జిల్లాలో ప్రగతి పడకేసింది. ప్రభుత్వ శాఖల, పథకాల వార్షిక లక్ష్యాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి.
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రగతి పడకేసింది. ప్రభుత్వ శాఖల, పథకాల వార్షిక లక్ష్యాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. అభివృద్ధి అడుగు ముందుకు పడటం లేదు. వెనుకబడిన జిల్లాగా ఉన్న ముద్రను దశాబ్దాలుగా చెరిపేసుకోలేకపోతోంది. జిల్లా ప్రగతి రథ చక్రాలను ముందుకు తీసుకెళ్లడంలో అటు పాలకులు, ఇటు అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా లక్ష్యాలు నీరుగారుతున్నాయి.
పురోగతిలో ఉండాల్సిన గృహనిర్మాణం తిరోగమనంలో కొట్టుమిట్టాడుతోంది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ పనులు సక్రమంగా ముందుకు సాగడంలేదు. ఆర్‌అండ్‌బీ బ్రిడ్జిల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. పరిశ్రమల పురోగతీ అంతంత మాత్రంగానే ఉంది. నేటికీ పల్లెల్లో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడంలేదు. అంతర్గత రోడ్లు లేని గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి. పారిశుధ్యం నానాటికీ దిగజారుతోంది.
పంచాయతీరాజ్ శాఖ:
రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు లేకపోవడంతో ఏడాదిలోపే దెబ్బతింటున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం *250.67 కోట్ల వ్యయంతో 504 కిలోమీటర్ల రోడ్లు వేయాలని ప్రణాళిక రూపొందిస్తే కేవలం 200 కిలోమీటర్ల లోపే వేశారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంపై గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
171 కోట్లు మంజూరు చేస్తే కేవలం 31 కోట్లే ఖర్చు చేశారని మంత్రి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారంటే పనులు పురోగతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రహదారులతో పాటు పలు ప్రభుత్వ భవనాల నిర్మాణం వీరి పరిధిలోనే జరుగుతున్నా అవికూడా అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. పంచాయతీ, వెటర్నరీ భవనాలు కొన్ని నేటికీ స్థలాలు లేక ప్రారంభానికి నోచుకోలేదు.
ఆర్‌అండ్‌బీ బ్రిడ్జిల నిర్మాణం :
ఆర్‌అండ్‌బీ పరిధిలో జరుగుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాల్లో పురోగతి లేదు. కొత్తపట్నం రోడ్డులో అల్లూరు వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే బాలినేని పోరాడి ఎన్‌సీఆర్‌ఎంపీ పథకం నిధులు 3.90 కోట్లు మంజూరు చేయించారు. గత ఏడాది పనులు ప్రారంభించినా పనులు నిదానంగా సాగుతున్నాయి.
సూరారెడ్డిపాలెం మోటుమాల రోడ్డు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. వేసిన రెండేళ్లకే దెబ్బతింది. మళ్లీ ఆ రోడ్డుకు * 10 కోట్లు మంజూరయ్యాయి.2013-14లో ఒంగోలు సబ్ డివిజన్‌లో పలు బ్రిడ్జిలు మంజూరయ్యాయి. ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కార్యాలయానికి * 1.30 కోట్లు మంజూరయ్యాయి. కానీ పనులు ప్రారంభించలేదు.
ముందుకు సాగని మరుగుదొడ్ల నిర్మాణం:
జిల్లాలో 2,07,026 మరుగుదొడ్లు నిర్మించాలన్న లక్ష్యం నీరుగారుతోంది. సగం కూడా పూర్తి కాని పరిస్థితి. పల్లెల్లో నేటికీ 70 శాతం మంది బహిర్భూమికి వెళ్తున్నారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వలన కొత్తగా మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు.
పరిశ్రమలు కుదేలు :
జిల్లాలో అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ఔత్సాహికులు ముందుకు రావడం లేదు. దీనికి తోడు బ్యాంకులు రుణాలివ్వడంలో విముఖత చూపుతున్నాయి.
జిల్లాలో 71 భారీ, 335 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలున్నాయని అధికారులు చెబుతున్నా వాటిలో ఎన్ని సక్రమంగా పనిచేస్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ కింద మంజూరు చేస్తున్న పథకాలకు బ్యాంకర్లు మొకాలడ్డుతున్నారు. దీంతో వేలాది మంది నిరుద్యోగులు ఉపాధి లేక వలస బాట పడుతున్నారు.
తిరోగమనంలో గ్రామ స్వరాజ్యం :
గ్రామ స్వరాజ్యం కలగానే మిగులుతోంది. జిల్లాలో 1028 పంచాయతీలుండగా నేటికీ కొన్ని పంచాయతీ కార్యాలయాలకు భవనాలు లేవు. చెరువుగట్లు, సామాజిక భవనాల్లో సమీక్షలను సర్పంచ్‌లు నిర్వహించాల్సి వస్తోంది. మూడేళ్ల క్రితం 306 పంచాయతీ భవనాలు మంజూరైతే నేటికీ వాటిని పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
పునాదుల్లోనే కొన్ని మగ్గుతున్నాయి. ఇవిగాక సర్పంచులు అనేక సమస్యల తో సతమతమవుతున్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. కనీసం రోడ్లకు కూడా నోచుకోని గ్రామాలు కొల్లకొల్లలుగా ఉన్నా అవి పాలకులకు కనిపించడంలేదు.