తుషార కేవలం 20 కిలోల బరువే ఉంది!

Kerala woman starved death deep shock - Sakshi

కోడలి చావు

కిరోసిన్‌ పోసి నిప్పంటించడం, ఫ్యానుకు ఉరి బిగించడం... కట్నం హత్యలలో చాలా జరిగాయి. కాని కేరళలో అన్నం పెట్టకుండా కోడలిని చంపిన ఘటన మనుషులుగా మనం ఎంత పతనమయ్యామో తెలియచేస్తోంది. రెండు లక్షలు ఇవ్వలేకపోయారు తుషార తల్లిదండ్రులు. వారు కేరళలోని కొళ్లం సమీపంలో ఒక పల్లెలో ఉంటారు. తమ కుమార్తె తుషారను దాపున ఉండే ఇంకో పల్లెలో ఇచ్చి పెళ్లిచేశారు. కట్నం మూడు లక్షలు. కొన్నినగలు ఇస్తామన్నారు. నగలు ఇచ్చి, లక్ష రూపాయలు ఇచ్చి పెళ్లి చేశారు. ఇంకా రెండు లక్షలు బాకీ. తల తాకట్టు పెట్టయినా ఆ బాకీ చెల్లిస్తామని చెప్పారు. పెళ్లి 2013లో జరిగింది. కాని తుషార తల్లిదండ్రులు నిరుపేదలు. కూతురుని ఇల్లు దాటించగలిగారు గానీ తిరిగి ఆమె ఇంటికి వచ్చేస్తే మోయలేరు. అన్నం పెట్టలేరు. కట్నం బాకీ ఉంది కనుక అల్లుడికి ఎదురు పడలేరు. అత్తగారింటికి వెళ్లి కూతురు ఎలా ఉందో చూసి రాలేరు. డబ్బు ఒక ఇంటి ఆడకూతురు ఎలా ఉందో ఎలా బతుకుతుందో తెలుసుకోలేని దౌర్భాగ్యాన్ని తెచ్చిపెట్టింది. కట్నం ఇవ్వలేదని తుషార భర్త చందులాల్, అత్త గీతా లాల్‌ తుషారను ఇంటి బయటకు అడుగు పెట్టనివ్వలేదు. చందులాల్‌ ఏవో కుదురు లేని పనులు చేసేవాడు. తల్లీ కొడుకులకు తాంత్రిక విద్యల పిచ్చి ఉంది. ఇరుగు పొరుగూ అభ్యంతరాలకు వారు ఆ పల్లె విడిచి మరో పల్లెకు వెళ్లిపోయారు. ఎక్కడ కాపురం పెట్టిందీ తుషార తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు. తుషారకు ఇద్దరుపిల్లలు పుట్టారు. రెండో పిల్లాడి వయసు ఒకటిన్నర సంవత్సరాలు.

తుషార తన సజావు కాపురానికి రుసుముగా తక్కిన కట్నం చెల్లించలేకపోయింది. కన్నవారు ఆ కట్నం ఇవ్వలేకపోయారు. కనుక ఆమె అత్తారింటిలో దారుణ హింసను ఎదుర్కొంది. భర్త కొట్టేవాడు. నాలుగు వారాలుగా ఆమెకు తిండి పెట్టడం మానేశారు. కొంచెం చక్కెర నీళ్లు, నానిన బియ్యం ఆహారంగా పడేసేవారు. ఆ స్థితిలో కూడా ఆమె రెండో పిల్లాడికి పాలిచ్చేది. తుషార రోజురోజుకూ కృశించిపోయింది. మార్చి 21న ఆమె చనిపోయింది. పోలీసులు అనుమానాస్పద మరణంగా భావించారు. కాని శవాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. తుషార కేవలం 20 కిలోల బరువు ఉంది. తిండికి మాడి మాడి శరీరం బలహీన పడి ఆమె మరణించింది.

కేరళలో ప్రస్తుతం ఈ కేసు గగ్గోలుగా ఉంది. జాతీయ మహిళా కమిషన్‌ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఇంత ఘోరం జరుగుతుంటే పోలీసులు, ఇరుగుపొరుగు ఏం చేస్తున్నారన్నదానికి సమాజంలోని మానవ సంబంధాల నిమిత్తమాత్రత కారణంగా చెప్పుకోవాల్సి వస్తోంది. ఇద్దరు పిల్లల ఆ కన్నతల్లి 27 ఏళ్ల వయసుకే జీవితాన్ని ముగించింది. ఉలిక్కి పడటం, శోకించడమా ఇప్పుడు చేయవలసింది? మన ఇరుగుపొరుగులో ఏ కోడలైనా ఇలాంటి నిశ్శబ్ద హింస అనుభవిస్తూ ఉంటే మనం జోక్యం చేసుకోగలుగుతున్నామా లేదా చూసుకోవాలి. మన ఇంటికోడలు ఎంత ఆనందంగా ఉందో  గమనించుకోగలగాలి. అత్తింటివారు హద్దుకు మించి ఇబ్బంది పెడుతూ ఉంటే మొదట చట్టాన్ని ఆశ్రయించగలగాలి. ఇవన్నీ ఒక స్త్రీ ఈ సమాజంలో బతకడానికి. తల్లిగా, కోడలిగా, భార్యగా బతకడానికి.  నానిన బియ్యం తిని గొంతు బిగుసుకుపోయి శరీరం బలహీనపడిపోయి తుషార చేసిన ఆర్తనాదాల ఉసురు దేశాన్ని కమ్ముకోవడం మంచిది కాదు. మార్పుకు మనం కారణం కావాలి. అది మన నుంచి కూడా మొదలు కావాలి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top