పడగ విప్పుతున్న డెంగీ!

Dengue Fever in Kurnool - Sakshi

జ్వరపీడితులతో ఆసుపత్రులు కిటకిట

ప్లేట్‌లెట్ల కోసం బ్లడ్‌బ్యాంకులకు పరుగులు

208 మందికి వ్యాధి లక్షణాలు

9 మందికి నిర్ధారణ

లెక్కకు రాని కేసులు అధికం

కర్నూలు(హాస్పిటల్‌): జ్వరమా..ఒళ్లునొప్పులా..కళ్లు ఎర్రగా మారాయా..తీవ్రంగా తలనొప్పి వస్తోందా? అయితే డెంగీ జ్వరం కావచ్చు అంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ముందుగా డెంగీ పరీక్ష చేస్తున్నారు. కొందరు అవసరం ఉన్నా లేకపోయినా ప్లేట్‌లెట్లు ఎక్కిస్తున్నారు. ఈ రక్తకణాలకు డబ్బులు కట్టలేక రోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారు. జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు నంద్యాలలో జిల్లా ఆసుపత్రి, ఆదోని, ఎమ్మిగనూరు లో ఏరియా ఆసుపత్రులు, 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. వీటితో పాటు 700లకు పైగా నర్సింగ్‌హోమ్‌లు, క్లినిక్‌లు రోగులకు వైద్యసేవలు అందిస్తున్నాయి. నెలరోజుల నుంచి వాతావరణంలో మార్పులు రావడంతో వైరల్‌ ఫీవర్లు అధికమయ్యాయి. ఇందులో మలేరియా, డెంగీ జ్వరాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో డెంగీ జ్వర పీడితులు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. వ్యాధి లక్షణాలతో ఆసుపత్రికి రాగానే వైద్యులు ముందుగా ర్యాపిడ్‌ పరీక్ష చేయిస్తున్నారు. అందులో డెంగీగా నిర్ధారణ అయితే వెంటనే రక్తకణాల పరీక్షలు చేస్తున్నారు. కణాల సంఖ్య తక్కువగా ఉంటే వెంటనే రక్తం, ప్లేట్‌లెట్లు తెచ్చుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యం ప్రతి ఆసుపత్రిలో కనిపిస్తోంది. సగటున ప్రతి ఆసుపత్రిలో ఒకరు డెంగీ లక్షణాలతో బాధపడుతున్న రోగులు ఉన్నారు.  

జిల్లాలో 208 మందికి డెంగీ లక్షణాలు
జిల్లాలో డెంగీ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత జూన్‌ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 208 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. అయితే ఇందులో వ్యాధి నిర్ధారణ అయింది 9 మందికి మాత్రమే అని వారు చెబుతున్నారు. వాస్తవంగా డెంగీ బాధితుల సంఖ్య దీనికి రెట్టింపుగానే ఉంటోందని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు స్పష్టం చేస్తున్నారు. డెంగీ వ్యాధి ఉందని చెబితే అధికారుల నుంచి తీవ్రంగా ఒత్తిళ్లు వస్తున్నాయని, ఈ కారణంగానే ఆసుపత్రిలోనే వైద్యం చేసి పంపిస్తున్నామని వారు పేర్కొంటున్నారు.   రెండు నెలల నుంచి ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ రక్తనిధిలో ప్లేట్‌లెట్లు(ఎస్‌డీపీ) తీసుకున్న వారు 15 మంది, పీఆర్‌పీ తీసుకున్న వారు 45 మందికి పైగా ఉండగా, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నెలకు పది మంది చొప్పున ఎస్‌డీపీ, 40 మంది దాకా పీఆర్‌పీ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే స్థాయిలో ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల్లోనూ రక్తకణాల కోసం ప్రజలు వెళ్తున్నారు.  

పారిశుద్ధ్యలోపం..
కర్నూలు నగర పాలక సంస్థతో పాటు మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు, పంచాయతీలలో పారిశుద్ధ్యం లోపించింది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ పేరుతో కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో అవి ఉపయోగపడటం లేదు. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి.. దోమలు విజృంభిస్తున్నాయి. వీటి నిర్మూలనకు ఎక్కడా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

డెంగీ వ్యాధి ఇలా సోకుతుంది..
శరీరంపై తెల్లటి చారలు ఉండే ఏడిస్‌ ఈజైప్టె అనే దోమకాటు కారణంగా డెంగీ వస్తుంది. ఈ దోమ   పగలు మాత్రమే కుడుతుంది. ఇది నిల్వ ఉన్న నీటిలో గుడ్లు పెడుతుంది. రెండు వారాలు మాత్రమే జీవించే ఇది మూడుసార్లు వంద గుడ్ల చొప్పున పెడుతుంది. ఈ దోమలు ఇంట్లో బట్టలు, పరుపులు, కర్టెన్స్‌ వెనుక దాక్కుంటాయి.  

వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు
డెంగీ వ్యాధి నిర్ధారణ అయిన వ్యక్తి ఉన్న ఇంటి పరిసరాల్లోని 50 ఇళ్లలో లార్వా నిర్మూలన చర్యలు తీసుకుంటున్నాం. గత జులై నుంచి నవంబర్‌ వరకు మొబైల్‌ మలేరియా, డెంగీ వాహనాల ద్వారా వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టాం. గిరిజన ప్రాంతాల్లో డీడీటీ స్ప్రే చేయించాం. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని ఆదేశించాం.–డేవిడ్‌రాజు, మలేరియా నియంత్రణాధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top