
లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురైన మహిళలు వారు ఎదుర్కొన్న ‘భయానక పరిస్థితి’ గురించి తలుచుకొని లోలోన కుమిలిపోకుండా గొంతెత్తి మాట్లాడాలి. సమాజం ఏమనుకుంటుందో అన్న భయం వీడాలి. ఇంట్లోవాళ్లు, బంధువులు ‘ఎవరికీ చెప్పొద్దు’ అన్నా, వారి మాటలు విని ఆగిపోవద్దు. ఆడదానిపై కర్కశత్వాన్ని, కామాన్ని ప్రదర్శించిన ఆ మగాడికి శిక్షపడాలి. సమాజం ఆ మృగాణ్ణి ఛీకొట్టాలి. దాని కోసమైనా నీవు మాట్లాడాలి. ధైర్యంగా నిలబడాలి. ఇదే లక్ష్యంతో రాష్ట్రీయ గరీమా అభియాన్ ‘డిగ్నిటీ మార్చ్’కు శ్రీకారం చుట్టింది. గత ఏడాది డిసెంబర్ 28 ముంబైలో ప్రారంభమైన ‘డిగ్నిటీ మార్చ్ 65 రోజుల్లో 24 రాష్ట్రాలు, 200 జిల్లాల మీదుగా సాగి వేలమంది బాధిత మహిళలను కలిసింది.
వెళ్లిన ప్రతిచోట స్థానికంగా గృహహింస, దాడులకు గురవుతున్న మహిళలకు అండగా నిలిస్తున్న స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అఘాయిత్యాలకు గురైన బాధితులు గొంతెత్తి మృగాడిలా మీదపడ్డ మగాడిని ఎదురొడ్డి నిలబడేలా చైతన్యం కలిగిస్తూ వచ్చింది. అలా ‘సర్వైవర్స్’ ధైర్యంగా సమాజం గీసిన సరిహద్దులను చెరిపి ‘చూడాల్సింది నన్ను కాదు ఆ మృగాణ్ణి’ అంటూ గొంతెత్తేలా వారిలో చైతన్యం కలిగించింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా సాగిన డిగ్నిటీ మార్చ్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘భూమికా విమెన్స్ కలెక్టివ్’ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్, వికారాబాద్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిలో చైతన్య కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. అలా ముంబైనుంచి ప్రారంభమైన ఆ చైతన్యం 24 రాష్ట్రాలు చుట్టి శుక్రవారం ఢిల్లీ చేరేవరకు సుమారు 5,000 మంది సర్వైవర్స్‌ను ముందుకు నడిపింది.
చిన్నచూపు తగదు...
సమాజంలో అత్యాచారానికి గురైన మహిళలపై చిన్నచూపు తగదు. నేరం చేసిన వారు సిగ్గుపడాలి. కానీ ఏ తప్పు చేయని బాధితులు కాదు. అత్యాచారాలకు, వేధింపులకు గురైన మహిళలు బయటకొచ్చి మాట్లాడాలి. న్యాయ పోరాటం చేసి సర్వైవ్ కావాలి అని చెబుతున్న భూమిక విమెన్స్ కలెక్టివ్స్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది.
(‘భూమికా విమెన్స్ కలెక్టివ్’ సంస్థ నిర్వాహకులు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ సర్వైవర్స్‌కు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ‘డిగ్నిటీ మార్చ్’ ఇటీవల ఢిల్లీ చేరుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు.)
జావీద్ బాషా, సాక్షి న్యూఢిల్లీ