పాలెన్ని?... నీళ్లెన్ని? | The end of the CII Partnership Summit | Sakshi
Sakshi News home page

పాలెన్ని?... నీళ్లెన్ని?

Jan 13 2016 2:24 AM | Updated on Sep 3 2017 3:33 PM

పాలెన్ని?... నీళ్లెన్ని?

పాలెన్ని?... నీళ్లెన్ని?

ఏదైనా ఎగ్జిబిషన్‌కు టిక్కెట్టు పెడితే ఒకలా... టిక్కెట్టు లేకపోతే మరోలా ఉంటుంది సందర్శకుల తాకిడి.

♦ ముగిసిన సీఐఐ భాగస్వామ్య సదస్సు
♦ రూ.4.67 లక్షల కోట్ల మేర  ఎంవోయూలు కుదిరాయన్న సీఎం చంద్రబాబు
♦ ఈ మొత్తంలో సాకారమయ్యేది ఎంతనేదే ప్రశ్న
 
 (విశాఖ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
 ఏదైనా ఎగ్జిబిషన్‌కు టిక్కెట్టు పెడితే ఒకలా... టిక్కెట్టు లేకపోతే మరోలా ఉంటుంది సందర్శకుల తాకిడి. ఎందుకంటే టిక్కెట్టు కొని ఎగ్జిబిషన్‌కు వెళ్లేవారిలో చూడటానికి మాత్రమే వెళ్లేవారు తక్కువ. ఏదో ఒకటి కొందామన్న ఉద్దేశంతో వెళ్లేవారే ఎక్కువ. అదే ఫ్రీ ఎగ్జిబిషన్ అయితే... పోయేదేముందిలే అన్న రీతిలో వెళ్లేవారే అధికంగా ఉంటారు. ఒక రకంగా విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు కూడా టికెట్ లేని ఎగ్జిబిషన్‌నే తలపించిందనేది కొందరు సీరియస్ పారిశ్రామికవేత్తల మాట. మూడురోజుల సదస్సు సందర్భంగా రాష్ట్రంలో రూ.4.67 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారని ముఖ్యమంత్రి చెప్పారు.

అయితే చివరకు సాకారమయ్యేది ఎంతనేదే ప్రశ్న. నిజానికి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే ఎవ్వరికైనా సంతోషమే. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే అది ఎవ్వరైనా ఆహ్వానించాల్సిన పరిణామమే. కాకపోతే దాన్ని భూతద్దంలో చూపించేసి... ఎంఓయూ కూడా కాకముందే ఆ పరిశ్రమలు వచ్చేసినట్లుగా... రాష్ట్రం నంబర్ వన్‌గా మారిపోయినట్లుగా చిత్రించే ప్రయత్నాలు ఎక్కువ జరిగాయన్నది సీఐఐ సదస్సు చూసినవారికి అర్థంకాక మానదు. ఈ ప్రచారార్భాటాల వల్ల అనవసరమైన ఆశలు రేగుతాయన్న విమర్శలూ లేకపోలేదు.

 అంచనాలు మించాయంటే అర్థమేంటి?
 ఇక్కడ రెండు మూడు విషయాలు గమనించాలి. ప్రభుత్వం మొదట రూ.2 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరగొచ్చని అంచనా వేసింది. ముఖ్యమంత్రి చెప్పినదానిని బట్టి.. తొలిరోజు ఒప్పందాలే ఆ అంచనాను అందేశాయి. ఇక రెండు, మూడు రోజుల్లో ప్రకటించిన ఎంఓయూలన్నీ కూడా అంచనాలకు మించినవే. బోనస్సే. అందుకే ఇటు ముఖ్యమంత్రితోపాటు అటు సీఐఐ వర్గాలు సైతం... సదస్సుకు ఊహించని స్పందన వచ్చిందంటూ ఆశ్చర్యం, హర్షం వ్యక్తం చేశారు. అయితే ఊహించని స్పందన వస్తే పొంగిపోవడానికి ఇదేమీ కొత్త సినిమా కాదు.

ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు ఒక అంచనా వేశాయంటే దానర్థమేంటి? అప్పటిదాకా వచ్చిన దరఖాస్తులు చూసి, వాటిలో అర్హమైనవి నిగ్గు తేల్చి... వాటిద్వారా వచ్చే పెట్టుబడులు అంచనా వేశాయనే కదా!!. మరి అంచనాలు మించిపోయాయంటే ఏమనుకోవాలి? అవన్నీ అప్పటికప్పుడు హడావుడిగా వచ్చిన దరఖాస్తులనే కదా? వాటిలోని కచ్చితత్వాన్ని, సదరు దరఖాస్తుదారుల సామర్థ్యాన్ని నిగ్గు తే ల్చే సమయం కూడా లేకపోయిందనేగా అర్థం? ఏదో చివర్లో ఒకటో, రెండో సంస్థలు అప్పటికప్పుడు వచ్చాయంటే అనుకోవచ్చు. కానీ అనుకున్న దానికన్నా ఏకంగా 150 శాతం అధికంగా వచ్చాయంటే అర్థమేంటి?

 సాకారమయ్యేదెంత?
 ఈ వచ్చిన దరఖాస్తుల్లో సాకారమయ్యే శాతం ఎంతుంటుందనే విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో లెక్కుంది. 25 శాతం కావొచ్చని, అలా అయినా సంతోషించాల్సిన విషయమేనని సీఐఐ ఏపీ శాఖ చైర్మన్ పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో పరిశ్రమలకు సంబంధించిన కీలక విభాగానికి సారథ్యం వహిస్తున్న ఓ ఐఎస్‌ఎస్ అధికారి... సదస్సు నేపథ్యంలో కొందరు పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదే అంశం చర్చకు రావటం కనిపించింది. ఓ 30 శాతం గ్రౌండ్ అవుతాయా? అని పారిశ్రామికవేత్తలు అడిగినప్పుడు ఆయన పెద్దగా నవ్వారు. పోనీ 20 శాతం? అన్నప్పుడు కూడా ఆయనది అదే ఫీలింగ్.

10-15 శాతం సాకారమైతే 100 శాతం అయినట్టే భావించాల్సి ఉంటుందన్నది ఆయన రియాక్షన్. దీనిపై మరో పారిశ్రామిక వేత్తను కదపగా... ఏ సదస్సులోనైనా ఇది సహజమని ఆయన అన్నారు. ఇప్పటికే పలు పరిశ్రమలను విజయవంతంగా నిర్వహిస్తున్న మరో పారిశ్రామికవేత్త స్పందన మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ‘స్టార్టప్ కంపెనీల్లాంటివి కూడా వచ్చి ఎంఓయూలు చేసుకున్నాయి. వాటికి వేరే వేదిక ఉంటే బాగుండేది. వాటిని ప్రత్యేకంగా డీల్ చెయ్యాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. ప్రభుత్వం ఈ ఒప్పందాల్లో భాగంగా కొందరికి భూములివ్వటానికి కూడా ఒప్పుకుందని గుర్తుచేస్తూ... ‘భూముల కోసం దరఖాస్తు చేసిన కంపెనీలు భారీ పెట్టుబడికి హామీలిచ్చాయి.

కనీసం అలాంటి సంస్థలకైనా వారు పెట్టుబడి పెడతామన్న మొత్తంలో తక్కువలో తక్కువగా 0.5 శాతాన్ని డిపాజిట్ చెయ్యమని అడిగి ఉంటే బాగుండేది. ఆ తర్వాత దాన్ని మాఫీ చేయొచ్చు. అలా చేసి ఉంటే ఈ స్థాయి పెట్టుబడులు వినిపించేవి కాదు’ అని వివరించారు. వినటానికి ఈ ప్రతిపాదన వింతగా ఉన్నా... అసలు పారిశ్రామికులెవరో వడపోయాలంటే ఇదే కరెక్ట్టు పద్ధతేమో అన్పించక మానదు.

 భూములు తనఖా పెట్టే కంపెనీలు కూడా..?
 భూముల కోసం వివిధ కంపెనీల పేరిట... వివిధ మార్గాల్లో వచ్చే సంస్థలూ వీటిలో ఉండొచ్చన్నది మరికొందరు లోపాయికారీగా చెప్పిన మాట. ఇప్పటికే పలు పరిశ్రమలు పెట్టి, చక్కని ట్రాక్ రికార్డు ఉన్న కంపెనీతో ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇప్పటికే తమ కంపెనీల్ని విజయవంతంగా నడిపిస్తూ విస్తరణ కోసం వచ్చినవాటితోనూ ఇబ్బంది లేదు. ఇప్పటికిప్పుడు ఏర్పాటై... ‘వినూత్నమైన’ ఆలోచనలతో ముందుకొచ్చిన వాటితోనే ఇబ్బందంతా. ‘ఇలాంటి సంస్థలు భూములు తమ చేతికి దక్కగానే బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకుంటాయి. ఆ నిధులను మళ్లిస్తాయి కూడా. కాలం బాగుంటే అవి మళ్లీ ఉద్దేశించిన పరిశ్రమలోకి వస్తాయి. లేకుంటే బ్యాంకులో, ప్రభుత్వమో నష్టపోక తప్పదు’ అంటూ మరో పారిశ్రామికవేత్త వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది కూడా విశాఖలోనే సీఐఐ సదస్సు జరపాలని ముఖ్యమంత్రి గట్టిగా భావిస్తున్నారు కనక... అప్పటిలోగా పాలేవో... నీళ్లేవో తెలిసిపోతుందని ఆయన వ్యాఖ్యానించటం కొసమెరుపు.
 
 ట్రైనాతో నవంబర్‌లోనే ఒప్పందం!
 సదస్సు ముగింపు సందర్భంగా.. కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎంత వేగంగా కదులుతున్నాయో ముఖ్యమంత్రి వివరించారు. ట్రైనా సోలార్ సంస్థ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదన చేయటం దగ్గర్నుంచి భూమి పూజ చేయటం వరకు రెండు నెలల్లోనే జరిగిందని చెప్పారు. ‘ఈ రోజు ఎంఓయూ చేసుకున్నాం. అచ్యుతాపురంలో ప్లాంటు ఏర్పాటుకు ఈరోజే వాళ్లు భూమిపూజ కూడా చేస్తున్నారు’ అని తెలిపారు. నిజానికి చైనాకు చెందిన ట్రైనా సోలార్... యూరప్, అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వంతోనూ చర్చలు జరుపుతోంది.

నవంబర్‌లోనే ఇరువురి మధ్య అవగాహన కుదిరింది. రూ.2,800 కోట్లతో విశాఖ జిల్లాలోని అచ్యుతాపురంలో సోలార్ సెల్ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయడానికి ఎంఓయూ కుదిరినట్లు గతేడాది నవంబర్ 18నే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత భూమి కేటాయింపు కూడా జరగటంతో మంగళవారం భూమిపూజ చేయగలిగింది. అయితే సీఐఐ సదస్సు సందర్భంగా మంగళవారమే ట్రైనాతో ఎంఓయూ కుదిరిందని ముఖ్యమంత్రి చెప్పటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement