అడ్డాకుల: జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులకు టోల్‌చార్జీల చెల్లింపుల నుంచి కొంతఊరట లభించనుంది. టోల్‌గేట్ వద్ద వాహనాల నుంచి వసూలు చేసే చార్జీలను స్వల్పంగా తగ్గిస్తూ రోడ్డు నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాహనాల రకాలను బట్టి టోల్‌గేట్ చార్జీలను రూ.1నుంచి రూ.2 తగ్గించారు. రోజువారీ రాకపోకలతో పాటు నెలవారి పాస్‌ల చార్జీలను కొంతమేర తగ్గించారు. వాహనరకాలను బట్టి రూ.8 నుంచి రూ.43 వరకు తగ్గింది. కొత్తచార్జీలు బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇప్పటివరకు ఐదుసార్లు చార్జీలను పెంచగా వరుసగా రెండోసారి స్వల్పంగా తగ్గించారు. తద్వారా రోజుకు 10నుంచి 15వేల వాహనదారులకు కొంత ఊరట కలగనుంది. వచ్చే ఏడాది 31 అర్ధరాత్రి వరకు ఈ చార్జీలు అమల్లో ఉంటాయి. జడ్చర్ల నుంచి కొత్తకోట వరకు జాతీయ రహదారి నిర్వహణకు ఎల్‌అండ్‌టీ, ఐడీపీఎల్, వెస్ట్రన్ ఆంధ్రా టోల్‌వేస్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2009లో అడ్డాకుల మండలం శాఖాపూర్ వద్ద టోల్‌గేట్‌ను ప్రారంభించగా ఏటా ఆగస్టు 31అర్ధరాత్రి తర్వాత సవరించిన కొత్తచార్జీలను వసూలు చేస్తున్నారు.
బస్సుల్లో తగ్గని ‘టోల్’చార్జీలు
రెండోసారి టోల్‌చార్జీలు తగ్గిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల నుంచి వసూలు చేసే టోల్‌గేట్ టికెట్ ధరలను ఆర్టీసీ సంస్థ తగ్గిస్తుందా? లేదా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. గతేడాది చార్జీలు తగ్గినప్పుడు బస్సుల్లో ప్రయాణించేవారికి ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. మరి ఈసారి కూడా నెలవారి పాస్‌లను రూ.8 నుంచి రూ.43 వరకు తగ్గించారు. అయితే రోజువారీగా రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులకు అధికారులు నెలవారీ పాస్‌లు తీసుకుంటారు. ఈ చార్జీలు తగ్గినందున బస్‌చార్జీల్లో మార్పులు ఉంటాయా? లేదా? అన్నది వేచిచూడాలి.
సవరించిన చార్జీలు(రోజువారీగా రానుపోను రూ.ల్లో)
వాహన రకం పాతచార్జీ కొత్తచార్జీ
కారు, జీపు, వ్యాను 56–84 56–84
డీసీఎం,మినీబస్సు 98–147 97–146
లారీ, బస్సు 196–294 195–292
భారీ వాహనాలు 315–472 313–470
సవరించిన నెలవారీ పాస్‌చార్జీలు(రూ.ల్లో)
వాహన రకం – నెలకు పాతచార్జీ – కొత్త చార్జీ
కారు, జీపు, వ్యాను 1679 –1671
డీసీఎం, మినీబస్సు 2938 –2925
లారీ, బస్సు 5876 –5850
భారీ వాహనాలు 9444 –9401
అరకొర సౌకర్యాలు.. నిత్యం ప్రమాదాలు
– 2009 నుంచీ 44వ జాతీయ రహదారిపై శాఖాపూర్ వద్ద టోల్‌చార్జీలు వసూలు చేస్తున్నా వాహనదారులకు ఇంకా సరైన సౌకర్యాలు కల్పించడం లేదు.
– రోడ్డు నిర్మాణం ప్రారంభించిన నాటినుంచి చాలాచోట్ల సర్వీస్‌రోడ్లను పూర్తిచేయలేదు.
– రోడ్డు డివైడర్ ఎత్తు కూడా కొంత తగ్గడంతో వాహనాలు సులువుగా పక్కరోడ్డు మీదకు దూసుకెళ్లి తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
– కల్వర్టుల వద్ద సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారాయి.
– హైవేపై ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలపడం..స్టేజీలకు దూరంగా నిర్మించిన బస్‌షెల్టర్లు ప్రయాణికులకు ఎంతమాత్రం ఉపయోగపడడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.