అడవి కాచిన వన్నెలు

Paintings By 80 Year Old Tribal Woman From Madhya Pradesh  - Sakshi

విశ్వ వేదిక

అడవి కాచిన వెన్నెల అడవికే పరిమితం అవుతుంది. డేబ్భయ్‌ ఏళ్ల వయసులో ఈ గిరిపుత్రిక నేర్చుకున్నచిత్రలేఖనం మాత్రం విశ్వ విధిలో కాంతులు విరజిమ్ముతోంది. ఖండాంతర ఖ్యాతిని సముపార్జిస్తోంది.

పుట్టినప్పటి నుంచి డెబ్బై ఏళ్ల వరకు జీవించిందామె. అన్నేళ్లలో తనకు చెప్పుకోవడానికంటూ ఏ ప్రత్యేకతా లేదు. మధ్యప్రదేశ్‌లోని ‘లోరా’ అనే మారుమూల గిరిజన గ్రామం ఆమెది. భర్త, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. అడవిలో దొరికే పనులతో బతుకు వెళ్లదీసింది. ఆమెకు నలబై ఏళ్ల వయసులో భర్త పోయాడు. ముగ్గురు పిల్లల్ని ఒక ఇంటి వాళ్లను చేసే బాధ్యత ఆమె భుజాల మీద పడింది. భర్త వదిలి వెళ్లిన ఆ బాధ్యతలను పూర్తి చేసిందామె. అయితే డెబ్బై ఏళ్ల వయసులో ఆమె జీవితం ఆమెకు కూడా తెలియకుండా ఊహించని మలుపు తిరిగింది! ఇప్పుడామెకి ఎనబై ఏళ్లు.

ఈ పదేళ్లలో ఆమె అంతర్జాతీయ స్థాయి చిత్రకారిణి అయింది! రాష్ట్రం దాటి బయటకు రాని జీవితం ఆమెది. ఆమె వేసిన బొమ్మలు ఖండాంతరాలు దాటి ఇప్పుడు పారిస్‌లోనూ, ఇటలీలోని మిలన్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌లోనూ ప్రఖ్యాత చిత్రకారుల చిత్రాల వరుసలో స్థానం సంపాదించుకున్నాయి. ప్రైజులు కూడా గెలుచుకున్నాయి. దేశంలో అనేక ఆర్ట్‌ గ్యాలరీలలో అంతకంటే ముందునుంచే ప్రదర్శితమవుతున్నాయి. ఈ ఎనబై ఏళ్ల చిత్రకారిణి పేరు జుధైయా బాయ్‌ బైగా. ‘‘పెయింటింగ్‌ నన్ను మరొక ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అక్కడ నేను స్వేచ్ఛావిహంగాన్ని’’ అంటోంది బైగా. ఆమె అంటున్నట్లే ఆకాశమే హద్దుగా తన కుంచె శక్తితో మేధా యుక్తితో సృజనాత్మక లోకంలో విహరిస్తోందామె.

జీవితమే థీమ్‌
బైగా కి బొమ్మలు వేయడానికి థీమ్‌ గురించి మేధామథనం చేయాల్సిన అవసరమే ఉండదు. తన చుట్టూ కనిపించే సామాన్య గిరిజన జీవితాన్నే కాన్వాస్‌ మీదకు తెస్తుంది. గిరిజన సంప్రదాయ జీవనశైలికి ప్రతిబింబాలవి. ఒక్కో బొమ్మకు మూడు వందల నుంచి ఎనిమిది వేల వరకు ధర పలుకుతోంది. గ్రామస్థులు ఆమె ధరిస్తున్న రంగురంగుల కొత్త దుస్తులను చూస్తూ ‘‘బైగా అవ్వ జీవితం రంగులమయం అయింది’’ అని చమత్కరిస్తున్నారు. ‘‘ఆమె నుంచి నేర్చుకోవలసింది డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదు. డెబ్బై ఏళ్ల వయసులో చిత్రలేఖనం నేర్చుకోవడానికి ముందుకు రావడమే’’నన్నారు ఆషిశ్‌ స్వామి.

అడవి బిడ్డలకే సొంతం
బెంగాల్‌కు చెందిన ఆషిశ్‌ ప్రముఖ చిత్రకారుడు, శాంతినికేతన్‌ విద్యార్థి. ఆషిశ్‌ తన ఆర్ట్‌ స్టూడియో ‘జన్‌గాన్‌ తస్వీర్‌ఖానా’లో ప్రదర్శన కోసం  మధ్యప్రదేశ్‌లోని గిరిజన గ్రామాలను సందర్శిస్తూ పదేళ్ల కిందట లోరా  వచ్చాడు. ఉచితంగా చిత్రలేఖనం నేర్పిస్తున్నాడని తెలియడంతో పదిహేను మంది మహిళలు నేర్చుకోవడానికి వచ్చారు. డెబ్బై ఏళ్ల బైగా కూడా. ‘‘కుంచె పట్టుకున్న తొలిరోజు నుంచే ఆమె దీక్షతో బొమ్మలు వేసింది. ఒకటి వేసిన తర్వాత మరింకేదో కొత్తగా వేయాలనే తపన కూడా కనిపించేదామెలో.

శిక్షణ తీసుకున్న నాగరిక చిత్రకారులకు సాధ్యం కానిది, అడవి బిడ్డలకు మాత్రమే ఒంటపట్టే మెళకువ ఒకటుంది. వాళ్లు అడవిలో సంచరించే జంతువుల కళ్లలోని భావాన్ని ఇట్టే పసిగట్టేస్తారు. బైగా ఆ భావాన్ని బొమ్మలోకి పట్టుకొస్తుంది’’ అన్నాడు ఆషిశ్‌ స్వామి. ‘నేర్చుకోవడానికి వయసు అడ్డంకి కాదు’ అని ఇప్పటికే ఎందరో నిరూపించారు. జుధైయా బాయ్‌ బైగా మరోసారి నిరూపించింది, తన కుగ్రామం లోరా పేరును ప్రపంచస్థాయి వేదికల మీదకు తీసుకెళ్లింది.
– మంజీర

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top