పొలం ఎడారవుతోంది!

The land was dried up and became deserted. - Sakshi

తెలంగాణ రాష్ట్రంలో 31.34% భూమి పడావు పడి ఎడారిగా మారింది.   ఆంధ్రప్రదేశ్‌లో 14.35%పంట భూమి ఎడారిగా మారింది.భూమికి ఎటువంటి ఆచ్ఛాదనా లేక వర్షాలకు భూమి పైపొర కొట్టుకుపోవటం, చెట్టు చేమ నశించటం ఇందుకు మూల కారణాలు.

సాగులో ఉన్న పొలాలు జీవాన్ని కోల్పోతున్నాయి. పంట పొలాలు క్రమంగా గడ్డి కూడా మొలవని ఎడారైపోతున్నాయి. నీటి వనరులు బొత్తిగా లోపించి, పచ్చదనం, జీవరాశి కనుమరుగైన భూమి ఎడారిగా మారినట్లు లెక్క. ప్రపంచవ్యాప్తంగా 33% పంట భూములు ఇప్పటికే ఎడారిగా మారాయి. మన దేశంలో 32.87 కోట్ల హెక్టార్ల పొలం ఉంటే.. ఇందులో 9 కోట్ల 64 లక్షల హెక్టార్ల భూమి పంటల సాగుకు ఎంతమాత్రం పనికిరాకుండా పోయిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2003–05 నుంచి 2011–13 మధ్యకాలంలోనే 18 లక్షల 70 వేల హెక్టార్ల భూమి పంటలకు పనికిరాకుండా పోయింది.

► భూమి ఎడారిగా మారటానికి అనేక కారణాలున్నాయి. గత ఏడాది ‘ఇస్రో’ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మన దేశంలో 1.12% సాగు భూములు, ముఖ్యంగా సాగు నీటి సదుపాయం ఉన్న డెల్టా భూములు, చౌడుబారిపోయాయి. రసాయనిక ఎరువులు అతిగా వాడటం వల్ల లేదా పర్యావరణ సమస్యల కారణంగా నేలపైకి లవణాలు ఎక్కువగా చేరటమే ఇందుకు కారణం.?

► వాన నీటి కోత కారణంగా సుమారు 11% భూమి ఎడారిగా మారుతున్నది.

► అడవుల నరికివేత, పోడు వ్యవసాయం, చెట్టు చేమను అతిగా కొట్టివేయటం వంటి పనుల వల్ల సుమారు 9 శాతం భూమి ఎడారిగా మారుతున్నది.

► తీవ్రమైన గాలుల వల్ల భూమి పైపొర గాలికి కొట్టుకుపోవటం, ఇసుక తెన్నెలు ఇతర ప్రాంతాల్లోకి వచ్చి పడటం వల్ల సుమారు 5.55% భూమి జీవాన్ని కోల్పోతున్నది.

► పచ్చని పంట భూములను విచక్షణారహితంగా నివాసప్రాంతాలుగా మార్చటం, గనుల తవ్వకానికి వాడటం వల్ల సుమారు 1% భూమి సాగుకు దూరమవుతున్నది. ఇతర కారణాలతో మరో 2% భూమి ఎడారి అవుతున్నది.

► 2030 నాటికి కొత్తగా సెంటు భూమి కూడా ఎడారిగా మారకుండా చేయగలగాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా నిర్దేశించింది. అయినా.. దీన్ని అడ్డుకోవటంలో దేశాలు విఫలమవుతుండటం విషాదకర వాస్తవం.

► యుద్ధప్రాతిపదికన ప్రతి పొలంలో 50 మీటర్లకు ఒక చోట వాలుకు అడ్డంగా కందకాలు తవ్వటం.. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతులను, మొక్కలు నాటే కార్యక్రమాలను ప్రోత్సహించటం ద్వారా ఎడారీకరణను, నీటి కరువును 5 ఏళ్లలో అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
– సాగుబడి డెస్క్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top