అమ్మా! ఇది నీకోసం నా కానుక’’ అన్నాడు.నేను పుస్తకం పేరు చదివి, పేజీలు తిరగేశాను. నలభై సంవత్సరాలు దాటిన మహిళల మానసిక సమస్యలూ – వాటి సమాధానాలూ శాస్త్రీయ దృక్పథంతో సులభశైలిలో సామాన్య స్త్రీలకోసం రాసిన పుస్తకం అట. నేను ప్రశంసాపూర్వకంగా ఆ పుస్తకం రెండు చేతుల్తోటీ తీసుకొని గుండెలకి హత్తుకున్నాను. ఇంతలో వాడు మరో పుస్తకం తీసి నా చేతుల్లో వుంచి ‘‘ఇది నాన్నగారికోసం’’ అన్నాడు. తీసిన పుస్తకాల ధరలు వాడు పరీక్షగా చూస్తున్నాడు. ఆ తరువాత పుస్తకాలన్నీ కౌంటర్‌దగ్గర దొంతరగా పెట్టాడు. షాపువాడు బిల్లు తయారుచేయసాగాడు. బిల్లు డబ్బులు నిఖిలే ఇచ్చాడు. నేను వూరికే నిల్చున్నాను.

మేమిద్దరం దుకాణం నుంచి బయటకొచ్చాం. ఎప్పుడూ వెళ్లే హోటల్‌కి వెళ్లాం. వాడికిష్టమైన ఐస్‌క్రీమ్‌ అడగాలని నేను అనుకున్నాను. నేను నోరు విప్పేలోగానే, నిఖిల్‌ ఆర్డర్‌ ఇచ్చాడు. ‘‘అమ్మా! నిన్ననే మిగిలిన స్కాలర్‌షిప్‌ డబ్బులు వచ్చాయి. అందుకనే ఈసారి పుస్తకాల డబ్బు నేనే ఇచ్చాను.’’ నాకు కళ్లనీళ్లు ఉప్పెనలా వచ్చాయి. చెప్పలేనంత ఆశ్చర్యంతో నిఖిల్‌కేసి చూశాను – ‘‘ఎంత త్వరగా ఎంత పెద్దవాడయ్యాడూ!?’’ అని.‘‘అరే! ఎంత పెద్దవాడవయ్యావురా నువ్వు. ఇన్ని రోజులూ నేను గమనించలేదెందుకనీ?’’ ఎందుకో ఈ మాటలు మనస్సులోనే వుండిపోయాయి. బయటపడలేదు. నేను తాపీగా బటాటా వడ తింటూ కూర్చున్నాను.బస్టాప్‌కు వచ్చాం. అక్కడ చాలా రద్దీగా వుంది. జనంతో కిటకిటలాడుతూన్న బస్సు వచ్చింది. నిఖిల్‌ నన్ను ముందు ఎక్కించాడు. తరువాత తనూ ఎక్కాడు. నా చుట్టూ చేతుల్తో కోటకట్టినట్లు నిలబడ్డాడు. నాకు ఏ విధంగానూ ఇబ్బంది కలక్కుండా వుండేలా జాగ్రత్తపడ్డాడు.అకస్మాత్తుగా నా మనస్సులో బరువు తగ్గినట్లనిపించింది. మా స్టాపు రాగానే దిగాము. నడుస్తూ, నడుస్తూ నిఖిల్‌ అడిగాడు –‘‘అమ్మా! నాన్న ఎప్పుడు తిరిగివస్తాడూ?’’‘‘ఆయన అమెరికాలో వుండవలసిన కాలం మరో నాలుగు నెలలు పెంచారట.’’‘‘ఐతే అమ్మా.. ఇలా చేద్దాం.. మనమే నాయనమ్మను డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్దాం. నాన్న వచ్చేవరకూ ఆగవద్దు. ఇవ్వాళే డాక్టరుగారి అపాయింట్‌మెంట్‌ తీసుకుంటాను. నేనే నాయనమ్మని డాక్టరు దగ్గరకు తీసుకెళ్తాను. నాన్నగారి స్కూటర్‌ సరిగ్గా స్టార్ట్‌ అవడం లేదు. నిన్ననే చూశా. దాన్ని గ్యారేజ్‌కి ఇస్తాను – బాగుచేయడానికి’’‘‘అరే, నీకు స్కూటర్‌ నడపటం రాదు కదరా?’’ నేను చటుక్కున అడిగాను.‘‘ఏంటమ్మా అలా అంటావు? నేనే నడిపి మెకానిక్‌ దగ్గరకు వెళ్లాలా? వాడికి చెప్పి ఇంటికి పిలవ్వొచ్చుకదా!? అలాగే ఇంటికి రంగు వేయడం విషయం చూద్దాం. నాన్న వచ్చే సరికి అంతా కొత్తగా, ఎంచక్కా కనిపించాలి.’’ నిఖిల్‌ నాలాగా నాన్చకుండా, తండ్రిలాగే త్వరత్వరగా నిర్ణయాలు తీసుకొంటున్నాడు. నా మనస్సు బెంగలన్నీ మాయమయి శాంతించింది. హమ్మయ్య! వీడు ఎదిగొచ్చాడు!రాత్రి నిర్మల హృదయంతో సుధీర్‌కి నీలం రంగు ఉత్తరం రాశా.‘‘సుధీర్‌! సావకాశంగా నీ థీసిస్‌ పూర్తి చేసి సంపూర్ణ యశస్సుతో స్వదేశానికి లాభంగా తిరిగిరా. నాలుగు నెలలేం పెద్ద సమస్యకాదు. కాలం ఇట్టే గడిచిపోతుంది..’’

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top