రేపే రోదసీలోకి పీఎస్‌ఎల్‌వీ సీ46

PSLV C46 Countdown Begins Today - Sakshi

సాక్షి, సూళ్లూరుపేట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి బుధవారం ఉదయం 5.30 గంటలకు నింగికెగసేందుకు పీఎస్‌పీఎల్‌ సీ46 సిద్ధమైంది. మంగళవారం ఉదయం 4.30 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాలులో సోమవారం మిషన్‌ సంసిద్ధత సమావేశం (ఎంఆర్‌ఆర్‌)ను కమిటీ చైర్మన్‌ బీఎన్‌ సురేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎంఆర్‌ఆర్‌ కమిటీ రాకెట్‌కు సంబంధించి లాంచ్‌ రిహార్సల్స్‌ను నిర్వహించారు. అనంతరం ప్రయోగ పనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌)కి అప్పగించారు. ల్యాబ్‌ చైర్మన్‌ ఎస్‌.పాండ్యన్‌ ఆధ్వర్యంలో మరో మారు లాంచ్‌ రిహార్సల్స్‌ నిర్వహించి కౌంట్‌డౌన్‌ సమయాన్ని ప్రయోగానికి 25 గంటల ముందు అంటే మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. ప్రయోగ పనుల్లో ఇస్రో శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. మంగళవారం సాయంత్రానికి ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ షార్‌కు రానున్నారు.

ప్రయోగం ఇలా..
సతీస్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ46 ఉపగ్రహ వాహక నౌక ద్వారా 615 కిలోల బరువు కలిగిన రిశాట్‌–2బీ అనే (రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌) దూర పరిశీలనా ఉపగ్రహాన్ని భూమికి 557 కిలోమీటర్లు ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ రాకెట్‌ను నాలుగు దశల్లో స్ట్రాపాన్‌ బూస్టర్లు లేకుండా చేస్తున్నారు. 44.4 మీటర్లు ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగ సమయంలో 290 టన్నుల బరువుతో ప్రయాణం ప్రారంభమవుతుంది. 20 మీటర్లు ఎత్తు కలిగి 2.8 వెడల్పు ఉన్న 139 టన్నుల ఘన ఇంధనంతో 1.50 నిమిషాలకు మొదటి దశను పూర్తి చేస్తారు.

12.8 మీటర్లు ఎత్తు, 2.5 వెడల్పు కలిగిన రెండో దశలో 41 టన్నుల ద్రవ ఇంధనంతో 4.22 నిమిషాలకు, 3.6 ఎత్తు 2 మీటర్లు వెడల్పు కలిగిన మూడో దశలో 7.65 ఘన ఇంధనంతో 9.23 నిమిషాలకు, మూడు మీటర్లు ఎత్తుకలిగి 1.34 వెడల్పు కలిగిన నాలుగోదశలో 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 14.42 నిమిషాలకు పూర్తి చేసిన అనంతరం 15.29 నిమిషాలకు 615 బరువు కలిగిన రిశాట్‌–2బీ ఉపగ్రహాన్ని భూమికి 557 కి.మీ. ఎత్తులోని సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లో 37 డిగ్రీల అక్షాంశంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహం ఐదేళ్ల పాటు అంతరిక్షంలో ఉండి సేవలు అందిస్తుంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ కోర్‌ అలోన్‌ దశతో 14వ ప్రయోగం, ఈ ఏడాది 3వ ప్రయోగం, మొదటి ప్రయోగ వేదిక నుంచి 36వ ప్రయోగం, పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 48వ ప్రయోగం, షార్‌ కేంద్రం నుంచి 72వ ప్రయోగం కావడం విశేషం.

వ్యవసాయ రంగానికి ఉపయోగం
పీఎస్‌ఎల్‌వీ సీ46 రాకెట్‌ ద్వారా పంపించబోయే రిశాట్‌–2బీ ఉపగ్రహం రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహం. రిశాట్‌ ఉపగ్రహాల సిరీస్‌లో నాలుగో ఉపగ్రహం కావడం విశేషం. 615 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహంలో ఎక్స్‌ బ్యాండ్‌ రాడార్‌ అనే ఉపకరణాన్ని అమర్చి పంపుతున్నారు. ఈ ఉపగ్రహం వ్యవసాయ రంగానికి, అటవీ శాఖకు, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన విషయాన్ని సేవలు అందిస్తుంది. భూమిపై ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా అత్యంత నాణ్యమైన ఛాయాచిత్రాలను అందిస్తుంది. ఇప్పటిదాకా రిశాట్‌–1, రిశాట్‌–2, స్కాట్‌శాట్‌ అనే మూడు ఉపగ్రహాలు వ్యవసాయ, అటవీ, ప్రకృతి వైపరీత్యాలకు సేవలు అందిస్తున్నాయి. ఈ ఉపగ్రహం కూడా అదే రకమైన సేవలను అందిస్తుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top