ఎగసిన వాణిజ్య లోటు

April trade deficit at USD 15.33 bn - Sakshi

5 నెలల గరిష్టానికి చేరిక

ఏప్రిల్‌లో వృద్ధి 4 నెలల కనిష్టం

గణనీయంగా తగ్గిన ఎగుమతులు

4.5 శాతం పెరిగిన దిగుమతులు

భారీగా చమురు, పసిడి దిగుమతులు

న్యూఢిల్లీ: ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు, వజ్రాభరణాలు, లెదర్‌ ఉత్పత్తులు మొదలైన వాటి ఎగుమతులు గత నెల గణనీయంగా తగ్గాయి. దీంతో ఏప్రిల్‌లో ఎగుమతుల వృద్ధి 0.64 శాతానికి పరిమితమైంది. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. చివరిసారిగా 2018 డిసెంబర్‌లో ఎగుమతుల వృద్ధి అత్యల్పంగా 0.34 శాతంగా నమోదైంది. ఫలితంగా వాణిజ్య లోటు అయిదు నెలల గరిష్టానికి ఎగిసింది. బుధవారం విడుదలైన వాణిజ్య గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మరోవైపు దిగుమతులు 4.5 శాతం పెరిగాయి. ఇది గత ఆరు నెలల్లో అత్యధికం. క్రూడాయిల్, బంగారం దిగుమతులు గత నెలలో ఎగియడమే ఇందుకు కారణం. వ్యాపార ఉత్పత్తుల ఎగుమతులు ఏప్రిల్‌లో 26 బిలియన్లు ఉండగా.. దిగుమతుల పరిమాణం 41.4 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. దీంతో వాణిజ్య లోటు 15.33 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. 2018 నవంబర్‌ తర్వాత వాణిజ్య లోటు ఇంతలా పెరగడం ఇదే తొలిసారి.  

కీలక రంగాల తగ్గుదల..: ఇంజనీరింగ్, వజ్రాభరణాలు, లెదర్, కార్పెట్, ప్లాస్టిక్, మెరైన్‌ ఉత్పత్తులు, ధాన్యం, కాఫీ తదితర విభాగాల్లో ప్రతికూల వృద్ధి నమోదైంది. దీంతో వ్యాపార ఉత్పత్తుల ఎగుమతులు ఏప్రిల్‌లో తగ్గాయి.  చమురు దిగుమతులు 9.26 శాతం పెరిగి 11.38 బిలియన్‌ డాలర్లకు చేరాయి. చమురుయేతర దిగుమతులు 2.78 శాతం పెరిగాయి. బంగారం దిగుమతులు 54 శాతం ఎగిసి 3.97 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అయితే, తాజాగా పెట్రోలియం, చేతివృత్తులు, రెడీమేడ్‌ దుస్తులు, ఫార్మా రంగాల ఎగుమతులు మాత్రం సానుకూల వృద్ధి నమోదు చేశాయి.

నిరాశపర్చే గణాంకాలు..
ఏప్రిల్‌లో ఎగుమతుల వృద్ధి అంత ఆశావహంగా లేదని వాణిజ్య ప్రోత్సాహక మండలి (టీపీసీఐ) చైర్మన్‌ మోహిత్‌ సింగ్లా చెప్పారు. అయితే, సానుకూల ధోరణి కొనసాగించగలిగామని ఆయన పేర్కొన్నారు. టీ, సుగంధ ద్రవ్యాలు, ఫలాలు, కూరగాయలు వంటి వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల్లో సానుకూలత కనిపించినట్లు చెప్పారు. కార్మిక శక్తి అత్యధికంగా ఉండే అన్ని రంగాలు ప్రతికూల పరిస్థితుల్లోనే ఉండటంతో ఎగుమతుల గణాంకాలు నిరాశపర్చేవిగా ఉన్నాయని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) ప్రెసిడెంట్‌ గణేష్‌ కుమార్‌ గుప్తా చెప్పారు.

‘నిధుల కొరతతో పాటు అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలు, రక్షణాత్మక ధోరణులు, ప్రపంచవ్యాప్తంగా బలహీన వ్యాపార పరిస్థితులు, దేశీయంగా అనేక పరిమితులు తదితర అంశాల కారణంగా ఈ రంగాలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. ఒక వైపు చమురు ధరలు పెరుగుతుండటం, మరోవైపు ఇరాన్‌ నుంచి దిగుమతులపై ఆంక్షల నేపథ్యంలో పసిడి, చమురు దిగుమతుల భారం ఎగుస్తుండటంతో వాణిజ్య లోటు మరింత పెరుగుతుండటంపై గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధాల భయాలతో అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితులు మరింతగా దిగజారవచ్చన్నారు. రాబోయే రోజుల్లో భారత ఎగుమతులపై మరింత ఒత్తిడి పెరగవచ్చన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top