అమెరికాలో అనిశ్చితి!

America Facing Problems With Donald Trump Decisions - Sakshi

పట్టువిడుపుల్లేని తీరుతో అమెరికాను ఇబ్బందులపాలు చేస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ దేశాధ్యక్షుడై ఆది వారం నాటికి రెండేళ్లు పూర్తయింది. ఆయన నిర్ణయాలు సాధారణ పౌరులకు ఎంత సంకటంగా మారుతున్నాయో చెప్పడానికన్నట్టు గత నెల రోజులుగా అమెరికా ప్రభుత్వం పాక్షికంగా మూత బడింది. ఎప్పటికి పరిష్కారమవుతుందో ఎవరూ చెప్పలేని స్థితి ఏర్పడింది. ప్రభుత్వంలో ఉండే మొత్తం 15 విభాగాల్లో వాణిజ్యం, వ్యవసాయం, రవాణా, న్యాయ, ఆంతరంగిక భద్రత తదితర 9 విభాగాలు ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఈ విభాగాల్లో పనిచేస్తున్న 8 లక్షలమంది సిబ్బంది అయోమయావస్థలో పడ్డారు. వీరిలో చాలామందికి ఆయా విభాగాల అధిపతులు ‘వేతనా లివ్వలేం. ఉద్యోగానికి రావొద్దు’ అని వర్తమానం పంపారు. కేవలం అత్యవసర సేవలందించడానికి అవసరమైన సిబ్బందికి మాత్రమే మినహాయింపు లభించింది. ఈ రకం సేవలందించేవారికైనా వేత నాలు లభించవు. అంతా చక్కబడ్డాకైనా వస్తాయో, రావో తెలియదు. అయితే పని లేకపోవడంతో పోలిస్తే ఇది కాస్త మెరుగని వారు సంతృప్తిపడాల్సి ఉంటుంది. ఉన్నట్టుండి రోడ్డున పడిన సిబ్బంది, వారి కుటుంబాల పరిస్థితేమిటన్న ఇంగిత జ్ఞానం ట్రంప్‌ సర్కారుకు ఉండటం లేదు. 

అమెరికాలోని అనేకచోట్ల వేలాదిమంది ప్రభుత్వ సిబ్బంది పూట గడవటం కోసం తాకట్టు వ్యాపారుల దగ్గర క్యూ కట్టారని సమాచారం అందుతోంది. వ్యాపార సంస్థలు, బ్యాంకులు పెద్ద మనసు చేసుకుని ప్రభుత్వ సిబ్బంది చెల్లించాల్సిన బకాయిల వసూళ్లను వాయిదా వేసుకుంటున్నామని ప్రకటించాయి. కొన్ని ధార్మిక సంస్థలు ఫుడ్‌ కూపన్లు అందిస్తున్నాయి. కానీ ఎన్నాళ్లని ఇలాంటి సంస్థల దయాదాక్షిణ్యాల మీద సిబ్బంది ఆధారపడతారు? వ్యాపార సంస్థలు ఎన్నాళ్లపాటు మినహాయింపులిస్తాయి? ఈ మాదిరి సంక్షోభాలు అమెరికాలో గతంలోనూ తలెత్తాయి. కానీ ఏ సంక్షోభమూ ఇంత సుదీర్ఘకాలంపాటు కొనసాగలేదు. విధానపరమైన విభేదాలు తలెత్తినప్పుడల్లా ప్రభుత్వ వ్యయానికి సంబంధించిన బిల్లుల్ని, బడ్జెట్‌లనూ ఆపేయడం అక్కడ రివాజు. పర్యవసానంగా కొన్ని రోజు లపాటు సర్కారీ విభాగాలు మూతబడటం కొత్తేమీ కాదు. 1976 నుంచి ఇంతవరకూ 21 సంద ర్భాల్లో అలా జరిగింది. కానీ ఇప్పుడు తలెత్తిన వివాదం విధానపరమైనది కాదు. దేశానికి దక్షిణం వైపున్న మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టి తీరాలని ట్రంప్‌ భీష్మించుకుని కూర్చోవడంతో తాజా సమస్య తలెత్తింది. ఆ గోడ నిర్మాణం ప్రారంభించడానికి అవసరమైన 570 కోట్ల డాలర్ల సొమ్ము తక్షణం కేటాయించాలన్నది ఆయన డిమాండ్‌.

అధికారంలోకొచ్చినప్పటి నుంచి ఈ గోడ కోసం ఆయన పలవరిస్తూనే ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు డెమొక్రాట్లు దానికి అడ్డుపడుతూ వచ్చారు. ప్రభుత్వ బిల్లులను ఆమోదింపజేసుకోవడం కోసం పాలక రిపబ్లికన్‌ పార్టీ  రాజీ పడకతప్పడంలేదు. కానీ ఈసారి అమీతుమీ తేల్చుకోవాలని ట్రంప్‌ నిర్ణయించారు. బిల్లుల్ని అడ్డుకుని సర్కారు పాక్షి కంగా మూతబడటానికి కారకులయ్యారన్న నింద డెమొక్రాట్లపై పడుతుందని, ప్రజల ఛీత్కారాలతో వారు గత్యంతరంలేక దారికొస్తారని ఆయన అంచనా వేశారు. ఆరేళ్లక్రితం బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిజానికి ఇలాంటి స్థితే ఏర్పడింది. మన ‘ఆరోగ్యశ్రీ’ని పోలిన ఆరోగ్య బీమాను ఒప్పుకునేది లేదని అప్పట్లో రిపబ్లికన్లు మంకుపట్టు పట్టారు. దాదాపు 4 కోట్లమంది పేదలకు ప్రయోజనం చేకూరే ఆ బిల్లును ఆపేయమని వారు కోరారు. కోట్లాదిమంది పన్నుల ద్వారా చెల్లించే సొమ్మును ఇలా కొందరి ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వం ఎందుకు చెల్లించాలన్నది వారి ప్రశ్న. కానీ సామాన్య జనం రిపబ్లికన్ల తీరును ఏవగించుకున్నారు. 16 రోజులు గడిచాక చివరకు వారే రాజీకొచ్చి ప్రభుత్వ బిల్లులకు ఆమోదం తెలపక తప్పలేదు. ఇప్పుడు డెమొక్రాట్లు కూడా అదేవిధంగా దారికి రాకతప్పదని ట్రంప్‌ భావన.

అందుకే కనీసం డెమొక్రాట్ల వద్దకు రాయబారం పంపి వారికి నచ్చజెప్పేందుకు కూడా ప్రయత్నించలేదు. పైగా గోడ నిర్మాణానికి ఒప్పుకుంటే సరిహద్దుల్లో వలసదారుల్ని అడ్డగించిన కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు 80 కోట్ల డాలర్లు కేటాయిస్తానని, వలసవచ్చినవారికి తాత్కాలికంగా మూడేళ్లపాటు వర్తించేవిధంగా ఆశ్రయం కల్పిస్తానని బహిరంగ ప్రకటన చేశారు. అయితే ఆయన ఈ ప్రతిపాదన బహిరంగంగా చేసేముందు డెమొక్రాట్లతో రాజీ చర్చలు జరిపి ఉంటే వేరుగా ఉండేది. వారు అదనంగా మరికొన్ని రాయితీలు కోరి, ఆయన ప్రతిపాదనకు ఒప్పుకునేవారేమో! కానీ ఈ బహిరంగ ప్రకటన తర్వాత పరిస్థితి మారింది. ఇదే స్థితి మరికొన్నాళ్లు కొనసాగిస్తే ఆయన పూర్తిగా దిగిరాక తప్పదన్న నమ్మకం డెమొక్రాట్లలో ఏర్పడింది. అటు వలస వచ్చినవారి విషయంలో ట్రంప్‌ విధానాలను గట్టిగా సమర్థిçస్తున్నవారు ఆయన తాజా ప్రతిపాదన తమకు సమ్మతం కాదం టున్నారు. ఏతావాతా డెమొక్రాట్లను ఇరకాటంలో పడేయాలనుకున్న ట్రంప్‌ తానే ఇరుక్కు పోయారు. ప్రభుత్వం మూతపడ్డాక నిర్వహించిన సర్వేల్లో ఆయనకున్న మద్దతు తగ్గినట్టు వెల్లడి కాగా, తాజా ప్రతిపాదనతో అది మరింత క్షీణించిందని కొత్త సర్వేలు చాటుతున్నాయి.
 
ఈ మాదిరి సంక్షోభం ప్రపంచంలో మరే దేశంలోనూ కనబడదు. చాలా దేశాలు ద్రవ్య విని మయ బిల్లు ఆమోదం పొందకపోయిన సందర్భాలు తలెత్తినా ప్రభుత్వ కార్యకలాపాలు యధా విధిగా కొనసాగించే ఏర్పాట్లు చేసుకున్నాయి. మన దేశంలో అధికార, విపక్షాల మధ్య ఎన్ని విభేదాలున్నా బడ్జెట్‌ ఆమోదం విషయంలో పట్టుదలకు పోవు. ఆస్ట్రేలియాలో బడ్జెట్‌ ఆమోదం పొందని స్థితి ఏర్పడిందంటే దాన్ని పార్లమెంటు వైఫల్యంగా పరిగణిస్తారు. అలాంటి పరిస్థితి తలెత్తితే రాజ్యాంగం ప్రకారం అక్కడి పార్లమెంటు రద్దవుతుంది. అమెరికాలో ఏడాది వ్యవధిలో సర్కారు మూతబడటం ఇది మూడోసారి. పాలకులుగా ఉన్నవారు పట్టువిడుపుల ధోరణి ప్రదర్శిం చాలి తప్ప లక్షలాది కుటుంబాలను ఇలా అనిశ్చితిలోకి నెట్టకూడదని ట్రంప్‌ గుర్తించాలి. ఈ సంక్షో భానికి సాధ్యమైనంత త్వరగా తెరదించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top