తనను తాను గెలిపించుకుంది

Pranjal Patil First Blind IAS Officer Takes Charge As Sub Collector - Sakshi

తనకు తీపిని పంచిన వాళ్లెవ్వరినీ నేరుగా చూడలేదు ప్రాంజల్‌. మనోనేత్రంతో మాత్రమే ఆ అభిమానాన్ని ఆస్వాదించింది. అదే నేత్రంతో ప్రజల సమస్యలను ఆకళింపు చేసుకుని చక్కటి పాలనను అందించగలుగుతుందనే నమ్మకాన్ని కూడా కలిగిస్తోంది. చూపు లేకపోవడం లక్ష్యాన్ని సాధించడానికి అడ్డంకి కాదని నిరూపించిన ముప్పై ఏళ్ల ప్రాంజల్‌ పాటిల్‌.. తొలి ‘విజువల్లీ చాలెంజ్‌డ్‌’ ఉమన్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌గా  కొత్త రికార్డును సృష్టించింది!

ప్రాంజల్‌ పాటిల్‌.. 2016లో యూపీఎస్‌సీ రాసింది. 773వ ర్యాంకు తెచ్చుకుంది. ర్యాంకు ఆధారంగా ఆమెకు ఇండియన్‌ రైల్వేస్‌లో అకౌంట్స్‌ సర్వీస్‌లో ఉద్యోగం రావాలి. ఆ ఉద్యోగంలో చేరడానికి ఏ అడ్డంకీ వచ్చి ఉండకపోయి ఉంటే ఎలా ఉండేదో తెలియదు. ఆమె కూడా జీవితంతో రాజీ పడిపోయి ఉండేదేమో! కానీ ఆ ఉద్యోగానికి కాంపిటీటివ్‌ ఎగ్జామ్‌లో ర్యాంకు ఒక్కటే సరిపోలేదు. చూపు కూడా కావలసి వచ్చింది. అప్పుడు ప్రాంజల్‌... ‘‘నా అసలు టార్గెట్‌ ఇది కాదు, కాబట్టి మీరు ఈ ఉద్యోగం ఇవ్వనక్కర్లేదు’’ అని మళ్లీ ఎగ్జామ్‌కి ప్రిపేరైంది. తర్వాతి ఏడాది 124వ ర్యాంకు తెచ్చుకుంది. అప్పుడు జాతీయ స్థాయిలో మీడియా సంస్థలన్నీ ఆమెను సంభ్రమంగా చూశాయి. ఐఏఎస్‌ ఆఫీసర్‌ కాబోతున్న యువతిగా దేశానికి పరిచయం చేశాయి.

ప్రతి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలోనూ అమ్మాయిలు విజయకేతనం ఎగుర వేస్తూనే ఉన్నారు. వాళ్లను జాతి సగర్వంగా గుర్తు చేసుకుంటూనే ఉంది. అమ్మాయిని ఇంకా ప్రత్యేకంగా, మరికొంత ప్రేమగా గుర్తు చేసుకున్నది. మొదట ప్రాంజల్‌కి కేరళ కేడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌గా ఎర్నాకుళంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పోస్టింగ్‌ వచ్చింది. ముస్సోరిలో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు తాజాగా త్రివేండ్రంలో సబ్‌కలెక్టర్‌గా సోమవారం నాడు రాట్నం వడుకుతున్న గాంధీజీ చిత్రపటం సాక్షిగా పూర్తి స్థాయిలో విధుల్లో చేరారామె. తిరువనంతపురం కలెక్టరేట్‌లోని ఉద్యోగులు ప్రాంజల్‌ను భావోద్వేగాలతో స్వాగతించారు, అభినందనల్లో ముంచెత్తారు. తమ ఇంటి పాపాయికి పుట్టిన రోజు పండుగ చేసి కేక్‌ తినిపించినంత ప్రేమగా స్వీట్లు తినిపించారు.

ఓటమి దరి చేరదు
‘‘ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా మన లక్ష్యాన్ని వదులుకోకూడదు. అప్పుడు జీవితంలో ఓడిపోవడం అనేది ఉండదు. మన లక్ష్యం మీద మనం పెట్టిన శ్రద్ధ, శ్రమతోనే మనం అనుకున్నది సాధించి తీరుతాం. ఓడిపోయాం... ఓడిపోతామేమో... అనే భావనలే మనల్ని ఓటమిలోకి నెట్టేస్తాయి. అలాంటి భావనలను మనసులోకి రానివ్వకూడదు’’ అని బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చిరునవ్వుతో చెప్పారు ప్రాంజల్‌. గత ఏడాది సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన క్షణాలను, తనను ఆత్మీయంగా అక్కున చేర్చుకున్న సహోద్యోగులను మర్చిపోలేనని చెబుతూ... ఈ కొత్త ఉద్యోగంలో ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తానని అన్నారు.

జీవితంలో ప్రతి సందర్భాన్ని సానుకూలంగా స్వీకరించే ప్రాంజల్‌ రెండు సందర్భాలను ఎప్పటికీ మర్చిపోలేనని ఎప్పుడూ చెబుతుంటారు. ఒకటి చిన్నప్పుడు ఆపరేషన్‌లతో కలిగిన బాధ, రెండవది రైల్వే ఉద్యోగానికి అంధత్వం కారణంగా తనను దూరం పెట్టడం. ‘‘ఒకటి శారీరకంగా బాధకలిగించిన సంఘటన అయితే మరొకటి మనసును మెలిపెట్టిన సంఘటన’’ అని చెప్తుంటారామె. మధ్యప్రదేశ్‌కు చెందిన కృష్ణ గోపాల్‌ తివారీ తొలి విజువల్లీ చాలెంజ్‌డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌. సర్వేంద్రియాల్లో కళ్లు అత్యంత ప్రధానమైనవే. అయినప్పటికీ కంటిచూపు లేకపోవడం మాత్రం దేనికీ అవరోధం కాదని నిరూపించారాయన. ఆయన బాట ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు అదే బాటను మరింతగా విస్తరించిన మరో స్ఫూర్తిప్రదాయిని ప్రాంజల్‌.
– మంజీర

దృఢమైన వ్యక్తిత్వం
ప్రాంజల్‌ పాటిల్‌ది మహారాష్ట్రలోని ఉల్లాస్‌ నగర్‌. ఆరేళ్ల వయసులో కంటిచూపును కోల్పోయింది. కూతురికి తిరిగి చూపు తెప్పించడానికి ఆపరేషన్‌ల మీద ఆపరేషన్‌లు చేయించారు ఆమె తల్లిదండ్రులు. ఒక్కటీ విజయవంతం కాలేదు. అన్ని ఫెయిల్యూర్స్‌ నుంచి తనకు తానుగా ఎదిగింది ప్రాంజల్‌. కమలామెహతా దాదర్‌ బ్లైండ్‌ స్కూల్‌లో చదువుకుంది. తర్వాత ముంబయిలోని సెయింట్‌ జేవియర్స్‌ కాలేజ్‌లో పొలిటికల్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసింది. ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసింది.

‘‘ప్రాంజల్‌ చాలా నిబద్ధత కలిగిన విద్యార్థి. కాలేజ్‌లో జరిగే స్పెషల్‌ లెక్చర్స్‌కు కూడా అందరికంటే ముందే వచ్చేది.డిబేట్‌లలో అనర్గళంగా మాట్లాడేది. ఒక విషయం మీద తన అభిప్రాయాన్ని సున్నితంగా, చాలా స్పష్టంగా, ఎదుటి వాళ్లు కన్విన్స్‌ అయ్యేలా చెప్పడం ప్రాంజల్‌ ప్రత్యేకత. సమస్య వచ్చినప్పుడు జారిపోకుండా నిలబడగలిగిన దృఢమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి’’ అని ప్రాంజల్‌ గురించి ఆమె స్నేహితురాలు సరస్వతి చెప్పింది. ప్రాంజల్, సరస్వతి ఇద్దరూ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top