మగధీరుడు | Madhav Singaraju Article On 2019 Hollywood Movies | Sakshi
Sakshi News home page

మగధీరుడు

Dec 30 2019 12:03 AM | Updated on Dec 30 2019 4:57 AM

Madhav Singaraju Article On 2019 Hollywood Movies - Sakshi

తమకేం కావాలో స్త్రీలకు ఉన్నంత స్పష్టత పురుషులకు లేకపోవడం వల్ల  స్త్రీలకేం కావాలన్న విషయమై పురుషులెప్పుడూ అస్పష్టంగానే ఉంటారు. హాలీవుడ్‌ ఈ పాయింట్‌ని పట్టుకుని పురుషుడిని పూర్తిగా ఉద్వేగ ప్రాణిని చేసి అతడి మగధీరత్వంపై సందేహాలు రాజేసింది. లేదా అతడిని పరిపూర్ణ మానవుడిగా చూపే ప్రయత్నమైనా కావచ్చది!

మాధవ్‌ శింగరాజు
మగవాళ్ల ప్రపంచం వేరుగా ఉంటుంది. ‘మగ ప్రపంచం’ అంటూ ఒకటి ఉన్నా లేకున్నా అలాంటిదొకటి ఉంటుందని అనుకునేలా పుట్టుక నుంచి మగవాళ్లు ఉంటుంటారు కనుక.. ఎప్పుడైనా మగవాళ్లు, ఎందుకైనా మగవాళ్లు ఆ మగ ప్రపంచంలో కనిపించకపోతే మగవాళ్లలా అనిపించరు. అప్పుడు ‘పాపం’ అనిపిస్తుంది. ‘పాపం మగాళ్లు’ అని! సమాజం మీద పడి దౌర్జన్యంతో సహాయాలు పొంది జీవిస్తుండే స్వార్థపరుౖ న మానవుడు హటాత్తుగా ‘నేను మీకు సహాయపడగలనా?’ అని అదే సమాజం మీద పడి అడుగుతూ పోతుంటే కలిగే ఆశ్చర్యం నుంచి జనించే ‘పాపం’ అనే భావన అది. ‘ఆడవాళ్లకేం కావాలి?’ అనే ప్రశ్న వేసుకుని, సమాధానం కోసం జీవితమంతా అన్వేషించి, అన్వేషణ పూర్తిగా ఫలించకనే అసువులు బాసిన సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ ఆ ప్రశ్నేదో అడవాళ్లనే అడిగి ఉంటే ఆయన్ని వాళ్లు కొంతలో కొంతైనా సంతృప్తిగా సాగనంపేవారు.. ఆయనకు అర్థం అవగలిగినంత అర్థం చేయించి! తమకేం కావాలో స్త్రీలకు ఉన్నంత స్పష్టత పురుషులకు లేకపోవడం వల్ల స్త్రీలకేం కావాలన్న విషయమై పురుషులెప్పుడూ అస్పష్టంగానే ఉంటారు.

‘ఆడవాళ్లకేం కావాలి?’ అని కాకుండా.. ‘మగవాళ్లకేం కావాలి?’ అని ఫ్రాయిడ్‌ తవ్వకాలు జరపకపోవడానికి.. మగవాళ్లకు ఏం కావాలన్నదానిపై తనకొక స్పష్టత ఉన్నట్లు ఆయన పొరపడి ఉండటం ఒక కారణం అయి ఉండొచ్చు.  మగవాళ్లకు అధికారం కావాలి. అనుకున్నది సాధించడం కావాలి. అవసరం లేనంత డబ్బు కావాలి. ఆడవాళ్లు కావాలి. గుండె నిండా పీల్చి వదలడానికి ఒక సిగరెట్‌ కావాలి. దూకుడుగా పరుగులెత్తించడానికి కారు కావాలి. ఎవరి ముక్కునైనా బద్దలు కొట్టడం కావాలి. తనొక హీరో కావడం కావాలి. తననే అందరూ చూడటం కావాలి. తనను ‘మగాడు’ అనడం కావాలి. తేలికా మరి మగాడు మగాడిలా ఉండటం? కావచ్చేమో. మగాడిలా ఉన్న మగాడు ఎప్పటికీ మగాడిగా ఉండిపోవడం మీదే సందేహాలన్నీ! చక్రాల కుర్చీలో చంకల కింది కర్రల్ని ఒళ్లో పెట్టుకుని కూర్చొని ఉన్నాడు అతడు. ఖరీదైన చిన్న చీకటి గది. ఒంటరితనానికి ఫ్లోర్‌ ల్యాంప్, పాతకాలం టీవీ, టీపాయ్, కొక్కేల స్టాండు, మరొక కుర్చీ.. వీటిని అమరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ గది.

పశ్చాత్తాపానికి వస్తురూపం ఉండదు కనుక అదొక్కటీ కనిపించడం లేదు. ‘‘క్రిస్మస్సా ఈరోజు’’.. అడిగాడు అతడు. ‘సండేనా ఈరోజు’, ‘మండేనా ఈరోజు’ అన్నట్లు అడిగాడు. పాపం అనిపిస్తుంది అతడు ఆ మాట అడుగుతుంటే. ఒకనాటి నేర సామ్రాజ్యపు చక్రవర్తి చక్రాల కుర్చీకి పరిమితమై కాలస్పృహ లోపించి.. రాబోయే క్రిస్మస్‌ కోసమో, వచ్చిపోయిన క్రిస్మస్‌ కోసమో ఎదురు చూస్తూ ఉండటం.. తన కోసం వచ్చిపోతుండే ప్రీస్ట్‌కి  ఎలాంటి భావమూ కలిగించదు. ‘‘మళ్లెప్పుడొస్తారు?’’ అని అడుగుతాడు ప్రీస్ట్‌ని. ‘‘క్రిస్మస్‌ తర్వాత’’ అంటాడు ఆయన, తలుపును దగ్గరగా వేసి వెళ్లబోతూ. ‘‘పూర్తిగా వెయ్యకుండా కాస్త తెరిచి ఉంచండి’’ అని ఆయన్ని కోరుతాడు అతడు. లోపల తనంటూ ఒక వ్యక్తిని ఉన్నానని లోకానికి తెలియడం కోసం కావచ్చు. ‘ది ఐరిష్‌మ్యాన్‌’ చిత్రంలోని చివరి సన్నివేశం ఇది. మగాడిలా బతికిన ఫ్రాంక్‌ షీరన్‌.. చివరి దశలో మనిషి చూపు కోసం, మనిషి స్పర్శ కోసం బతుకు ఈడుస్తుంటాడు కన్ఫెషన్‌ బాక్స్‌ లాంటి ఆ గదిలో.

‘మ్యారేజ్‌ స్టోరీ’ చిత్రంలోని చార్లీది కూడా అటూఇటుగా ఫ్రాంక్‌ షీరన్‌ పరిస్థితే. ఫ్రాంక్‌ని వదిలి అతడి కుటుంబం దూరంగా వెళ్లిపోతే, చార్లీ నుంచి దూరంగా వెళ్లిపోడానికి చార్లీ భార్య నికోల్‌ కట్టుబట్టల్తో ప్రతిరోజు, ప్రతి నిముషం సిద్ధంగా ఉంటుంది. చార్లీ ఆమెను వెళ్లనివ్వడు. ‘నువ్వు, హెన్రీ లేకుండా నేను బతకలేను’ అంటాడు. మగాడేనా అనిపిస్తుంది. మగాళ్లేమిటి ఇలా తయారయ్యారనిపిస్తుంది. ‘పోతే పో.. నువ్వే ఎప్పటికైనా నా కాళ్ల  దగ్గరికి వస్తావ్‌.. దిక్కులేని దానిలా..’ అనాలి కదా మనకు తెలిసినంత వరకు మగాడంటే. అనడు. కొడుకు హెన్రీని దగ్గరకు లాక్కుంటాడు. కొడుకును చార్లీ చేతుల్లోంచి లాక్కుని వేరే వెళ్లిపోతుంది నికోల్‌. తనకంటూ ఓ జీవితం లేకుండా చేశాడని భర్త మీద ఆమె కంప్లయింట్‌. ఎప్పుడూ తన కెరీర్‌నే చూసుకుంటాడు. తన కెరీర్‌ గురించే చెబుతుంటాడు. ఆమెకూ ఓ కెరీర్‌ ఉందని, ఆ కెరీర్‌లోనూ కొన్ని విశేషాలు ఉంటాయని, వాటిని వినేందుకు తను శ్రద్ధ చూపాలని అనుకోడు. ఆమె నటి. అతడు రంగస్థల దర్శకుడు.

చుట్టూ అమ్మాయిలు. వాళ్లలో ఓ అమ్మాయితో అఫైర్‌ ఉందని కూడా ఆమె అనుమానం. మొత్తానికి విడిపోతారు. చివర్లో మళ్లీ కలుసుకుంటారు. అదీ చార్లీ ప్రయత్నం వల్లనే. గదిలోకి రాగానే ఇద్దరే ఉన్నప్పుడు ఆమె కాళ్లను గట్టిగా పట్టేసుకుంటాడు చార్లీ.. వదిలితే మళ్లీ ఎక్కడ వెళ్లిపోతుందో అన్నంత గట్టిగా.. అభద్రతగా. మగాళ్ల దృష్టిలో ఇది పరువుపోయే ‘లొంగుబాటు’ లేదా ‘కృంగుబాటు’. మనోహ్లా దర్గీస్‌ మాత్రం దీనిని.. మగవాళ్లు బరువును దించుకోవడం అంటున్నారు. ఫిల్మ్‌ క్రిటిక్‌ ఆవిడ. ఏముంటుంది ఈ మగాళ్లపైన దించుకునేంత బరువు! భార్యా పిల్లల్ని పట్టించుకోకుండా పెద్ద మగాళ్లలా సమాజాన్ని ఉద్ధరించడమేగా? అవును.. అదే బరువు. మాస్క్యులినిటీని (మగధీరత్వాన్ని) మోయవలసిన బరువు.

హాలీవుడ్‌ ఇప్పుడు తమ కథానాయకుల నుంచి ఆ బరువును దింపే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఒక్క హీరోను కూడా ఫుల్‌ లెంగ్త్‌ హీరోగా చూపించలేదు హాలీవుడ్‌! నువ్వు మగాడివైతే కావచ్చు. మనిషిని మించినవాడివైతే కాదు అని చెప్పడమా ఇది? కావచ్చు. మనిషనే ప్రాణికి ఉద్వేగాలు తప్పనప్పుడు ఎంత మగాడైతే మాత్రం ఉద్వేగాలనుంచి తప్పించుకోగలడా? ఫ్రోజన్‌ 2, యాడ్‌ ఆస్ట్రా, ఎ బ్యూటిఫుల్‌ డే ఇన్‌ ది నైబర్‌హుడ్, ట్రిపుల్‌ ఫాంటియర్, 1917, ది కిచెన్, హస్లర్స్, వన్సపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌.. ఈ చిత్రాలన్నిటిలోనూ పురుషుడు హాఫ్‌ బేక్డ్‌గానే కనిపించడంపై మనోహ్లా న్యూయార్క్‌ టైమ్స్‌లో మంచి ఇయర్‌ ఎండింగ్‌ రివ్యూ రాశారు.

మంచి అంటే సెన్సిబిల్‌ రివ్యూ. మగాళ్లకేదో తక్కువైంది అనకుండా.. వాళ్లింకా ఏదో (మగతనాన్ని మించినది) ఎక్కువగా కోరుకుంటున్నారని రాశారు. ఊరికే కోరుకోవడం కాదు. పడి చావడం! భార్యతో, తల్లిదండ్రులతో, తోబుట్టువులతో, స్నేహితులతో.. అనుబంధాల కోసం, ఆత్మీయతల కోసం దాహ పడడం. అది ఈ సినిమాల్లో కనిపిస్తుంది. ‘ది ఐరిష్‌మ్యాన్‌’ థియేటర్‌లలో ఆడుతున్నప్పుడు బోర్‌ కొట్టి ప్రేక్షకులు మధ్యలోనే లేచి వెళ్లిపోయారట. బోర్‌ కొట్టే ఎందుకు అనుకోవాలి. సినిమా చూస్తున్నప్పుడు ఏ సన్నివేశంలోనో మనసు లోపలి ‘స్ట్రింగ్‌’ కదిలి, బోరున ఏడ్వడానికి వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఉండొచ్చు కదా. లేదా సిగరెట్‌ తాగుతూ ఏ ఒంటరితనం లోనికో.. రెండు నిముషాల పాటు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement