‘విద్యుత్ సరఫరాలో అసమానతల్ని తొలగించా లి. వినియోగదారులకు మెరుగైన సేవలందించాలి...’ ఇదే లక్ష్యంతో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) చర్యలు చేపట్టింది.
- మెరుగైన ‘విద్యుత్తు’ సేవలకు ఈపీడీసీఎల్ సన్నద్ధం
- వంద రోజుల ప్రణాళికతో చర్యలు
- సౌర విద్యుదుత్పత్తికి ప్రోత్సాహం
- ఆస్తుల సంరక్షణకు ప్రత్యేక సర్వే
సాక్షి, విశాఖపట్నం: ‘విద్యుత్ సరఫరాలో అసమానతల్ని తొలగించా లి. వినియోగదారులకు మెరుగైన సేవలందించాలి...’ ఇదే లక్ష్యంతో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) చర్యలు చేపట్టింది. ఇందుకు రూ.వందల కోట్లు కేటాయించింది. మరోవైపు ఈపీడీసీఎల్ ఆస్తుల సంరక్షణ, తక్షణ మరమ్మతు చర్యల కోసం వంద రోజుల ప్రణాళికనూ సిద్ధం చేసింది.
రూ. 61.11 కోట్లతో డీడీజీ ప్రాజెక్టులు...
రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుత్ యోజన పథకంలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రూ. 61.11 కోట్లతో వికేంద్రీకృత పంపి ణీ, ఉత్పత్తి (డీడీజీ) ప్రాజెక్టుల్ని ఈపీడీసీఎల్ అధికారులు ప్రారంభించారు. ఇం దులో భాగంగా ఇప్పటికే రూ. 16.62 కోట్లతో 9 మండలాల్లోని 57 గిరిజన గ్రా మాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. విశాఖపట్నం (183), శ్రీకాకుళం (11) జిల్లాల్లోని మొత్తం 194 గిరిజన గ్రామాల్లో రూ. 44.49 కోట్ల వ్యయంతో విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీన్ని సోలార్ ఫొటోవాల్టిక్ (ఎస్‌పీవీ) విధానంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 5,592 గృహాలకు విద్యుత్ సౌకర్యం కలుగుతుంది.
రూ. 105.52 కోట్లతో 69 సబ్‌స్టేషన్లు...
ప్రస్తుతం ఈపీడీసీఎల్ పరిధిలో 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 647 ఉన్నాయి. వీటి ద్వారా 50 లక్షల మంది వినియోగదారులకు సేవలందుతున్నాయి. ఇవిగాక రూ. 9.36 కోట్లతో శ్రీకాకుళంలోని గొప్పిల్లి, అక్కుపల్లి, తెలుకుంచిలో మూడు ఔట్‌డోర్ సబ్‌స్టేషన్లు, విశాఖలోని సీతమ్మధార, పాండురంగాపురం, టౌన్‌కొత్తరోడ్డులో మూడు ఇండోర్ సబ్‌స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయి. రానున్న రెండేళ్లలో రెండు దశల్లో కొత్తగా 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 69 నిర్మించనున్నారు. తొలి దశలో రూ. 74.81 కోట్లతో 49 సబ్‌స్టేషన్లను ప్రతిపాదించారు. ఇందులో ఇప్పటికే 11 సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులకు కేటాయింపులు జరిగాయి. మిగిలినవి టెండర్ దశలో ఉన్నాయి. రెండో దశలో రూ. 30.71 కోట్లతో 20 సబ్‌స్టేషన్ల నిర్మాణానికి బిడ్స్ రూపొందిస్తున్నారు.
భూ సంరక్షణకు ప్రత్యేక వ్యవస్థ...
ఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాలో సంస్థకు చెందిన భవనాలు, భూముల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 647 సబ్‌స్టేషన్లకు కేటాయించిన సుమారు 1,250 ఎకరాల స్థలాలపై సర్వే చేయించనున్నారు. సంస్థకు చెందిన స్థలాల పరిరక్షణకు కంచె లేదా ప్రహరీ నిర్మించనున్నారు. ఆక్రమణలో ఉన్న ఈపీడీసీఎల్ భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటైంది. ఇందుకోసం సర్వే విభాగం నుంచి అసిస్టెంట్ డెరైక్టర్ ను ఈపీడీసీఎల్‌కు ప్రత్యేకంగా కేటాయించారు.
ఎనర్జీ పార్కు, సౌర విద్యుత్...
నిర్మాణం, నిర్వహణ, బదలాయింపు (బూట్) విధానంలో ఎనర్జీ పార్కు నిర్మాణానికి ఈపీడీసీఎల్ ఆసక్తి వ్యక్తీకరణలను ఆహ్వానించింది. ఆధునిక, తరిగిపోని ఇంధన వనరుల్ని ఈ పార్కులో ఏర్పాటు చేయనున్నారు. పిల్లలు, విద్యార్థులు, ప్రజలు సందర్శించి విద్యుత్ ఆవశ్యకత, పొదుపు చర్యల్ని తెలుసుకునేందుకు ఇది దోహదపడనుంది. మరోవైపు ఆన్ గ్రిడ్ విధానంలో రూఫ్‌టాప్ సౌర విద్యుత్ ప్రోత్సాహ చర్యలు చేపడుతున్నారు.
ఇందుకు ఈపీడీసీఎల్ భవనాలపైనున్న సుమారు లక్ష చదరపు అడుగుల ఖాళీ స్థలాన్ని కేటాయించారు. రానున్న ఆరు మాసాల్లో ఒక మెగావాట్ సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు.