వేరుశనగలో సూక్ష్మపోషకాల లోపం | Sakshi
Sakshi News home page

వేరుశనగలో సూక్ష్మపోషకాల లోపం

Published Fri, Dec 9 2016 11:25 PM

వేరుశనగలో సూక్ష్మపోషకాల లోపం - Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌ : రబీ పంటగా నీటి వసతి కింద జిల్లా వ్యాప్తంగా 18 నుంచి 20 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగయ్యే వేరుశనగలో సూక్ష్మపోషకాల (మైక్రోన్యూట్రియంట్స్‌) లోపం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని కళ్యాణదుర్గం కృషి విజ్ఞానకేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్‌ తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు విత్తుకునేందుకు మంచి సమయమన్నారు. నీటిలో నాణ్యతా ప్రమాణాలు లోపించడం, నీటి తడులు సక్రమంగా పాటించకపోవడం వల్ల సాధారణంగా సూక్ష్మధాతులోపాలు ఏర్పడుతాయని తెలిపారు.

సూక్ష్మధాతులోపం–నివారణ :
+  కాల్షియం లోపం ఏర్పడితే కాయలపై ఉన్న పొట్టు సరిగా అభివృద్ధి కాదు. కాయలు లొత్తగా మారుతాయి. గంధకం లోపం ఏర్పడితే ఆకులు లేత పసుపుపచ్చగా తయారై ఈనెలు కూడా పసుపురంగులోకి మారుతాయి. నూనె శాతం తగ్గిపోతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఎకరాకు 200 కిలోల జిప్సం ఎరువును తొలిపూత సమయంలో వేయాలి. కలుపుతీసిన తరువాత మొక్కల మొదళ్ల దగ్గర సాళ్లలో వేసి తరువాత మట్టి ఎగదోయాలి.
+ ఇనుప ధాతులోపం ఏర్పడితే లేత ఆకులు పసుపుపచ్చగా తయారై తరువాత తెలుపురంగులోకి మారుతాయి. నివారణకు ఎకరాకు ఒక కిలో అన్నభేది + 200 గ్రాములు సిట్రిక్‌ ఆమ్లాన్ని 200 లీటర్ల నీటికి కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
+ బోరాన్‌ లోపం ఏర్పడితే గింజ లోపలి భాగం నల్లగా మారుతుంది. నివారణకు 1 గ్రాము బోరిక్‌ ఆమ్లం లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేయాలి.  
+ జింక్‌ధాతు లోపం కనిపించిన ప్రాంతాల్లో పైరు ఆకులు చిన్నవిగా మారి గుబురుగా కనిపిస్తాయి. మొక్కల గిడసబారతాయి. ఆకు ఈనెల మధ్యభాగం పసుపురంగులోకి మారవచ్చు. నివారణకు ఎకరాకు 400 గ్రాముల చొప్పున జింక్‌సల్ఫేట్‌ 200 లీటర్ల నీటికి కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. 

Advertisement
Advertisement