రాయలసీమ కపిల పదాలు

Badige Umesh Special Article On Rayalaseema Slang Words - Sakshi

ప్రత్యేక వ్యాసం 

రైతులు గతంలో పొలాలకు బావులలో నుండి కపిలతో నీటిని తోడేవారు. ఈ సాధనం ఎద్దులతో నడిచేది. దీన్ని ‘కపిల లేదా కపిలి’ అని రాయలసీమలో అంటారు. కోస్తా, తెలంగాణల్లో ‘మోట’ అంటారు. ఈ పని తొలి జామున ప్రారంభమై, మధ్యాహ్నం వరకూ కొనసాగేది. పనిలో కష్టం మరిచి పోవడానికి రైతులు పదాలు పాడేవారు. వీటినే కపిల పదాలు అంటారు. 

తెలుగు సాహిత్యంలో కపిల పదాల్ని మొదటిసారిగా సేకరించిన గౌరవం బళ్ళారి జిల్లాలో ఉన్నత పదవి నిర్వహించిన పాశ్చాత్యుడు జె.ఎ.బోయెల్‌కు దక్కింది. తర్వాత తూమాటి దొణప్ప, ఎస్‌.గంగప్ప, ఘట్టమరాజు అశ్వత్థనారాయణ, చిగిచెర్ల కృష్ణారెడ్డి, దస్తగిరి మొదలైన విద్వాంసులు వీటిని సేకరించారు. ఇవి ఎవరు చెప్పారో తెలియదు. ఇవి తాలూకా తాలుకాకు మారుతుంటాయి. అత్తమామలు, బావ మరదళ్లు మొదలైన మానవ సంబంధాలు, పండగలు, జాతర్లు, వేడుకలు ఇందులో కనబడతాయి. కపిల తోలే సందర్భంలో గంగమ్మ తల్లిని ‘బాయి బాయి గంగమ్మ తల్లికీ ఆకు వక్క నాను బాలు/ మా బాయి గంగమ్మ తల్లికి పొసుపు కుంకం పోగు నూలు’ అని ప్రార్థిస్తారు. పుష్కలంగా నీళ్ళు వచ్చేలా దీవించమని కోరుకుంటారు. ఉదయాన్నే కపిల తోలడానికి వెళ్ళేటప్పుడు కష్టాలు ఎదురవకుండా కాపాడమనే పదం: ‘పొద్దున్నే లేవల్లా రామున్ని తలవల్ల/ వచ్చిన్ని గండాలు వారు కావల్ల’. రైతులకు పశువుల మీద అమితమైన ప్రేమ ఉండేదనడానికి నిదర్శనమైన పదాలు ఆకర్షణగా నిలుస్తాయి.

‘కుడి కోలు రాముగాడు ఎడమ కోలు భీముగాడు/ అవి రెండు తోలెటోడు సన్నమల్లెల సొగసు గాడు’. రామాయణ, భారతాలు పల్లె ప్రజల జీవితాల్లో మమేకమైనాయనడానికి ఇది చక్కని ఉదాహరణ. మనుషుల భావాలు ఎడ్లకు అర్థమవుతాయనడానికి చిహ్నమైన పదం: ‘సాతివాన సందు మబ్బు ఎట్ల పోతావు మూగి బసవా/ సన్నిసైగల్‌ (బారు సంగతి) నాకు తెలుసు బాగుతోలుర కాపు కొడక’. సాతివాన అంటే చిమ్మ చీకటి. స్వాతికార్తిలో ఎక్కువ మబ్బులు కమ్మేవి. పైగా ఉదయం మూడు గంటల సమయం. మరి నీవు ఎలా వెళతావు ఓ మూగి బసవా? అని అడిగితే, ‘సన్నిసైగలు (తెలివి తేటలు) నాకు తెలుసు గానీ, నీవు జాగ్రత్తగా కపిల తోలురా రైతుబిడ్డా అని అవి సమాధానం చెబుతాయట.

‘‘ముంగారి దినమెచ్చా కోగిలేమో కూయలేదు/ కాకులు కడగాన పోతే కోకిల కొమ్మెక్కె కూసే’. ముంగారి దినం అంటే వర్షాకాలం. ఆ సందర్భంలో కోయిల రాగాలు వినపడనప్పుడు ఎందుకు కోయిల కూయలేదని రైతులు అనుకుంటారు. కాని చెట్లల్లో కాకులు ఉండేది చూసి కోయిల కూయదు. ఎప్పుడైతే కాకులు చెట్ల నుండి బయటికి పోతాయో అప్పుడు కూస్తుంది. ఆ కూత విని రైతులు పొలాలకు వెళ్ళేవారు. స్వాతికార్తి, చిత్తకార్తి మొదలైన కాలాల మార్పులను తెలుసుకోవడానికి రైతులు ఆయా సంకేతాల్ని వినియోగించుకునేవారు. 

కపిల తోలడానికి వెళ్ళేవారు తమకు ఇష్టమైన ఆహారం తెమ్మని భార్యలకు గుర్తు చేసేవారు. ‘వరి కూడు సద్ది కట్టూ వంకాయ బజ్జి నూరు/ మరి కుండ కొండ్రావే మన కపిలి దంకా’. వరి(ముండ్లొడ్లు)తో చేసిన సంగటి, వంకాయతో నూరిన పచ్చడి ఎంతో రుచికరం. పని చేసి అలసిపోయిన రైతులు ఇష్టంగా భుజించి, కొద్ది సేపు చెట్ల కింద సేద తీరుతారు. ఇది అసలైన పల్లె జీవితం, అల్ప సంతోషి జీవన విధానం. కపిల పదాల్లో ఎక్కువగా శృంగారం కనబడుతుంది. ఇది కూడా ఔచిత్యంగా, లౌక్యంగా ఉంటుంది. ‘కపిలి తోలే చిన్నవాన్నీ ఏమి చూసి తెగులు కుందు/ కురుకురు మీసాలు చూసి కుచ్చూలు శలకోలువాన్ని’. పొలం పనులు చేయడానికి ఆడవాళ్ళు వస్తారు. వారికి ఉన్న ఆలోచనను ఈ కపిల తోలే చిన్నోడే ఒక పదం ద్వారా చమత్కారంగా వ్యక్తం చేయడం జరిగింది. 

‘అడ్డు బొట్టు పెట్టు కోన అన్న మడిగ నేను బోతే/ అది చూసే చూపులోన అడ్డు బొట్టు అన్నమాయా’. అడ్డు బొట్టు పెట్టుకున్న పడతి దగ్గరికి అన్న మడగడానికి వెళితే, అది చూసే చూపులకే ఆ అడ్డు బొట్టు కాస్త అన్నమై పోయిందని రమణీయంగా చెప్పడం! ఎక్కువ సేపు పనిచేస్తే బాయిలో నీళ్ళు తగ్గిపోతాయి. పని చేసేవారూ అలసిపోతారు. ఒంటిలో సత్తువ తగ్గిపోవడం వల్లా చేస్తున్న పనిని ఆపాల్సి వస్తుంది. నీళ్ళు సమయానికి లేక పోతే పంటెండి పోతుందనే భయం. ఇదంతా ఈ పదంలో ఉంటుంది. ‘బాయిలోన నీళ్ళు లేవూ కావిడెద్దులెక్కిరావు/ కపిలి తోలే చిన్న వాణ్ణి కాలు చేతులెంటరావు’. తెల్లవారు జామున మొదలైన కపిల మధ్యాహ్నం ముగుస్తుంది. ‘పోతివి గంగమ్మా పాతాళ లోపలికి/ పొద్దిన్నె వస్తాము పై కెళ్ళి రావమ్మ’ అంటూ మంగళం పాడుతారు. ఇలాంటి పదాలు రాయలసీమంతా ఎన్నో ఉన్నాయి. మా గ్రామంలో (అనంతపురం జిల్లా చింతర్లపల్లి) బడిగె హనుమంతప్ప, పాపన్న, శెట్టూరు హనుమంతప్ప, కరియన్న మొదలైన వారి ద్వారా నేను సుమారు రెండు వందల పదాల్ని సేకరించాను. కొన్ని వందల యేళ్ల రైతుల సాంస్కృతిక జీవనానికి ఈ కపిల పదాలు దర్పణంగా నిలుస్తాయి.
డా‘‘ బడిగె ఉమేశ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top