‘బేర్‌’ బాజా!

Sensex crashes 787 points, Nifty falls below 11,000 - Sakshi

11,000 దిగువకు నిఫ్టీ

ఫెడ్‌ పావు శాతం రేట్ల కోత

భవిష్యత్తులో రేట్ల కోత ఉండదన్న ఫెడ్‌

ప్రపంచ మార్కెట్ల పతనం

పెరిగిన ద్రవ్యలోటు

తరిగిన రూపాయి

ఇంట్రాడేలో 787 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ 

చివరి గంటలో బ్లూచిప్‌ల్లో కొనుగోళ్లు

నష్టాలు ఒకింత రికవరీ

463 పాయింట్ల పతనంతో 37,018 వద్ద ముగిసిన సెన్సెక్స్‌   

138 పాయింట్ల నష్టంతో 10,938 వద్దకు నిఫ్టీ

ఈ ఏడాది మరో రేట్ల తగ్గింపు లేదని, ప్రస్తుత రేట్ల తగ్గింపు ‘తగ్గింపు సైకిల్‌’కు ఆరంభంగా పరిగణించకూడదని  అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సంకేతాలివ్వడంతో గురువారం మన స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమైంది. కీలక పరిశ్రమలు, ద్రవ్యలోటు, వాహన విక్రయాల గణాంకాలు, కంపెనీల క్యూ1 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం ప్రతికూల ప్రభావం చూపించాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 41 పైసలు పతనం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. 

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 11,000 పాయింట్ల దిగువకు పతనమైంది. 138 పాయింట్ల నష్టంతో 10,980 వద్ద ముగిసింది. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 463 పాయింట్లు క్షీణించి 37,018 పాయింట్ల వద్దకు చేరింది. ఈ ఏడాది మార్చి తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు ఈ స్థాయిలకు పడిపోవడం ఇదే మొదటిసారి. ఈ రెండు సూచీలకు ఇది దాదాపు ఐదు నెలల కనిష్ట స్థాయి. ముడి చమురు ధరలు చెప్పుకోదగిన స్థాయిలో పడిపోయినా, మన మార్కెట్‌ పతనం ఆగలేదు. అయితే చివర్లో కొన్ని బ్లూచిప్‌ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో నష్టాలు ఒకింత రికవరీ అయ్యాయి.  

సెన్సెక్స్‌ 787 పాయింట్లు డౌన్‌...
ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్‌ నష్టాల్లోనే ఆరంభమైంది. రోజులు గడుస్తున్న కొద్దీ నష్టాలు అంతకంతకూ పెరిగాయి. ఎన్‌ఎస్‌ఈ వీక్లీ ఆప్షన్ల ముగింపు కారణంగా మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌787 పాయింట్లు, నిఫ్టీ 204 పాయింట్ల వరకూ నష్టపోయాయి. ట్రేడింగ్‌ చివరి గంటలో కొంత నష్టాల రికవరీ జరిగింది. ఇంధన, వాహన షేర్లు లాభపడటంతో నష్టాలు తగ్గాయి. మారుతీ సుజుకీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, హిందుస్తాన్‌ యూని లివర్‌ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఈ రికవరీ కారణంగా సెన్సెక్స్‌ 37,000 పాయింట్లు, నిఫ్టీ 10,900 పాయింట్లపైన ముగియగలిగాయి. నికాయ్‌ మినహా ఇతర ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.  

మరిన్ని విశేషాలు...
► వేదాంత షేర్‌ 5.5% నష్టంతో రూ.145 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  

► దాదాపు 600కు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఐషర్‌ మోటార్స్, బ్లూడార్ట్, ఎౖMð్స డ్‌ ఇండస్ట్రీస్, వీఎస్‌టీ టిల్లర్స్, కేర్‌ రేటింగ్స్, ఎస్కార్ట్స్, ఆర్తి ఇండస్ట్రీస్, వేదాంత, టాటా మోటార్స్, హిదాల్కో, బయోకా న్, ఓకార్డ్, గెయిల్‌ ఇండియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా,  తదతర షేర్లు జాబితాలో ఉన్నాయి.  

► ఓపెన్‌హీమర్‌ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినప్పటికీ, జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ 4 శాతం మేర నష్టపోయి రూ.347 వద్ద ముగిసింది.  

► స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనంలోనూ 16 షేర్లు ఏడాది గరిష్ట స్థాయికి ఎగిశాయి. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్, గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్, వైభవ్‌ గ్లోబల్‌ ఈ జాబితాలో ఉన్నాయి.  

1.6 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాలతో రూ.1.6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.     బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.1.6 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.1,39,87,400 కోట్లకు తగ్గింది. తాజా బడ్జెట్‌ నుంచి చూస్తే, రూ.13.70 లక్షల కోట్లు సంపద ఆవిరైంది.

రెండు నెలల్లో 9 శాతం డౌన్‌
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఈ ఏడాది జూన్‌ 3న రికార్డ్‌ స్థాయి, 12,103 పాయింట్లను తాకింది. అప్పటి నుంచి కేవలం రెండు నెలల్లో 11,000 పాయింట్లకు (9%) పడిపోయింది. ఈ రెండు నెలల కాలంలో వాహన, బ్యాంక్, ఇంధన, మౌలిక, లోహ షేర్లు బాగా నష్టపోయాయి. ఇక నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 13%, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 16% చొప్పున క్షీణించాయి. అంతేకాకుండా నిఫ్టీ 500 సూచీలోని 300కు పైగా షేర్లు 50–90 శాతం రేంజ్‌లో పతనమయ్యాయి. కాక్స్‌ అండ్‌ కింగ్స్, జెట్‌ ఎయిర్‌వేస్, సింటెక్స్‌ ప్లాస్టిక్స్, రిలయన్స్‌ క్యాపిటల్, డీహెచ్‌ఎఫ్‌ఎల్, జైన్‌ ఇరిగేషన్‌ , రిలయన్స్‌ ఇన్‌ఫ్రా,  వొడాఫోన్‌ ఐడియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

పతనానికి కారణాలు ఇవీ....
► ఫెడ్‌ కామెంట్స్‌: అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్లను తగ్గించింది. దీంతో రేట్లు 2.0–2.25 శాతం రేంజ్‌లో ఉన్నాయి. పదేళ్ల తర్వాత తొలిసారిగా ఫెడ్‌ రేట్లను తగ్గించింది. అయితే ఈ తగ్గింపు, రేట్ల తగ్గింపు సైకిల్‌కు ఆరంభం కాదని ఫెడ్‌ చైర్మన్‌ జెరోమి పావెల్‌ వ్యాఖ్యానించారు. దీంతో సమీప భవిష్యత్తులో మరో రేట్ల పెంపు ఉండకపోవచ్చని ఫెడ్‌ సంకేతాలిచ్చినట్లయింది. ఇది మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది.  వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం అమెరికా–చైనాల మధ్య జరుగుతున్న తాజా చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగియడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది.  

► గణాంకాల నిరుత్సాహం: ఈ ఏడాది జూన్‌లో ఎనిమిదికీలక పరిశ్రమల వృద్ధి 0.2 శాతం తగ్గింది. సిమెంట్‌ ఉత్పత్తి, చమురు సంబంధిత రంగాల్లో మందగమనం చోటు చేసుకోవడం దీనికి కారణం. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో ద్రవ్యలోటు 61.4 శాతానికి (రూ.4.32 లక్షల కోట్లు) చేరింది. ఈ గణాంకాలు ఇన్వెస్టర్లలో నిరుత్సాహాన్ని నింపాయి.  

► ఉత్తేజాన్నివ్వని వాహన విక్రయాలు: ఈ ఏడాది జూన్‌లో వాహన విక్రయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని కంపెనీలు వెల్లడించిన గణాంకాలు పేర్కొన్నాయి.

► కొనసాగుతున్న విదేశీ నిధుల ఉపసంహరణ: సంపన్నులపై విధించిన అదనపు పన్ను భారం విదేశీ ఇన్వెస్టర్లకు కూడా వర్తిస్తుంది. ఈ పన్ను విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పలుమార్లు స్పష్టం చేయడంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. బడ్జెట్‌ నుంచి ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు 300 కోట్ల డాలర్ల మేర తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని అంచనా. మన స్టాక్‌ మార్కెట్‌ జోరుకు కీలకమైన విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండటంతో మార్కెట్‌లో నష్టాలు కొనసాగుతున్నాయి. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.16,870 కోట్ల మేర తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ ఏడాది ఇదే ఎఫ్‌పీఐల అత్యధిక పెట్టుబడుల ఉపసంహరణ.  సూపర్‌ రిచ్‌ పన్నుతో కినుక వహించిన విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. నిధుల ఉపసంహరణ కొనసాగుతుందని నిపుణులంటున్నారు.  

► రూపాయి పతనం: డాలర్‌తో రూపాయి మారకం విలువ 41 పైసలు నష్టపోయింది. రూపాయి  విలువ గురువారం నాటి ట్రేడింగ్‌లో ఒక దశలో 69.20కు పడిపోయింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top